ప్రభాస్ 'సలార్'.. బెనిఫిట్ షోలపై కీలక నిర్ణయం!

19 Dec, 2023 18:51 IST|Sakshi

ప్రభాస్‌ నటించిన సలార్ ఈనెల 22న థియేటర్లలో సందడి చేయనుంది. ప్రశాంత్‌ నీల్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో సలార్ చిత్రబృందానికి తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. సలార్ మూవీ టికెట్ల ధరల పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. 

సలార్ చిత్రానికి రూ.65, రూ.100ల వరకు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. సాధారణ థియేటర్లలో, మల్టీఫ్లెక్సుల్లో మొదటి వారం రోజులు టికెట్ ధరలు పెంచుకునేందుకు అవకాశం కల్పించింది. ఈ నెల 22 నుంచి 28వ తేది వరకు టికెట్ ధరల పెంపు వర్తిస్తుందని తెలిపింది. అలాగే 22వ తేదీన అర్థరాత్రి 1 గంటకు బెన్ఫిట్ షోలకు అనుమతులిచ్చింది. 

రాష్ట్రంలోని పరిమిత థియేటర్లలో మాత్రమే సలార్ బెన్ఫిట్ షోకు అనుమతి ఇస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా 20 థియేటర్లలో మాత్రమే బెనిఫిట్‌ షోకు అవకాశం కల్పించింది. అలాగే ఆరో ఆట ప్రదర్శనకు ప్రభుత్వం ఓకే చెప్పిన ప్రభుత్వం.. రిలీజ్ రోజు ఉదయం 4 గంటల నుంచే సలార్ షోలు వేసుకోవచ్చని తెలిపింది. కాగా.. టికెట్ ధరల పెంపు, బెన్ఫిట్ షో, అదనపు షోలకు అనుమతి కోరుతూ మైత్రీ మూవీ మేకర్స్ దరఖాస్తు చేసుకోవడంతో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 

>
మరిన్ని వార్తలు