కంటితుడుపేనా?

8 Jul, 2014 00:54 IST|Sakshi
కంటితుడుపేనా?

 సాక్షి ప్రతినిధి, కర్నూలు: ‘మాది అలనాటి రాజధాని.. విశాల హృదయంతో విశాలాంధ్ర కోసం రాజధానిని త్యాగం చేసిన చరిత్ర మాది. రాజధాని వైభవాన్ని పూర్తిగా అనుభవించక ముందే హైదరాబాద్‌కు తరలించి తెలుగుజాతి ఐక్యతను చాటిచెప్పిన ఔదార్యం మాది. అలాంటి జిల్లాకు శివరాకృష్ణన్ కమిటీ రాష్ట్ర విభజన జరిగిన వెంటనే రావలసింది. కానీ కంటి తుడుపు చర్యగా కర్నూలుకు రావటం మా దురదృష్టం’ అని జిల్లాకు చెందిన మేధావులు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు
 
 గగ్గోలు పెడుతున్నారు. కర్నూలులో రాజధాని ఏర్పాటు చేయమని శివరామకృష్ణన్ కమిటీని కోరటం ఎడారిలో కేక పెట్టటమే తప్ప మరొక ప్రయోజనం కనిపించటం లేదంటున్నారు. అందుకు చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన కొద్ది రోజులకే విజయవాడ- గుంటూరు మధ్యే రాజధానిని ఏర్పాటు చేయనున్నట్లు పత్రికలు, టీవీల్లో వెలువడిన ప్రకటనలే నిదర్శనమంటున్నారు. ఇదే విషయంపై పలువురు మేధావులు కమిటీ ముందే అనుమానం వ్యక్తం చేశారు. కేవలం రాయలసీమ ప్రజలను మభ్యపెట్టేందుకే శివరామకృష్ణన్ కమిటీ తీరిగ్గా నెల రోజుల తరువాత పర్యటించటాన్ని జనం తప్పుపడుతున్నారు. అంతేకాకుండా అనారోగ్యంతో శివరామకృష్ణన్ కర్నూలుకు రాలేదు. కేవలం నలుగురు సభ్యులు మాత్రమే రావడంపై ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
 
ప్రత్యేక తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో రాష్ట్రంలోని పరిస్థితులను తెలుసుకునేందుకు అప్పటి కేంద్ర ప్రభుత్వం శ్రీకృష్ణ కమిటీని నియమించింది. ఆ కమిటీ కూడా జిల్లాలో పర్యటించింది. తెలంగాణ జిల్లాల కంటే కర్నూలు జిల్లా అన్ని రంగాల్లో వెనుకబడిందని కమిటీ సభ్యులు గుర్తించి, ఆ మేరకు నివేదిక ఇచ్చారు. ఆ కమిటీ రాకతో సీమకు న్యాయం జరుగుతుందని ప్రజలు భావించారు. నిద్రాహారాలు మాని సమైక్యాంధ్ర కోసం రేయింబవళ్లు ఉద్యమం చేశారు. అయినా ఫలితం లేకపోయింది. శ్రీకృష్ణ కమిటీ పర్యటన వల్ల ఒరిగిందేమీ లేదని ఆ తర్వాతి పరిణామాలు తేల్చేశాయి. ఇక రాజధాని ఎంపిక పరిశీలన కోసం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ పరిస్థితీ అంతే అని జనం అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి రాజధానిగా కర్నూలు నుంచి తీసుకెళ్లి అన్యాయం చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర విభజన తరువాత తిరిగి కర్నూలును రాజధానిని చేస్తారని జనం ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే ప్రస్తుత ప్రభుత్వ చర్యలు చూస్తుంటే కర్నూలుకు రాజధాని నీటి మూటలేనని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. శ్రీకృష్ణ కమిటీలాగానే.. శివరామకృష్ణన్ కమిటీ కూడా ఉంటుందని జిల్లా ప్రజలు స్పష్టం చేస్తున్నారు.
 
 అడుగడుగునా అధికారుల వైఫల్యాలు: శివరామకృష్ణన్ కమిటీ కోస్తాంధ్రలో పర్యటించి నివేదిక ఇచ్చేశారనే ప్రచారం జరుగుతోంది. అయితే సీమ ప్రజలు ఆగ్రహానికి గురికాకుండా ఉండేందుకు నెల రోజుల తరువాత తీరిగ్గా కమిటీ పర్యటిస్తోందని పలువురు మేధావులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వచ్చీ రాగానే కారులో కర్నూలు నగరంలో పర్యటించారు. రాజధాని కోసం ఎదురుచూస్తున్న కర్నూలు ప్రజలు కమిటీకి వారి ఆవేదనను వివరించే అవకాశాన్ని కూడా అధికారులు ఏర్పాటు చేయలేకపోయారు. కనీసం జిల్లాలోని ఎమ్మెల్యేలకూ కమిటీ పర్యటన విషయాన్ని తెలియజేయకపోవటం గమనార్హం. అదే విధంగా అనేక మంది కమిటీకి నివేదించేందుకు ఎదురుచూస్తున్న సమయంలో కలెక్టర్ సమావేశ మందిరంలో చర్చావేదికను ఏర్పాటు చేయటంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతసేపు గందరగోళం నెలకొంది. శివరామకృష్ణన్ కమిటీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. చివరకు జేసీ కన్నబాబు కలుగజేసుకుని సునయన ఆడిటోరియంలోకి చర్చా వేదికను మార్చారు.  
 
 సీమకు మళ్లీ అన్యాయం తప్పదు: రాయలసీమకు మరోసారి అన్యాయం తప్పదని పలువురు కమిటీ ముందు స్పష్టం చేశారు. 50 ఏళ్లకు ముందు రాజధానిని తరలించుకెళ్లి అభివృద్ధిలో కర్నూలును వెనక్కు నెట్టేశారు. మళ్లీ ఇప్పుడు కోస్తాంధ్రలో రాజధానిని ఏర్పాటు చేయడానికి సిద్ధమై సీమకు పూర్తిగా అన్యాయం చేస్తున్నారని శర్మ అనే వృద్దుడు ఆందోళన వ్యక్తం చేశారు. ‘జిల్లాలో రాళ్లు, నీరు, మట్టి, ఘనులు, నల్లమల అడవులు సమృద్ధిగా ఉన్నాయి. రాజధాని ఏర్పాటుకు అవసరమైనవన్నీ పుష్కలంగా ఉన్నాయి. అయితే రిచ్ పీపుల్స్ చెప్పుచేతల్లో రాజధాని ఏర్పాటు ఆధారపడి ఉంది. ఆ రిచ్ పీపుల్స్ అంతా కోస్తాంధ్రలో ఉన్నారు. అందుకే వారు చెప్పిన దానికి ప్రభుత్వం తలూపుతోంది. కార్పొరేట్  వ్యాపారుల చేతుల్లో రాజధాని నిర్ణయం ఆధారపడి ఉండటం అన్యాయం’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు