కాన్పు కోసం వెళ్లి వివాహిత మృతి

19 Mar, 2016 04:12 IST|Sakshi
కాన్పు కోసం వెళ్లి వివాహిత మృతి

ఆసుపత్రిని ధ్వంసం చేసిన  బంధువులు
రాజీచేసిన అధికార పార్టీ నేతలు

 
 ఉదయగిరి : కాన్పు కోసం వివాహిత ఆసుపత్రికి వెళ్లి మృతిచెందిన సంఘటన ఉదయగిరిలో చోటుచేసుకుంది. దీంతో వివాహిత బంధువులు వైద్యశాలను ధ్వంసం చేశారు. బాధితుల కథనం మేరకు.. స్థానిక షబ్బీర్ కాలనీకి చెందిన పుట్టా ఆదిలక్ష్మి (20) గర్భిణి. గురువారం రాత్రి ఆమెకు నొప్పులు రావడంతో 7.30 గంటల ప్రాంతంలో కుటుంబసభ్యులతో కోట్నీస్ వైద్యశాలకు వచ్చింది. అక్కడ డాక్టర్ శ్యాంప్రసాద్ ఆమెను అడ్మిట్ చేసుకున్నారు. సిబ్బంది కాన్పయ్యేందుకు కొన్ని రకాల ఇంజెక్షన్లు, మాత్రలు ఇచ్చారు. రాత్రి ఒంటిగంట ప్రాంతంలో అక్కడ పనిచేస్తున్న ఓ మంత్రసాని సాయంతో ఆదిలక్ష్మి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ సమయంలో వైద్యుడు శ్యాంప్రసాద్ అక్కడ లేకుండా నిద్రపోతున్నారు. ఆదిలక్ష్మికి బ్లీడింగ్ ఎక్కువ కావడంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లింది. దీంతో ఆందోళనపడ్డ సిబ్బంది నిద్రపోతున్న వైద్యుడిని లేపడానికి ప్రయత్నించారు.

అయితే ఆయనవైపు నుంచి స్పందన రాలేదు. దీంతో ఆందోళన చెందిన బంధువులు తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో మెరుగైన వైద్యం కోసం ఆత్మకూరు తరలించేందుకు నిర్ణయించుకొని వాహనాన్ని తెచ్చుకున్నారు. ఇంతలో వైద్యుడు పేషంట్ వద్దకు వచ్చి ఖంగారు పడాల్సిన అవసరం లేదని, తానే చూస్తానని బంధువులకు చెప్పడంతో వారు అక్కడే ఉండిపోయారు. ఈ క్రమంలో 4.30 గంటల ప్రాంతంలో ఆదిలక్ష్మి ప్రాణాలు వదిలింది. దీంతో లబోదిబోమంటూ బంధువులు తమ దగ్గరి వారికి ఫోన్ ద్వారా సమాచారం అందించారు. ఉదయం 7 గంటల ప్రాంతంలో మృతురాలి బంధువులు పెద్ద ఎత్తున వైద్యశాలకు చేరుకొని డాక్టర్ నిర్లక్ష్యంపై విరుచుకుపడ్డారు. కొంతమేర ఫర్నీచర్, కిటికీలు పగలగొట్టారు. దాడి జరగవచ్చని భావించిన వైద్యుడు ముందుగానే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఐదు గంటలకే ఎస్సై వెంకటరెడ్డి, విజయకుమార్ తమ సిబ్బందితో ఆసుపత్రి వద్దకు చేరుకున్నాడు. డాక్టర్, సిబ్బందిపై దాడి జరగకుండా అడ్డుకున్నారు.

 అధికార పార్టీ నేతల రంగప్రవేశం :
అధికార పార్టీకి చెందిన కొద్దిమంది నేతలు వైద్యుడి తరపున రంగప్రవేశం చేసి మృతురాలి బంధువులతో బేరసారాలకు దిగారు. ఇరువురుకి రాజీ కుదిర్చారు. ఈ వ్యవహారంలో పెద్ద మొత్తంలో నగదు చేతులు మారినట్లు తెలుస్తోంది. ఈ విషయమై డాక్టర్ శ్యాంప్రసాద్‌ను సాక్షి ఫోన్ ద్వారా వివరణ అడిగేందుకు ప్రయత్నించగా ఆయన స్పందించలేదు. డిప్యూటీ డీఎంహెచ్‌ఓ రాంప్రసాద్‌ను వివరణ అడగ్గా ఆయన ఈ ఘటనపై విచారణ చేసేందుకు గండిపాలెం పీహెచ్‌సీ వైద్యుడు ఫైరోజ్‌ను నియమించామన్నారు. పూర్తిస్థాయి నివేదిక తీసుకొని జిల్లా వైద్యాధికారికి నివేదిస్తామని, ఆయనకు ఫోన్ ద్వారా విషయం చెప్పామన్నారు.

>
మరిన్ని వార్తలు