హౌసింగ్‌ స్కీం రియల్‌ ఎస్టేట్‌

19 Dec, 2017 07:20 IST|Sakshi

ప్రభుత్వం చేపట్టే ఇళ్ల నిర్మాణం రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాన్ని తలపిస్తోంది. కనీస మౌలిక  వసతులకూ ముక్కు పిండి డబ్బు వసూలు చేస్తుండటమే ఇందుకు నిదర్శనం. అధికారంలోకి వచ్చి మూడున్నరేళ్లు కావస్తున్నా ఇప్పటివరకు ఒక్క ఇంటి నిర్మాణం కూడా చేపట్టకుండా ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతూ కాలం వెళ్లదీస్తోంది. 

ప్రొద్దుటూరు టౌన్‌ :  జిల్లాలో మొదటి విడత హౌసింగ్‌ ఫర్‌ ఆల్‌ స్కీం కింద 2017–18కి కడప కార్పొరేషన్, ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో 2వేలు చొప్పున  ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చాయి. కడప కార్పొరేషన్‌లో 4వేలు, ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో 7వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తు చేసుకున్న వారి ఇళ్ల వద్దకు వెళ్లి పరిశీలించగా కడపలో 1982 మంది, ప్రొద్దుటూరులో 900 మంది అంగీకారపత్రాలను ఇచ్చారు. వీరిలో కడప కార్పొరేషన్‌లో 800 మంది తమకు నచ్చిన కేటగిరీ ఇళ్లకు తమ వాటాగా డీడీలు తీయగా, ప్రొద్దుటూరులో ఇంకా ఈ ప్రక్రియ ప్రారంభం కాలేదు. 2018–19 ఏడాదికి సంబంధించి రెండో విడతలో కడప కార్పొరేషన్‌ పరిధిలో 2281, మున్సిపాలిటీల్లోని ప్రొద్దుటూరులో  2150, రాజంపేటలో 1279, జమ్మలమడుగులో 1415, ఎర్రగుంట్ల 2046, పులివెందులలో 2143, బద్వేలులో 888, రాయచోటిలో 1011 ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం టార్గెట్‌ విధించింది.

ప్రభుత్వమే డబ్బు, స్థలం ఇచ్చి
దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో పేదలకు ప్రభుత్వం రెండు సెంట్ల స్థలంతోపాటు ఒక్కో ఇంటికి రూ.80వేలు ఇచ్చి ఉచితంగా ఇళ్లను నిర్మించారు. ప్రస్తుత ప్రభుత్వం మూడు రకాల ఇళ్లను నిర్మిస్తున్నామని ప్రచారం చేస్తోంది. కేటగిరీ ఒకటిలో ఉన్న వాటిని 300 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తుండగా లబ్దిదారుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే సబ్సిడీ రూ.3లక్షలు పోను, బ్యాంకు రుణం రూ.2.65లక్షలకు 30 ఏళ్లకు వడ్డీతో సహా రూ.11లక్షల 95వేల 300 చెల్లించాల్సి ఉంటుంది. రెండో కేటగిరిలో 365 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించే ఇంటికి సబ్సిడీ పోను బ్యాంకు రుణం రూ.3.65 లక్షలకు వడ్డీతో రూ.14లక్షల 48వేల 200, మూడో కేటగిరి కింద 430 చదరపు అడుగుల ఇంటికి సబ్సిడీ పోను బ్యాంకు రుణం రూ.4.65లక్షలకు లబ్ధిదారుడు రూ.17లక్షల 54వేలు 400 వడ్డీతో సహా చెల్లించాల్సి ఉంటుంది. ఏ కారణం వల్ల అయినా లబ్ధిదారుడు బ్యాంకులకు కంతులు చెల్లించకపోతే బ్యాంకులు ఇళ్లు జప్తు చేసే పరిస్థితి ఉంది. ఈ ఇళ్ల నిర్మాణానికి చదరపు అడుగుకు ప్రభుత్వం రూ.2,100 ముక్కుపిండి ప్రజల నుంచి వసూలు చేస్తోంది. ఇందులోనే మౌలిక వసతులైన రోడ్లు, కాలువలు, వీధి దీపాలు, ఇతర సౌకర్యాలను ఏర్పాటు చేయనున్నారు.

స్థల అన్వేషణ
 మొదటి విడత గృహాల నిర్మాణం 2018 సంక్రాంతి పండుగ తర్వాతనే టిడ్కో సంస్థ ప్రారంభించే అవకాశం ఉంది. అంగీకార పత్రాలు ఇచ్చిన ప్రజలు డీడీలు తీస్తేనే పూర్తి అర్హత జాబితా తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు జిల్లా కమిటీ పరిశీలించి లబ్ధిదారుల ఎంపిక చేపట్టలేదు. జిల్లా ఇన్‌చార్జి మంత్రితోపాటు ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, మున్సిపల్‌ కమిషనర్లు కమిటీలో సభ్యులుగా ఉన్నారు. నెల్లూరు, కృష్ణా జిల్లాల్లో కూడా టిడ్కో సంస్థనే టెండర్లు వేయడంతో అక్కడ ఇళ్ల నిర్మాణాలను సంక్రాంతి లోగా పూర్తి చేయాలని ఒత్తిడి ఉండటంతో  పనులు జరుగుతున్నాయి. అపార్ట్‌మెంట్ల తరహాలో నిర్మించే ఇళ్లపై ప్రజలు ఆసక్తి చూపడం లేదు.

ప్రొద్దుటూరులో     
ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలో నిర్మించేందుకు గత ప్రభుత్వ హయాంలో 35 ఎకరాలను సేకరించారు. ఈ స్థలానికి ఆనుకుని వంక ఉండటంతో టిడ్కో ఈఈ లీలా ప్రసాద్‌ ఈ విషయాన్ని మున్సిపల్‌ కమిషనర్‌ బండి శేషన్న దృష్టికి తీసుకొచ్చారు. రెండు ఎకరాల స్థలం ఇప్పటికే ఆక్రమణకు గురైంది.

ఎలా జీవించాలి
పట్టణానికి 8 కిలోమీటర్ల దూరంలో ప్రభుత్వం నిర్మించి ఇచ్చే ఇళ్లు ప్రజలకు ఏ మాత్రం అనుకూలం కాదు. అందులోనూ ముక్కాలు సెంటులో అపార్టుమెంట్ల పద్ధతిలో నిర్మించే ఇంటిని  30 ఏళ్లు బ్యాంకుకు తనఖా పెట్టడం దారుణం.
– మచ్చా ఉమాదేవి, ప్రొద్దుటూరు.

పేదోడికి భారం
పేదోళ్లకి ప్రభుత్వం నిర్మించి ఇస్తామంటున్న ఇళ్లు భారంగా మారనున్నాయి.. నెల నెల బ్యాంకుకు అసలూ, వడ్డీతో కలిపి కట్టే డబ్బుకు పట్టణ ప్రాంతంలోనే బాడుగకు ఇల్లు వస్తుంది. చేనేతలకు పైభాగంలో ఇల్లు ఇస్టే మగ్గం ఎక్కడ పెట్టుకుంటారు.
– జి.జయమ్మ, ప్రొద్దుటూరు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు