ఎమ్మెల్సీ కవితపై వైఎస్‌ షర్మిల సెటైర్‌ 

23 Aug, 2023 06:31 IST|Sakshi

ట్విట్టర్‌ వేదికగా ‘బీ ది ఛేంజ్‌ యు వాంట్‌ టూ సీ’ అంటూ సలహా

సాక్షి, హైదరాబాద్‌: ‘బీ ది ఛేంజ్‌ యు వాంట్‌ టూ సీ’అంటూ 33% మహిళా రిజర్వేషన్లపై ఎమ్మెల్సీ కవితకు వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల సలహా ఇచ్చారు. నిజంగా కవితకు మహిళా రిజర్వేషన్లపై గౌరవం ఉంటే..రానున్న ఎన్నికల్లో 33% అమలు చేయించాలని మంగళశారం ఆమె ట్విట్టర్‌ వేదికగా డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలో సిట్టింగులకు ఇచ్చిన సీట్లలో 33 స్థానాలు మహిళా అభ్యర్థులకు అవకాశం ఇప్పించి కవిత తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు.

33 శాతం రిజర్వేషన్లకు చిత్తశుద్ధితో పార్టీలు కలిసి రావాలని చిలక పలుకులు పలుకుతున్న కవితమ్మ.. ఢిల్లీలో దొంగ దీక్షలు కాదు.. రాష్ట్రంలో సీట్లిచ్చే దమ్ముండాలన్నారు. 115 సీట్లలో 7 స్థానాలు ఇస్తే చిత్తశుద్ధి ఉన్నట్టా అని నిలదీశారు. తెలంగాణ జనాభాలో 50 శాతం మహిళలున్నా కేబినెట్‌లోనూ ప్రాధాన్యత దక్కలేదన్నారు. లిక్కర్, రియల్‌ ఎస్టేట్‌ బిజినెస్‌ల గురించి కాకుండా మీ నాన్నతో మాట్లాడి.. కేబినెట్‌లో, పెద్దల సభలో, నామినేటెడ్‌ పదవుల్లో మహిళలకు రిజర్వేషన్‌ ఇప్పించాలంటూ సెటైర్‌ వేశారు. లిక్కర్‌ స్కాం పక్కదారి పట్టించేందుకు ఎత్తుకున్న నినాదమే 33 శాతం రిజర్వేషన్లు తప్ప.. మీకెక్కడిది మహిళల పట్ల చిత్తశుద్ధి అని మండిపడ్డారు.  

మరిన్ని వార్తలు