కామారెడ్డి నుంచి కేసీఆర్‌ పోటీ నేపథ్యంలో... ‘రియల్‌’ జోష్‌!

24 Aug, 2023 13:04 IST|Sakshi

నిన్నటివరకు స్తబ్ధుగా ఉన్న రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో కదలిక వచ్చింది. సీఎం కేసీఆర్‌ కామారెడ్డినుంచి పోటీ చేస్తారన్న ప్రకటన వ్యాపారుల్లో ఒక్కసారిగా జోష్‌ తెచ్చింది. సీఎం పోటీచేస్తే అభివృద్ధికి భారీ ఎత్తున నిధులు వస్తాయని ఆశిస్తున్న జనం.. భూముల ధరలకూ రెక్కలు వస్తాయని భావిస్తున్నారు. దీంతో రియల్‌ దందాకు తిరుగుండదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

సాక్షి, కామారెడ్డి: ఊపుమీదున్న రియల్‌ దందా ను కరోనా దెబ్బకొట్టింది. భూముల క్రయ, విక్రయాలు గణనీయంగా తగ్గాయి. వైరస్‌ ప్రభావం దాదాపు రెండేళ్ల పాటు ఉండింది. రియల్‌ దందాలో పెట్టుబడులు పెట్టిన వారు చాలా మంది ఆర్థికంగా ఇబ్బందులపాలయ్యారు. కరోనా మూలంగా ప్లాట్లను కొనడానికి ఎవరూ ముందుకు రాలేదు. అత్యవసర పరిస్థితుల్లో ప్లాట్లను అమ్ముకునేందుకు ప్రయత్నించినా కొనేవారు లేక ఇబ్బందులు ఎదురయ్యాయి.

కొన్న ధరకన్నా తక్కువకు అమ్ముకుంటే నష్టపోతామన్న భావనతో కొందరు వ్యాపారులు వడ్డీలకు వడ్డీలు కట్టి నష్టపోయారు. ఇప్పుడిప్పుడే దందా కోలుకుంటున్నా.. మునుపటి జోష్‌లేదు. వెంచర్లు చేసి వాయిదాల పద్ధతిన ప్లాట్లు విక్రయించే ప్రయత్నాలు చేసినా జనం పెద్దగా ఆసక్తి చూపలేదు. ధరలు అడ్డగోలుగా పెరగడంతో ప్లాట్లు కొనేవారు తగ్గిపోయారు. హైదరాబాద్‌ చుట్టుపక్కల ఉన్న ధరలు కామారెడ్డిలో ఉండడంతో డబ్బులున్నవారు అక్కడే కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపారు. మధ్య తరగతి అందుకోలేనంతగా భూముల ధరలు పెరిగిపోయాయి. ఫలితంగా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో స్తబ్ధత ఏర్పడింది.

కామారెడ్డి పట్టణం జిల్లా కేంద్రంగా ఏర్పడే నాటికే ఇక్కడ భూముల ధరలు అడ్డగోలుగా పెరిగాయి. జిల్లా అయిన తర్వాత మరింతగా పెరిగి సామాన్యుడు కొనుగోలు చేసే పరిస్థితి లేకుండా పోయింది. కామారెడ్డి పట్టణంతో పాటు చుట్టుపక్కల మండలాల్లోనూ పెద్ద ఎత్తున ప్లాట్ల దందాతో రూ. కోట్లల్లో వ్యాపారం నడిచింది. ఊహిచనంతగా సాగిన రియల్‌ దందాతో కొందరు ఆర్థికంగా అందనంత ఎత్తుకు ఎదిగారు. ఇక్కడ డబ్బులు సంపాదించిన వారు 44వ నంబరు జాతీయ రహదారిపై రామాయంపేట, చేగుంట, తూప్రాన్‌, మేడ్చల్‌ దాకా భూములు కొనుగోలు చేశారు. ఎక్కడ వెంచర్లు చేసినా అందులో కామారెడ్డి ప్రాంతానికి చెందిన వ్యాపారుల భాగస్వామ్యం ఉండింది. ప్లాట్ల దందాతో పాటు నిర్మాణ రంగంలోనూ వ్యాపారులు ఆరితేరారు. హైదరాబాద్‌లోనూ భారీ అపార్టుమెంట్లు, విల్లాలు నిర్మించి విక్రయించే స్థాయికి ఎదిగారు.

అందనంత స్థాయిలో...
కామారెడ్డి పట్టణంతో పాటు చుట్టుపక్కల వెంచర్లలో ప్లాట్లు కొనుగోలు చేయడం సామాన్యుడికి భారంగానే మారింది. పట్టణంలో ఇళ్ల మధ్య ప్లాటు తక్కువలో తక్కువ గజానికి రూ.20 వేలు పలుకుతోంది. ఇల్లు నిర్మించుకునేందుకు ప్లాటు కొనుగోలు చేయాలంటే వంద గజాలకు రూ.20 లక్షలు వెచ్చించాల్సిందే. మధ్య తరగతి ప్రజలకు ఇది భారమే.. కుటుంబ పోషణ, పిల్లల చదువులు, ఇంటి అద్దెలు, ఇతర ఖర్చులకు సరిపోని సంపాదనతో ఇప్పటికే ప్లాట్లు కొనే పరిస్థితి లేకుండాపోయింది. ప్లాట్ల ధరలు ఇంకా పెరిగితే సామాన్యుడు ఆశలు వదులుకోవాల్సిందేనన్న భావన వ్యక్తమవుతోంది.

రియల్‌ ఎస్టేట్‌ వర్గాల్లో నూతనోత్సాహం
కొంతకాలంగా వ్యాపారం దెబ్బతిని ఇబ్బందు ల్లో ఉన్న రియల్‌ వ్యాపారులు, ఏజెంట్లలో సీఎం కేసీఆర్‌ కామారెడ్డినుంచి పోటీ చేస్తారన్న ప్రకటన ఉత్సాహాన్నిచ్చింది. సీఎం పోటీ చేస్తే నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నారు. దీంతో భూముల క్రయవిక్రయా లు పెరుగుతాయని, రియల్‌ బూం వస్తుందని రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు ఆశిస్తున్నారు.

ఎవరి ని కదిలించినా కామారెడ్డిలో రియల్‌ దందా పరుగులు తీస్తుందని చెబుతున్నారు. జిల్లా కేంద్రంతో పాటు చుట్టుపక్కల గ్రామాలైన దేవునిపల్లి, టేక్రియాల్‌, లింగాపూర్‌, ఇల్చిపూర్‌, అడ్లూర్‌, రామే శ్వర్‌పల్లి, నర్సన్నపల్లి, సరంపల్లి, పాతరాజంపే ట, పొందుర్తి తదితర గ్రామాలతోపాటు తాడ్వాయి, పాల్వంచ, దోమకొండ, భిక్కనూరు, రాజంపేటల పరిధిలోని భూములు, ప్లాట్ల అమ్మకాలు పెరిగే అవకాశాలున్నాయి.

మరిన్ని వార్తలు