అవినీతి మూలాలన్నీ అక్కడే

9 Jul, 2016 12:53 IST|Sakshi

 రవాణాశాఖ అనధికార ఆదాయానికి కేంద్రం
 ఏసీబీకి దొరికిన అధికారులు ఎక్కువ కాలం ఇక్కడే పనిచేశారు


నెల్లూరు: రవాణాశాఖ అధికారుల అవినీతికి నెల్లూరు జిల్లా అడ్డాగా మారుతోంది. సీపోర్టు, చెక్‌పోస్టు, ఇరు రాష్ట్రాల సరిహద్దులు జిల్లాలో ఉండటంతో రవాణాశాఖలో పనిచేసే అధికారులు చూపు జిల్లా వైపే పడుతుంది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న చందంగా జిల్లాలో పోస్టింగ్ కోసం పోటీలు పడి మరి ఇక్కడికి వస్తున్నారు. వీలైనంత ఎక్కువ కాలం జిల్లాలో పని చేసేందుకు అధికారులు పెద్ద మొత్తంలో ఉన్నతాధికారులు, అధికార పార్టీ నేతలకు ముట్ట జెబుతారన్న ప్రచారం జరుగుతుంది. ఏసీబీ అధికారులకు పట్టుబడితే రవాణాశాఖాధికారులు ఎక్కువ కాలం నెల్లూరు జిల్లాలో పని చేయడంతో వారి మూలాలు ఇక్కడే బయట పడుతుండటంతో  చర్చనీయాంశంగా మారింది.

ఆదాయ వనరులు ఎక్కువ
జిల్లాలో కృష్ణపట్నం ఓడరేవు, తడ ప్రాంతంలో సరిహద్దు చెక్‌పోస్టు, జాతీయ రహదారి, ఓ వైపు కర్ణాటక ప్రాంతం నుంచి వచ్చే సరుకుల రవాణా రవాణాశాఖలో అనధికార ఆదాయాన్ని ఎక్కువ తెచ్చిపెడుతున్నాయి. ప్రధానంగా కృష్ణపట్నం ఓడరేవు నుంచి బొగ్గు, ఇనుము, స్టీల్, ఆయిల్స్, గ్రానైట్, తదితర సరుకులు ఎక్కువగా ఎగుమతులు, దిగుమతులు అవుతుంటాయి. ఇవన్నీ ఎక్కువగా వాహన పరిమితికి మించి రవాణా అవుతుంటాయి. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి బియ్యం, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్స్, పేపరు, పప్పులు తదితర సరకులు ఎగుమతులు, దిగుమతులు జరుగుతుంటాయి. జిల్లాలో సిలికా, గ్రావెల్, కంకర, సున్నపురాయి, ఇసుక  రవాణా జరుగుతుంటాయి.

ఎక్కువ కాలం ఇక్కడే పోస్టింగ్
గతంలో గుంటూరులో ఆర్టీఓగా పని చేస్తూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన బ్రహ్మానందరెడ్డి జిల్లాలో 5 ఏళ్లుకు పైగా పని చేశారు. నెల్లూరులో ఆర్టీఓగా పని చేసిన జనార్దనశెట్టి కూడా 7 ఏళ్లు సూపరింటెండెండ్, ఆర్టీఓ హోదాల్లో పని చేశారు. ఇటీవల కాకినాడ ఉపరవాణా కమిషనర్‌గా పనిచేస్తూ ఏసీబీ అధికారులకు పట్టుబడి మోహన్ 6 ఏళ్లు నెల్లూరులోనే డీటీసీగా పని చేశారు. గుంటూరులో ఎంవీఐగా పని చేస్తూ శుక్రవారం ఏసీబీ అధికారులుకు పట్టుబడిన సుధాకరరెడ్డి జిల్లాలో పదేళ్లు పాటు వివిధ ప్రాంతాల్లో పని చేశారు. జిల్లాలో ఎక్కువ కాలం పనిచేసిన వారిపై ఏసీబీ అధికారులు దృష్టి సారించడం గమనార్హం.

నెలకు రూ.20 లక్షలకు పైగా అనధికార ఆదాయం
ఓవర్ లోడ్లు, కార్యాలయంలో జరిగే లావాదేవీలు కలిపి నెలకు రూ.20 లక్షలకు పైగా అనధికార ఆదాయయం వస్తుందని ప్రచారం జరుగుతుంది. గ్రానైట్, సిలికా, ఇసుక, సున్నపురాయి, గ్రావెల్, బొగ్గు, ఇనుము తదితర సామగ్రి అధిక లోడుతోనే రావాణా అవుతాయని చెబుతున్నారు. వీటికి సంబంధించి ఒక్కో లారీకి రూ. 1000 నుంచి రూ.1200 ఒక్కో అధికారికి ఇచ్చుకోవాల్సి ఉంది. జిల్లాలో రవాణా కార్యాలయాల్లో జరిగే లెసైన్స్, ఎఫ్‌సీ, పర్మిట్, ట్రాన్స్‌ఫర్లు, రిజిస్ట్రేషన్లు తదితర వాటిల్లో జరిగే లావాదేవీలకు ప్రభుత్వ చలానా కంటే ఐదారు రెట్లు అధిక మొత్తంలో లంచంగా పుచ్చుకోవాల్సి వస్తుందంటున్నారు.

చెక్‌పోస్టులోనూ..  
ప్రతి వాహనం చెక్‌పోస్టు ద్వారానే రవాణా చేయాల్సి ఉంది. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న వాహనాలతో పాటు అన్ని రికార్డులు సక్రమంగా ఉన్నా.. చెక్‌పోస్టులో ఎంట్రీ ఫీజు చెల్లించుకోవాల్సిందే. అదేమని అడిగితే రాష్ డ్రైవింగ్, హైట్‌లోడ్, సౌండ్ పొల్యూషన్ పేరుతో కేసులు రాస్తామని బెదిరిస్తుంటారని లారీ యజమానులే వాపోతున్నారు. ఈ రీతిలో రవాణాశాఖకు 24 గంటల్లో రూ. 1.50 లక్షలు అనధికార మామూళ్లు వస్తాయని పలువురు చెబుతున్నారు. చెక్‌పోస్టులో పోస్టింగ్ ఇప్పించుకునేందుకు పలువురు పోటీ పడుతుంటారు.

మరిన్ని వార్తలు