బెంబేలెత్తిన బెజవాడ వాసులు..

26 Aug, 2017 12:49 IST|Sakshi
బెంబేలెత్తిన బెజవాడ వాసులు..

►ట్రాఫిక్‌ జామ్‌తో స్తంభించిన బెజవాడ రోడ్లు
►దాదాపు మూడు గంటల నుంచి రోడ్లపైనే నిలిచిన వాహనాలు
►నగరమంతా అస్తవ్యస్తంగా మారిన ట్రాఫిక్‌


సాక్షి, విజయవాడ : ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పర్యటన సందర్భంగా ట్రాఫిక్‌ మళ్లింపుతో బెజవాడ ప్రజలు పట్టపగలే చుక్కలు చూశారు. అసలే ఇరుకు రోడ్లు. ఆపై చిన్నచిన్న వీధుల్లోకి ట్రాఫిక్‌ మళ్లింపులతో శనివారం సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రత్యామ్నయ ఏర్పాట్లు చేయడంలో అధికారులు విఫలం కావడంతో నగర వాసులను ట్రాఫిక్‌ బేజారెత్తించింది. బందర్‌ రోడ్డుకు కనెక్ట్ అయ్యే కృష్ణలంక రోడ్‌ పూర్తిగా జామైపోయింది.

దాంతో రెండు గంటలపాటు వందల వాహనాలు నిలిచిపోయాయి. అధికార యంత్రాంగం చేతులెత్తేయడంతో విద్యార్థులు, కార్యాలయాలకు వెళ్ళాల్సిన ఉద్యోగులు, ఆసుపత్రులకు వెళ్ళాల్సిన రోగులు నానా అవస్ధలు పడ్డారు. ప్రభుత్వం ముందు చూపు లేకుండా కార్యక్రమాలను నిర్వహిస్తూ తమను కష్టాల పాలు చేస్తోందని పలువురు అసహనం వ్యక్తం చేశారు. ఎన్ని గంటలు ఇలా రోడ్లపై వుండాలంటూ మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు.


శుక్రవారం రాత్రి నుంచే ట్రాఫిక్‌ మళ్లింపు కార్యక్రమాన్ని చేపట్టిన పోలీసులు వాహనాలకు సరైన రీతిలో ప్రత్యామ్నాయం చూపకపోవడంతో అనేక చోట్ల ట్రాఫిక్‌ అస్తవ్యస్థంగా తయారైంది. విజయవాడ బయట కూడా అదే పరిస్థితి నెలకొంది. ఇక గన్నవరం నుంచి వెలగపూడి వరకు 23కిలో మీటర్ల మేర పూర్తిగా ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు ప్రకటించారు.

అలాగే రామలింగేశ్వర నగర్, కృష్ణలంక, రాణిగారితోట ప్రాంతాల నుంచి రావాలంటే బందర్ రోడ్ మీదుగానే రావాల్సి వుంటుంది. అయితే బందర్ రోడ్తో వున్న అన్ని కనెక్టింగ్ రోడ్లను పోలీసులు మూసివేశారు. ఫలితంగా వేలాది వాహనాలు కృష్ణ లంక వైపు నిలిచిపోయి భారీ ట్రాఫిక్ జాం ఏర్పడింది.

మరోవైపు హైదరాబాద్‌ నుంచి విశాఖ వెళ్లే వాహనాలను సత్తుపల్లి మీదుగా, విశాఖ నుంచి చెన్నై వెళ్లే వాహనాలను హనుమాన్‌ జంక్షన్‌, గుడివాడల మీదుగా, హైదరాబాద్‌నుంచి బందరు వెళ్లే వాహనాలు..నూజివీడు, హనుమాన్‌ జంక్షన్‌ మీదుగా మళ్లించారు. అలాగే మచిలీపట్నంనుంచి చెన్నై వెళ్లే వాహనాలను..పామర్రు, చల్లపల్లి మీదుగా మళ్లించారు.

ఉప రాష్ట్రపతి పర్యటన, వాహనాలు మళ్లింపు