సమస్యల పరిష్కారానికి జగన్‌కు వినతి

4 Oct, 2018 08:38 IST|Sakshi
జగన్‌మోహన్‌రెడ్డికి వినతిపత్రం అందజేస్తున్న హ్యుమన్‌ రైట్స్‌ కౌన్సిల్‌ జిల్లా అధ్యక్షుడు అచ్చిరెడ్డి

నేషనల్‌ ఫెడరేషన్‌ హ్యుమన్‌ రైట్స్‌ కౌన్సిల్‌   

విజయనగరం, ప్రజాసంకల్పయాత్ర బృందం: జిల్లాలో విద్య, ఉపాధి, కార్మిక, యువతతో పాటు అన్ని రంగాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపాలని నేషనల్‌ ఫెడరేషన్‌ హ్యుమన్‌ రైట్స్‌ కౌన్సిల్‌ జిల్లా అధ్యక్షుడు సత్తి అచ్చిరెడ్డి, కౌన్సిల్‌ ప్రతినిధులు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిని కోరారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా బుధవారం జిల్లాలోని నెల్లిమర్ల మండలంలో గల జరజాపుపేట వద్ద మధ్యాహ్న భోజన విరామ సమయంలో జగన్‌మోహన్‌రెడ్డిని కలిసిన కౌన్సిల్‌ ప్రతినిధులు వినతిపత్రం అందజేశారు. జిల్లాలో జ్యూట్‌ మిల్లులు, ఫెర్రో పరిశ్రమలు మూతపడడంతో కార్మికులు రోడ్డున పడ్డారని ఉపాధి కోల్పోయి వలస బాట పడుతున్నారని తెలిపారు.

జిల్లాలో వైద్య కళాశాల మంజూరు చేసే విధంగా చర్యలు చేపట్టాలని, జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయాలని విన్నవించారు. రైతులకు ఖరీఫ్, రబీ సీజన్లలో ఒక్కో రైతుకు రూ.10 వేలు ఉచితంగా ఇవ్వాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, కేజీబీవీ, మోడల్‌ స్కూల్స్‌కు సొంత భవన సదుపాయాలు కల్పించాలని, సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేయాలని కోరారు. ఒక రేషన్‌కార్డులో ఇద్దరు వికలాంగులు ఉంటే ఇద్దరికీ పింఛన్‌ సౌకర్యం కల్పించాలన్నారు. అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం చేయాలని, ప్రైవేటు పాఠశాలల్లో ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులు మాత్రమే వసూలు చేసే విధంగా చట్టం తీసుకురావాలని, గిరిజన ప్రాంతాల్లో తాగునీరు, రోడ్లు, విద్యుత్‌ సదుపాయం, ఆరోగ్య కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలని, ఎస్సీ, బీసీ కార్పొరేషన్లు మాదిరిగానే ఓసీలకు కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి రుణాలు అందజేయాలని వారు జగన్‌ను కోరారు.

మరిన్ని వార్తలు