కరువు నేలలో వజ్రాల వేట!

29 May, 2019 12:24 IST|Sakshi
వజ్రకరూరులోని వజ్రాల కోసం అన్వేషిస్తున్న జనం

సాక్షి, వజ్రకరూరు: కరువుసీమగా పేరుగాంచిన అనంతపురం జిల్లాలో వజ్రాల వేట ప్రారంభమైంది. వజ్రకరూరు మండలంలోని పొలాల్లో వజ్రాల అన్వేషణ కొనసాగుతోంది. తొలకరి పలకరించడంతో పరిసర ప్రాంతాల వారే కాకుండా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారు పొలాలను తూర్పారబడుతున్నారు. ఏ చిన్న రంగురాయి దొరికినా ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. ఈ ప్రాంతమంతా ఇసుకతో కూడిన ఎర్రనేలలు కావడంతో జూన్‌ మాసంలో తొలకరి వర్షాలు ప్రారంభం కాగానే భూమిలోపల ఉన్న వజ్రాలు పైకి వస్తాయని, పొలంలో నీరు పారినప్పుడు అవన్నీ ఏటవాలుగా ఉన్న ప్రాంతానికి చేరుకుంటాయని స్థానికులు చెబుతున్నారు. అందువల్లే ఇక్కడికి వచ్చే వారంతా పొలాల్లో అణువణువూ వెతుకుతూ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

వజ్రకరూరు ప్రాంతంలో ఏటా 10 నుంచి 20 దాకా వజ్రాలు దొరుకుతాయనీ, ఇక్కడ లభించే వజ్రాలు కోహినూర్‌తో సమానంగా ధర పలుకుతాయని స్థానికులు చెబుతున్నారు. ఆదివారం రాత్రి వజ్రకరూరు పరిసర ప్రాంతంలో మోస్తరు వర్షం కురవగా... స్థానికులతో పాటు ఇతర ప్రాంతాల వారు కూడా ఉదయాన్నే పొలాలకు వెళ్లి వజ్రాలకోసం వేట కొనసాగిస్తున్నారు. ఏటా ఇక్కడ లభించే వజ్రాలను గుట్టు చప్పుడు కాకుండా కొందరు దళారులు కొనుగోలు చేసి ఇతర ప్రాంతాల్లో విక్రయిస్తారనీ, గత ఏడాది కూడా రూ.లక్షలు విలువచేసే వజ్రాలు లభ్యమయ్యాయని స్థానికులు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు