అనాథలైన చిన్నారులు

6 Aug, 2019 09:10 IST|Sakshi
ట్యాంకర్‌ చక్రాల కింద పడి మృతి చెందిన దంపతులు మరుకుర్తి శ్రీను, ట్యాంకర్‌ క్యాబిన్‌ కింద ఇరుక్కున్న బైక్‌

సాక్షి, తూర్పుగోదావరి(రాజమహేంద్రవరం) : జాతీయరహదారిపై అడుగడుగునా ఉన్న గోతులు భార్యభర్తల ప్రాణాలను హరించాయి. త్రుటిలో మరొకరు ఈ ప్రమాదం నుంచి గట్టెక్కారు. ఈ సంఘటన సోమవారం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో రాజానగరం మండలం దివాన్‌చెరువు ఆటోనగర్‌ వద్ద చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. రాజానగరం మండలం  కొత్త వెలుగుబంద గ్రామానికి చెందిన మరికుర్తి శ్రీను(32), మరికుర్తి లక్ష్మి(28)లు భార్యాభర్తలు. రాజమహేంద్రవరంలో మరికుర్తి లక్ష్మికి దంతాన్ని తీయించేందుకు వీరిద్దరూ సోమవారం ఉదయం ఇంటి నుంచి మోటర్‌ బైక్‌పై వచ్చారు. దంతాన్ని తీయించిన అనంతరం కొత్త వెలుగుబంద గ్రామానికి బయలుదేరారు. ఆటోనగర్‌ సమీపానికి వచ్చేసరికి లాలాచెరువు నుంచి రాజానగరం వైపు యాసిడ్‌లోడుతో వెళుతున్న ట్యాంకర్‌ జాతీయరహదారి గోతిలో పడి స్పీడుగా లాగేందుకు ప్రయత్నించి బైక్‌ను ఢీకొట్టింది. దీంతో ఆ బైక్‌ జాతీయరహదారిపై ఉన్న మరో గోతిలో పడడంతో శ్రీను, లక్ష్మిలు బైక్‌తో సహా కిందపడి ట్యాంకర్‌ మధ్య చక్రాల కింద నలిగిపోయారు.

లారీ వారిని, బైక్‌ను ఈడ్చుకుంటూ ముందు మరో స్కూటర్‌పై వెళుతున్న దివాన్‌చెరువు గ్రామానికి చెందిన బొంగా స్టాన్లీపాల్‌ను ఢీకొట్టింది. అతడు డివైడర్‌పైన ఉన్న గడ్డిలో పడిపోయాడు. త్రుటిలో పెనుప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ట్యాంకర్‌ చక్రాల కింద పడిన మరుకుర్తి శ్రీను, మరుకుర్తి లక్ష్మి అక్కడికక్కడే మృతిచెందారు. ప్రమాదం జరిగిన వెంటనే ట్యాంకర్‌ డ్రైవర్, క్లీనర్‌ పరారయ్యారు. ఈ ప్రమాదంతో సుమారు గంటపాటు ట్రాఫిక్‌ స్తంభించింది. సంఘటన స్థలానికి బొమ్మూరు పోలీస్‌స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ కె.లక్ష్మణరెడ్డి చేరుకుని పరిశీలించగా, ఈ లోపు అర్బన్‌ జిల్లా తూర్పు మండల డీఎస్పీ ఏటీవీ రవికుమార్, ట్రాఫిక్‌ డీఎస్పీ ఎస్‌.వెంకట్రావు చేరుకుని సిబ్బందితో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. మృతదేహాలు ట్యాంకర్‌ చక్రాల కింద ఇరుక్కుపోవడంతో లక్ష్మి మృతదేహం బయటకు రాగా, శ్రీను మృతదేహాన్ని రెండు క్రేన్ల సహాయంతో ట్యాంకర్‌ను జరిపి బయటకు తీశారు. భార్యాభర్తల మృతదేహాలను పోస్టుమార్టం కోసం రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బొమ్మూరు ఇన్‌స్పెక్టర్‌ కె.లక్ష్మణరెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

హైవేపై ఉన్న గోతులతోనే ప్రమాదాలు
జాతీయరహదారిపై ఉన్న గోతులతోనే తరచూ ప్రమాదాలు జరిగి వాహనచోదకులు మృత్యువాత పడుతున్నారని ట్రాఫిక్‌ డీఎస్పీ ఎస్‌.వెంకట్రావు పేర్కొన్నారు. సోమవారం ఆటోనగర్‌ ప్రమాద సంఘటన స్థలం వద్ద విలేకరులతో మాట్లాడుతూ భార్యభర్తలు మృత్యువాత కూడా జాతీయరహదారిపై ఉన్న గోతుల వలనే జరిగిందన్నారు. గతంలో జరిగిన రోడ్డుప్రమాదాలకు ఇవే కారణమని తెలిపారు. తూర్పు మండల డీఎస్పీ ఏటీవీ రవికుమార్‌ మాట్లాడుతూ జాతీయరహదారిపై గోతులను పూడ్చితే ప్రమాదాలను నివారించవచ్చన్నారు. సంబంధిత అధికారులకు, జాతీయరహదారి అధికారులకు  గోతులను పూడ్పించాలని లిఖితపూర్వకంగా ఇస్తామన్నారు.

స్వగ్రామాల్లో విషాద వాతావరణం
రాజానగరం: పంటి సమస్యతో బాధపడుతున్న భార్యకు వైద్యం చేయించేందుకని వెళ్లిన తన కొడుకు భార్యతో సహా తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడంటూ దివాన్‌చెరువు సమీపంలోని ఆటోనగర్‌ వద్ద జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో దుర్మరణం చెందిన మరుకుర్తి శ్రీనివాస్‌ తల్లిదండ్రులు మరుకుర్తి వీర్రాజు, లక్ష్మి కన్నీరుమున్నీరుగా విలపించారు. భార్యకు పంటి వైద్యం చేయించి, బైకుపై తిరిగి ఇంటి వస్తున్న వారిద్దరినీ మృతువు లారీ రూపంలో కబలించిన విషయం తెలియడంతో శ్రీనివాస్‌ స్వగ్రామమైన కొత్తవెలుగబంద, లక్ష్మి స్వగ్రామమైన దివాన్‌చెరువులో విషాదవాతావరణం నెలకొంది. శ్రీనివాస్, లక్ష్మిలను పోగొట్టుకుని దుఃఖసాగరంలో కుమిలిపోతున్న వారి కుటుంబ సభ్యులను ఓదార్చడం ఎవరితరం కాలేదు. పాడి గేదెలను మేపుకొంటూ తీరిక సమయాల్లో వ్యవసాయ పనులకు కూడా వెళుతూ కుటుంబాన్ని పోషించుకు రావడంతో చేదోడుగా ఉన్న తన తమ్ముడు, మరదలు ఇక లేరనే విషయాన్ని శ్రీనివాస్‌ హారిబాబు, వదిన నూకరత్నం తట్టుకోలేక పడిపడి విలపిస్తున్నారు. 

మమ్మీ, డాడీ ఎక్కడ?
శ్రీనివాస్, లక్ష్మిల అకాల మరణంతో వారి ఇద్దరు పిల్లలు తల్లిదండ్రులు లేని అనాథలయ్యారు. అబ్బాయి రామశ్రీదుర్గాగణేష్, అమ్మాయి దుర్గాభవానీలిద్దరూ దివాన్‌చెరువులోని ఒక ప్రైవేట్‌ స్కూల్లో ఫస్ట్‌ క్లాస్, నర్సరీ చదువుతున్నారు. స్కూల్‌ అయ్యాక సాయంత్రం ఆ చిన్నారులు స్కూల్‌ బస్సులో కొత్తవెలుగుబందలోని తమ ఇంటికి చేరుకున్నారు. అయితే అక్కడ జనమంతా గుమిగూడి ఉండడంతో ఏమి జరిగిందో తెలియని అయోమయంలో అందరినీ చూస్తూ.. మమ్మీ, డాడీ ఏరీ.. అంటూ అమాయకంగా వేసిన ప్రశ్న అక్కడ ఉన్న వారి హృదయాలను కలచివేసింది. అక్కడనే రోదిస్తూ ఉన్న పెదనాన్న, పెదమ్మలు ఆ చిన్నారులను అక్కున చేర్చుకుంటుంటే అందరి కళ్లు చెమర్చాయి. దీంతో అక్కడ ఉంటే ఆ చిన్నారులకు విషయం అర్థమై బెంగపెట్టుకుంటారనే భావంతో దివాన్‌చెరువులో ఉంటున్న అమ్మమ్మ వాళ్లింటికి తీసుకువెళ్లారు.

మరిన్ని వార్తలు