‘యూ’టీ టర్న్ వి‘భజన’

23 Oct, 2013 02:51 IST|Sakshi

సాక్షి, విజయవాడ :
 ‘నేను వ్యక్తిగతంగా సమైక్యవాదినే. విభజన అనివార్యంగా కనపడుతోంది. ఇప్పటికే సీమాంధ్ర చాలా నష్టపోయింది. ఈ ప్రాంత ప్రయోజనాల పరిరక్షణకు మనం కృషి చేయాల్సిన అవసరం ఉంది. ’- నాలుగు రోజుల క్రితం నగరంలో పారిశ్రామిక వేత్తలతో  సమావేశమైన కేంద్ర మంత్రి పురందేశ్వరి చేసిన వ్యాఖ్యలు.
 
 ‘నేనూ సమైక్యవాదిని. అయితే విభజన తప్పదు. ఒకవేళ సభలో ఓటింగ్ పెట్టి కాంగ్రెస్ పార్టీ విప్ జారీ చేస్తే అనుకూలంగా ఓటు వేస్తాను. హైదరాబాద్‌ను యూటీ చేయాలన్నది మా డిమాండ్.’
 -  రెండురోజుల క్రితం గుడివాడలో కేంద్రమంత్రి పనబాక లక్ష్మి ఊవాచ ‘హైదరాబాద్‌ను యూటీ చేస్తేనే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. సీమాంధ్ర ప్రజల వాదనలను కేంద్ర మంత్రుల కమిటీ ముందుకు తీసుకువెళ్లాలి. మెజారిటీ ప్రజలు తెలంగాణ ను వ్యతిరేకించడం లేదు. అయితే సీమాంధ్ర సమస్యలు పరిష్కారం కావనే భయంతోనే ఉద్యమం వచ్చింది.’
 
 - మంగళవారం మరో కేంద్ర మంత్రి జేడీ శీలం నగరంలో విలేకరులతో చెప్పిన మాటలు
 ఈ ముగ్గురు కేంద్ర మంత్రుల వ్యాఖ్యలలోని అంతరార్థం ఒక్కటే. తాము సమైక్యవాదులుగా ప్రకటించుకొంటూనే మరోవైపు విభజన తప్పదని ప్రజలకు సుతిమెత్తగా వివరించడం. రెండున్నర నెలలుగా ఉద్యమం పతాక స్థాయిలో సాగుతున్న దశలో రాజకీయ రాజధానిగా ఉన్న నగరం, జిల్లాలో కేంద్రమంత్రులు ప్రత్యేకంగా ఈ తరహా వ్యాఖ్యలు చేయడం వెనుక అధిష్ఠానం వ్యూహం ఉందనే ప్రచారం జరుగుతోంది. ఇదంతా మైండ్‌గేమ్ అని అర్థమవుతోంది. రాష్ట్రం విడిపోతే సీమాంధ్ర రాజధానిని నగరం పరిసరాల్లోనే ఏర్పాటు చేసే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో  కేంద్ర మంత్రులు ఈ వ్యాఖ్యలు ఇక్కడ నుంచే చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. కేంద్ర మంత్రులంతా ఒకే తరహా వ్యాఖ్యలుచేయడం ద్వారా ప్రజల్ని మానసికంగా విభజనకు సిద్ధం చేస్తున్నట్లు కనపడుతోంది. తద్వారా సమైక్యాంధ్ర పరిరక్షణ ఉద్యమాన్ని చల్లార్చేందుకు వారు ప్రయత్నిస్తున్నారనే విషయం స్పష్టమవుతోంది.
 
  హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా చేసేందుకు తాము పట్టుబడుతున్నామని కేంద్రమంత్రులు కొత్తరాగం అందుకోవడమంటే విభజన తప్పదని సంకేతాలివ్వడమేనని తేలిపోతుంది. విభజనను వ్యతిరేకిస్తూ రాజీనామా డ్రామాల పరంపర కొనసాగిస్తున్న  ఎంపీ లగడపాటి రాజగోపాల్ కూడా కేంద్రమంత్రి పురందేశ్వరి వ్యాఖ్యలను సమర్థించడం ఆయన చిత్తుశుద్ధి ఏపాటిదో తేటతెల్లం చేస్తోంది. స్పీకర్ కార్యాలయం ముందు ధర్నా చేసైనా రాజీనామా ఆమోదింపచేసుకొని వస్తానని లగడపాటి ఢిల్లీ వెళ్లిన విషయం తెలిసిందే. అయితే తన రాజీనామా ఆమోదించేలా ఆదేశించాలని ఢిల్లీ హైకోర్టులో వేసిన కేసును కూడా మంగళవారం ఆయన ఉపసంహరించుకోవడం పలు అనుమానాలకు దారితీస్తోంది. ఎంపీలు, కేంద్ర మంత్రులు సమైక్యాంధ్ర కోసం పోరాడుతున్నట్లు  భ్రమలు కల్పిస్తూ వచ్చారు.
 
  నాలుగైదురోజుల నుంచి వారి మాటల్లో వచ్చిన మార్పు చూస్తుంటే పదవుల్లో కొనసాగుతూనే విభజనకు సహకరిస్తున్నారన్న అభిప్రాయం బలపడుతోంది. తెలంగాణ ప్రక్రియను వేగవంతం చేయాలని భావిస్తున్న కేంద్రానికి వీరు సహకరిస్తూనే.. సీమాంధ్ర ప్రజలను విభజనకు మానసికంగా సంసిద్ధం చేసే బాధ్యతను తమ భుజానికి ఎత్తుకున్నారని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ క్రమంలోనే వారు ఎక్కడికి వెళ్లినా సమైక్యతే తమ అజెండా అని, చివరకు అడ్డుకుంటామంటూనే.. విభజన తప్పకపోవచ్చంటూ సన్నాయినొక్కులు నొక్కుతున్నారు. కేంద్రమంత్రులు ఏం చెప్పినా వినేందుకు తాము సిద్ధంగాలేమని, తమ వైఖరి మార్చుకోకపోతే తరిమికొట్టేందుకు వెనకాడబోమని జనం హెచ్చరిస్తున్నారు.

>
మరిన్ని వార్తలు