మరో ప్రేమోన్మాదం

14 Oct, 2014 01:55 IST|Sakshi

* వేట కొడవలితో బీటెక్ విద్యార్థినిపై దాడి
* చేయి, మెడపై వేటు.. ఆపై విషం సేవించి ఆత్మహత్య
* నగరంలోని అరోరా ఇంజనీరింగ్ కాలేజీ ఆవరణలో ఘటన
* ఉన్మాదిని ధైర్యంగా అడ్డుకున్న కళాశాల సిబ్బంది, విద్యార్థులు
* బాధితురాలికి తప్పిన ప్రాణాపాయం
* ప్రేమ పేరుతో నాలుగేళ్లుగా వేధింపులు
* విద్యార్థిని వాంగ్మూలం నమోదు
 
సాక్షి, హైదరాబాద్: ప్రేమోన్మాదం మళ్లీ పడగవిప్పింది. ప్రేమించిన యువతి తన మాట వినడం లేదని ఆమె బలినే కోరుకున్నాడో దుర్మార్గుడు. ఓ బీటెక్ విద్యార్థినిపై కాలేజీ ప్రాంగణంలోనే వేట కొడవలితో దాడి చేశాడు. ఆపై అతడు కూడా అక్కడే విషం సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అధ్యాపకులు, తోటి విద్యార్థులు ఈ దాడిని అడ్డుకోవడంతో విద్యార్థినికి ప్రాణాపాయం తప్పింది. కానీ ప్రేమ మత్తులో విచక్షణ మరచిన యువకుడు మాత్రం ప్రాణాలు కోల్పోయాడు. నగరంలోని బండ్లగూడ ప్రాంతంలో ఉన్న ఆరోరా ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలో సోమవారం ఉదయం అందరూ చూస్తుండగానే ఈ దారుణం చోటుచేసుకుంది.

పోలీసుల కథనం ప్రకారం.. రామ్‌నగర్‌లోని బ్రహ్మంగారివీధికి చెందిన గోపాల్‌దేవ్ కూతురు ఎం.రవళి (17) ఇటీవలే బీటెక్(కంప్యూటర్ సైన్స్)లో చేరింది. రోజూలాగే కాలేజీ బస్సులో ఇంటి వద్ద నుంచి బయలుదేరిన రవళి.. ఉదయం ఉదయం 9 గంటలకల్లా కాలేజీ దగ్గర కు చేరుకుంది. బస్సు దిగి కళాశాల భవనంలోకి వెళ్తుండగా వెనక నుంచి వచ్చిన సీహెచ్ ప్రదీప్‌కుమార్(25) తన బ్యాగులో దాచి ఉంచిన వేట కొడవలిని బయటకి తీసి ఆమెపై ఒక్కసారిగా దాడి చేశాడు. విషయం పసిగట్టిన రవళి కిందకు వంగే ప్రయత్నంలో ఆమె కుడి చేయిపై వేటు పడింది. గురి తప్పడంతో ప్రదీప్ వెంటనే ఆమె మెడపై మరో వేటు వేశాడు.

అక్కడికి కొద్ది దూరంలోనే ఉన్న ల్యాబ్ ఫ్యాకల్టీ ప్రవీణ్ ధైర్యం చేసి ప్రదీప్‌ను అడ్డుకునే ప్రయత్నం చేశాడు. ఈలోగా మిగతా సిబ్బంది, విద్యార్థులు అక్కడికి చేరుకున్నారు. ఇంతలో తన వద్ద ఉన్న కత్తిని చూపిస్తూ.. ఎవరూ దగ్గరకు రావద్దని అరుస్తూ ప్రదీప్‌కుమార్ తన బ్యాగ్‌లో తెచ్చుకున్న బాటిల్‌లోని విషాన్ని సేవించి కింద పడిపోయాడు. ఈ హఠాత్పరిణామంతో అప్రమత్తమైన కళాశాల యాజమాన్యం.. రక్తపుమడుగులో పడి ఉన్న రవళిని కారులో ఆరాంఘర్‌చౌరస్తాలోని సుజాతా ఆసుపత్రికి తరలించారు. ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న ప్రదీప్‌ను కళాశాల బస్సులో కంచన్‌బాగ్‌లోని అపోలో డీఆర్‌డీవో ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ కొద్దిసేపటికే అతను మృతి చెందాడు. రవళికి మెరుగైన చికిత్స అందించడంతో ప్రాణాపాయం తప్పింది.

నాలుగేళ్లుగా ప్రదీప్ వేధింపులు
రామ్‌నగర్‌లో రవళి కుటుంబం నివాసముంటుండగా కొద్దిదూరంలోని పార్శిగుట్ట చౌరస్తాలో గుంటూరు జిల్లా మాచర్ల మండలం కారంపూడి గ్రామానికి చెందిన సారయ్య కుటుంబం కిరాణా దుకాణం నిర్వహిస్త్తోంది. సారయ్య కుమారుడు ప్రదీప్‌కుమార్ బాలానగర్‌లోని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూల్స్ అండ్ డిజైన్(సీఐటీడీ) కాలేజీలో చదువుతున్నాడు. కిరాణా షాప్‌కు రవళి వచ్చివెళ్తుండగా ప్రదీప్‌తో పరిచయం ఏర్పడింది. అయితే ఈ పరిచయాన్ని ప్రేమగా మార్చుకున్న ప్రదీప్ తరచూ ఆమెను వేధించడం మెదలుపెట్టాడు. తన వెంట పడొద్దని రవళితో పాటు ఆమె కుటుంబ సభ్యులు కూడా పలుమార్లు వేడుకున్నారు.

విషయం పెద్దల వరకు వెళ్లడంతో దుకాణం ఖాళీ చేసిన సారయ్య తన కొడుకును తీసుకుని స్వగ్రామానికి వెళ్లిపోయాడు. అక్కడే చిన్నపాటి హోటల్ పెట్టుకుని జీవనం సాగిస్తున్నాడు. అదే సమయంలో ప్రదీప్ కళాశాలకు వెళ్లడం పూర్తిగా మానేశాడు. రెండేళ్ల నుంచి ఊర్లోనే ఉంటున్న ప్రదీప్ మాత్రం రవళిని మర్చిపోలేకపోయాడు. అప్పుడప్పుడు నగరానికి వచ్చి రవళిని మళ్లీ వేధించడం మెదలుపెట్టాడు. గత నెల 21న ఆమెను పట్టుకుని గొంతుపిసికి చంపబోయాడు. దీంతో ముషీరాబాద్ పోలీసులు అతనిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. అయితే తనను అరెస్టు చేస్తే ఆత్మహత్య చేసుకుంటానని పోలీసులను సైతం ప్రదీప్ బెదిరించాడు.

మూడు రోజుల నుంచి రవళికి ఫోన్ చేస్తూ తనను ప్రేమించాలని లేనిపక్షంలో కళాశాల వద్ద కాలు బయట పెట్టగానే చంపేస్తానని బెదిరిస్తూ వచ్చాడు. చివరకు అన్నట్టే ఆమెపై దాడికి పాల్పడ్డాడు. పక్కా పథకంతోనే కళాశాలలోకి ప్రవేశించినట్లు తెలుస్తోంది. సాధారణ డ్రెస్‌లో వెళితే కాలేజీ గేటు వద్ద భద్రతా సిబ్బంది ఆపేస్తారని గ్రహించి.. అరోరా కాలేజీ డ్రెస్(బ్లూ షర్టు, బ్లూ జీన్స్)ధరించి బ్యాగ్ వేసుకుని ఉదయం 8.30 గంటలకే కళాశాల ఆవరణలోకి ప్రవేశించాడు.

కాలేజీ గేటు వద్ద రవళి బస్ దిగి లోపలికి రాగానే దాడి చేశాడు. నిజానికి ప్రదీప్ హెచ్చరికల నేపథ్యంలో రవళి తరచుగా తాను ఎక్కే బస్టాప్‌లను మార్చేద ని తెలిసింది. తండ్రితో పాటే బస్సు వద్దకు వచ్చేది. సాయంత్రం కూడా ఎక్కడ బస్సు దిగేదీ ముందుగానే తండ్రికి ఫోన్ చేసి చెప్పేది. అయితే కళాశాల ఆవరణలోనే బస్సు దిగుతున్నందున అక్కడ దాడికి పాల్పడే సాహసం చేస్తాడని రవళి ఊహించలేకపోయింది. గతంలోనే ఫిర్యాదు చేసినప్పుడు ప్రదీప్‌ను పోలీసులు అరెస్ట్ చేసి ఉంటే ఈ ఘటన జరిగి ఉండేది కాదని ఆమె తోటి విద్యార్థులు వ్యాఖ్యానించారు.

గజ్జెలు తెస్తానని వెళ్లాడు: ప్రదీప్ తండ్రి
ఊళ్లో అయ్యప్ప పూజలు జరుగుతుండడంతో గజ్జెలు కొని తెస్తానని చెప్పి ప్రదీప్ ఆదివారం రాత్రి హైదరాబాద్‌కు బయల్దేరినట్లు అతని తండ్రి తెలిపారు. సోమవారం ఉదయం టీవీల్లో ప్రదీప్ ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలుసుకుని షాక్‌కు గురైనట్లు చెప్పారు. ‘ప్రేమ వ్యవహారాన్ని మర్చిపోవాలనే రెండేళ్ల క్రితం కుంటుంబంతో సహా స్వగ్రామం వచ్చేశాం. అయినా ప్రదీప్ ఏ మాత్రం మారలేదు. రెండు నెలల క్రితం కూడా కాలువలో పడి ఆత్మహత్యకు యత్నించాడు. గ్రామస్తులు రక్షించి కౌన్సెలింగ్ చేశారు. ఈసారి అమ్మాయి వైపు చూడనని మాపై ఒట్టు కూడా వేశాడ’ని సారయ్య కన్నీరుమున్నీరయ్యారు.

వాంగ్మూలం నమోదు
తీవ్రంగా గాయపడ్డ రవళిని తరలించిన ఆసుపత్రి వద్దకు మీడియా ప్రతినిధులు, ప్రజలు పెద్దఎత్తున చేరుకున్నారు. ఉప్పర్‌పల్లిలోని ఎనిమిదవ మెట్రోపాలిటన్ కోర్టు జడ్జి కూడా ఆసుపత్రి చేరుకుని బాధితురాలి వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. రవళికి ఎలాంటి ప్రమాదం లేదని అక్కడి వైద్యులు చెప్పడంతో ఆమెను బంజారాహిల్స్‌లోని కేర్ ఆసుపత్రికి తరలించారు. కాగా, కూతురిపై హత్యాయత్నం జరిగిందన్న విషయం తెలుసుకున్న రవళి తండ్రి గోపీ తన భార్యతో కలిసి ఆసుపత్రికి వస్తూ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఆయనను కూడా రవళిని మొదట చేర్చిన ఆసుపత్రిలోనే చేర్చారు.
 
ఎవరేం చేయగలరు?: హోంమంత్రి నాయిని
‘అది ప్రేమికుల మధ్య సమస్య. ఆ విధంగా దాడి చేసి ఆత్మహత్య చేసుకుంటే నేనే కాదు, పోలీసులు, జర్నలిస్టులు, చివరికి ఎవ్వరు కూడా ఏమీ చేయలేర’ని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి వ్యాఖ్యానించారు. సోమవారం బంజారాహిల్స్‌లోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. మహిళలపై కన్నేసే వారి కళ్లను పీకేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్చరించారని, అదే సమయంలో ఈ దాడి జరిగిందని, దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారని మంత్రిని ఓ విలేకరి ప్రశ్నించారు. అది ప్రేమికుల మధ్య జరిగిన ఘటన అని, దానికి పోలీసులు గానీ తాను గానీ చేసేదేమీ లేదని ఆయన సమాధానమివ్వడం విలేకరులను ఆశ్చర్యపరిచింది.

>
మరిన్ని వార్తలు