హడలెత్తిస్తున్న అక్టోబర్

14 Oct, 2014 01:50 IST|Sakshi
హడలెత్తిస్తున్న అక్టోబర్

కోలుకోనివ్వని తుపాన్లు
భారీగా ప్రాణ, ఆస్తి నష్టాలు మిగుల్చుతున్న పండుగల నెల
123 ఏళ్లలో 76 తుపాన్లు
అక్టోబర్ నెలలోనే 31 విపత్తులు


హైదరాబాద్: కోస్తా జిల్లాలను అక్టోబర్ వణికిస్తోంది. ఈనెల వచ్చిందంటే పెను తుపాన్లు ముంచేస్తాయని ప్రజల్లో కలవరం. కోతకొచ్చే దశలో పంటలు ధ్వంసమవుతాయని రైతుల్లో ఆందోళన. ప్రధానమైన దసరా, దీపావళి పర్వదినాలతో కూడిన ఈ నెలలోనే అధిక సంఖ్యలో తీవ్రమైన తుపాన్లు వచ్చి తీవ్ర ప్రాణ, ఆస్తి నష్టాలు కలిగిస్తుండడమే ఇందుకు కారణం. ఈ ఏడాది కూడా అదే జరిగింది. గత ఏడాది అక్టోబర్ 10-15 తేదీల మధ్య పైలీన్, నవంబర్‌లో హెలెన్, లెహర్ తుపాన్లవల్ల కకావికలమైన సంఘటనలను ప్రజలు మరువకముందే ఈ ఏడాది హుదూద్ పెను విపత్తు ఉత్తరాంధ్రలో విధ్వంసం సృష్టించింది. 1891 నుంచి అందుబాటులో ఉన్న గణాంకాలను పరిశీలిస్తే ఇప్పటి వరకూ 76 తుపాన్లు సంభవించాయి. వీటిలో 31 అక్టోబర్‌లోనే రావడం గమనార్హం. అందుకే ఈ నెలను వాయుగుండాల (గండాల) మాసంగా విపత్తు నిర్వహణ శాఖ అధికారులు అభివర్ణిస్తుంటారు. 123 ఏళ్లలో మొత్తం 76 తుపాన్లు రాగా అందులో 52 (మూడింట రెండొంతులు) అక్టోబర్, నవంబర్ నెలల్లోనే సంభవించాయి. రాష్ట్ర చరిత్రలో అతి పెద్ద పెను విపత్తుగా నమోదైన దివిసీమ ఉప్పెన కూడా నవంబర్ నెలలోనే  సంభవించడం గమనార్హం. 1977 నవంబర్ 15-20 తేదీల మధ్య సంభవించిన దివిసీమ ఉప్పెన పదివేల మందిని పొట్టన పెట్టుకుంది. ఈ పెను విపత్తులో అధికారిక లెక్కల ప్రకారమే రెండున్నర లక్షల జంతువులు చనిపోయాయి.

 హా123 ఏళ్లలో అత్యధిక (23)  తుపాన్లు నెల్లూరు జిల్లాలోనే తీరం దాటాయి. మరో 16 కృష్ణా జిల్లాలో తీరం దాటాయి. కోస్తాలోని తొమ్మిది జిల్లాలు సముద్రతీరంలోనే ఉన్నా నెల్లూరు, కృష్ణా జిల్లాల్లోనే ఎక్కువ తుపాన్లు తీరం దాటాయి. పశ్చిమ గోదావరి, విజయనగరం జిల్లాల్లో ఇప్పటి వరకూ ఒక్క తుపాను కూడా తీరాన్ని దాటిన దాఖలాలు లేవు. ఇందుకు కారణాలేమిటనే విషయంపై పరిశోధనలు సాగించాల్సిన అవసరం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు.

 హా1892 అక్టోబర్‌లో వారం వ్యవధిలోనే రెండు తుపాన్లు సంభవించినట్లు అధికారిక రికార్డులు చెబుతున్నాయి. 1987 అక్టోబర్‌లో కేవలం పక్షం వ్యవధిలో మూడు తుపాన్లు ముంచెత్తాయి. ఒక్కోసారి వరుసగా నాలుగైదేళ్లలో తుపాన్లే రావు. కొన్నిసార్లు వరుసగా నెలలోనే రెండు మూడు తుపాన్లు వస్తుంటాయి. ‘ఇందుకు కారణాలేమిటో పరిశోధనల ద్వారానే తేలాల్సి ఉంది. ఇవి పరిశోధనలకు కూడా అందని ప్రకృతి రహస్యం అనేది నా అభిప్రాయం’ అని వాతావరణ శాఖకు చెందిన ఒక నిపుణుడు‘సాక్షి’తో అన్నారు.

ఈశాన్యంలోనే తీవ్రం...

మన రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల కాలంలో కంటే ఈశాన్య రుతుపవనాల సమయంలో తుపాన్ల తీవ్రత అధికంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా అక్టోబర్‌లోనే మనకు ఎక్కువ తుపాను విపత్తులు సంభవిస్తుంటాయి. 1891 నుంచి గణాంకాలను పరిశీలిస్తే రాష్ట్రంలో ఇప్పటిదాకా 76 తుపాన్లు వచ్చాయి. వీటిలో 31 విపత్తులు అక్టోబర్‌లోనే  సంభవించడం గమనార్హం. జనవరి- ఏప్రిల్ మధ్య ఎన్నడూ తుపాన్లు రాలేదు. జూన్ నుంచి సెప్టెంబర్ వరకూ నైరుతి రుతుపవనాలు ఉంటాయి. ఈ సమయంలో కూడా తుపాన్లు సంభవిస్తుంటాయి. నైరుతి రుతుపవనాల కాలంలో మన రాష్ట్రంలో ఇవి చాలా తక్కువే. ఈశాన్య రుతుపవనాల సమయంలో మాత్రం అధికంగా, తీవ్రంగా తుపాన్లు వచ్చి కోస్తా జిల్లాల్లో పంటలను ధ్వంసం చేయడమే కాకుండా విద్యుత్తు, రహదారి, సాగునీటి వనరుల వ్యవస్థలను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. పెను నష్టం కలిగించిన తుపాన్లన్నీ అక్టోబర్, నవంబర్ మాసాల్లోనే రావడం గమనార్హం. ‘అక్టోబర్, నవంబర్ నెలల్లో సముద్ర ఉష్ణోగ్రతలు తుపాన్లకు చాలా అనువుగా ఉంటాయి. అల్పపీడనాలు తుపాన్లుగా మారుతుంటాయి. అందుకే ఈ నెలల్లోనే మనకు అత్యధిక తుపాన్లు, విపత్తు నష్టాలు సంభవిస్తుంటాయి’ అని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రతినిధి నరసింహారెడ్డి ‘సాక్షి’కి తెలిపారు.
 
 

మరిన్ని వార్తలు