రుణమాఫీకి కట్టుబడి ఉన్నా

28 May, 2014 01:49 IST|Sakshi
రుణమాఫీకి కట్టుబడి ఉన్నా

వ్యవసాయూన్ని లాభసాటిగా చేసేవరకు రైతులకు అండగా ఉంటా  తెలుగుదేశం మహానాడులో చంద్రబాబు వెల్లడి
 
సీమాంధ్ర ఒకస్థారుుకి చేరేవరకుకేంద్రం ఆదుకోవాలి
పార్టీ శ్రేణులు రెండురోజుల సంపాదన విరాళంగా ఇవ్వాలి
వార్‌రూమ్‌లతో టీఆర్‌ఎస్ సాధించేదేమీ లేదు

 
హైదరాబాద్: రైతు రుణాల మాఫీతో పాటు డ్వాక్రా రుణాల రద్దుకు కూడా కట్టుబడి ఉన్నానని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు చెప్పారు. ప్రతిపక్షంలో ఉండి పాదయాత్ర సమయంలో చేసిన సమయంలో రైతుల బాధలు చూసి వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తానని హామీ ఇచ్చానన్నారు. రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా చేసేవరకు రైతులకు అండగా ఉంటానని పేర్కొన్నారు. ఎన్నికలు ఇప్పుడే అయిపోయాయని, రాష్ట్ర విభజన ప్రక్రియ పూర్తి కాకమునుపే కాంగ్రెస్ వాళ్లు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలంటున్నారని విమర్శించారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఈ విషయమై మాట్లాడే అర్హతే లేదన్నారు. సీమాంధ్రను స్వర్ణాంధ్రగా, మరో సింగపూర్‌గా మారుస్తానని చెప్పారు. టీడీపీ ప్రతి ఏటా నిర్వహించే మహానాడు హైదరాబాద్ సమీపంలోని గండిపేటలో మంగళవారం ఉదయం ప్రారంభమైంది. సీమాంధ్రలో పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో తెలుగుదేశం శ్రేణులు ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి. రెండురోజుల పాటు జరిగే 33వ మహానాడులో చంద్రబాబు ప్రారంభోపన్యాసం చేశారు.

అభివృద్ధి బాధ్యత కేంద్రానిదే..
రాష్ట్ర విభజన తరువాత ఏర్పడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే బాధ్యత పూర్తిగా కేంద్ర ప్రభుత్వానిదేనని అన్నారు. విభజన బిల్లులో తెలంగాణకు ఇచ్చిన హామీలకు కట్టుబడుతూనే.. సీమాంధ్ర ఒక స్థాయికి చేరుకునే వరకు నిధులు కేటాయించాలని కోరారు. రాష్ట్రానికి రూ.10 వేల కోట్ల నుంచి రూ.15 వేల కోట్ల లోటు బడ్జెట్ ఉందని చెప్పారు. సీమాంధ్రలో రాజధాని నిర్మాణానికి భూముల దగ్గర నుంచి వెతుక్కోవాల్సిన పరిస్థితి ఉందని అన్నారు. ఇప్పుడు పార్టీ శ్రేణులందరిపై గురుతర బాధ్యత ఉందంటూ.. కొత్త రాజధాని నిర్మాణం కోసం నెలలో రెండురోజుల సంపాదన విరాళంగా ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. సీమాంధ్రలో హైదరాబాద్ లాంటి మూడు నాలుగు నగరాలను అభివృద్ధి చేసే సత్తా ఉందన్నారు. టీడీపీని జాతీయ పార్టీగా ప్రకటించేందుకు అన్ని అవకాశాలు ఉన్నాయని చంద్రబాబు చెప్పారు.

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ఉన్న పార్టీ భవిష్యత్‌లో ఐదారు రాష్ట్రాల్లో పోటీ చేస్తుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీని ఈసారి రాష్ట్రంలోనే కాదు దేశంలోనూ ప్రజలు చిత్తుచిత్తుగా ఓడించారన్నారు. 125 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన పార్టీ సీమాంధ్రలో కేవలం రెండు శాతం ఓట్లు కూడా తెచ్చుకోలేకపోయిందంటే ఎలాంటి స్థితికి చేరుకుందో తెలిసిపోతోందన్నారు. తెలుగువాడు పీవీ నరసింహారావు ప్రధాని స్థాయికి ఎదిగినప్పటికీ ఆయనకు ఢిల్లీలో కనీసం స్మారక స్థూపం లేకుండా ఆ పార్టీ చేసిందని విమర్శించారు. అక్కడ పీవీ ఘాట్ కట్టే బాధ్యత టీడీపీ తీసుకుంటుందని చెప్పారు.

హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను పోగొట్టొద్దు
హైదరాబాద్ నగరానికి ఉన్న బ్రాండ్ ఇమేజ్‌ను పోగొట్టవద్దని కొత్తగా ఏర్పడబోయే తెలంగాణ ప్రభుత్వానికి చంద్రబాబు సూచించారు. హైదరాబాద్‌లో ప్రజలకు రక్షణ ఇవ్వాలని కోరారు. టీఆర్‌ఎస్ పార్టీ వార్‌రూమ్‌లు ఏర్పాటు చేయడం ద్వారా సాధించేదేమీ ఉండదని, కాంగ్రెస్ ఢిల్లీలో ఇలాంటి వార్‌రూమ్‌లే పెట్టి అడ్రస్ లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. పోలవరం సమస్యను జటిలం చేయాలని కేసీఆర్ చూస్తున్నారని విమర్శించారు.

పార్టీ శ్రేణులను రెచ్చగొట్టేలా ప్రసంగం
రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్  రాష్ట్రానికి ముఖ్యమంత్రి కానున్న చంద్రబాబు మహానాడు వేదికగా పార్టీ శ్రేణులను రెచ్చగొట్టేలా మాట్లాడారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పడు ఎప్పుడూ కక్ష సాధింపు చర్యలకు పాల్పడలేదని, 2004లో అధికారంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖరరెడ్డి టీడీపీని బలహీన పరిచేందుకు హత్యా రాజకీయాలను ప్రోత్సహించారని ఆరోపించారు.

అనంతపురం జిల్లాలో పరిటాల రవి హత్య ఇందుకొక ఉదాహరణ అని చెప్పారు. ఆ జిల్లాలో రోజుకొక ప్రాంతంలో పార్టీ నేతల హత్యలు జరిగేవన్నారు. బాధిత కుటుంబానికి చెందిన పిల్లలను తాను గండిపేట స్కూలులో ఉంచి చదివిస్తున్నానని చెప్పారు. వారితో తాను మాట్లాడినప్పుడు.. ‘మా నాన్నను చంపిన వ్యక్తులను చంపేవరకు వదిలిపెట్టం’ అని వారు చెప్పేవారన్నారు. తాను మాత్రం హత్యకు హత్య సమాధానం కాదని వారికి చెప్పానన్నారు.

బాబును అభినందిస్తూ తీర్మానం
ఇటీవలి ఎన్నికల్లో టీడీపీని గెలిపించినందుకు అధ్యక్షుడు చంద్రబాబును అభినందిస్తూ మహానాడు ఏక గ్రీవంగా తీర్మానించింది.పార్టీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య ఈ తీర్మానం ప్రవేశపెట్టారు. విజయానికి సహకరించిన పార్టీ కార్యకర్తలకు అభినందనలు తెలిపారు.

సొమ్మసిల్లిన తిరుపతి ఎమ్మెల్యే
తిరుపతి ఎమ్మెల్యే వెంకటరమణ సభా వేదిక వద్ద సొమ్మసిల్లి పడిపోయారు. ఉదయం మహానాడు వేదిక పైకి చంద్రబాబు వచ్చినప్పుడు తొక్కిసలాట జరగడంతో అక్కడే ఉన్న వెంకటరమణ సొమ్మసిల్లి పడిపోయారు. ఉదయం 11 గంటల సమయంలో పార్టీ నేతలు అనేకమంది ఒకేసారి గండిపేటకు చేరుకోవడంతో ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో సినీ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ, బాబు కుమారుడు లోకేష్ కొద్ది దూరం నడిచి వేదిక వద్దకు చేరుకోవాల్సి వచ్చింది.

పొలిట్‌బ్యూరో సభ్యుడు నందమూరి హరికృష్ణతో పాటు పార్టీ రాష్ర్ట కార్యవర్గంలోని వారందరూ వేదికపై ఆశీనులయ్యారు. మహానాడు ప్రారంభానికి ముందు  పార్టీ వ్యవస్థాపకుడు ఎన్‌టీఆర్‌కు నివాళులు అర్పించటంతో పాటు పార్టీ జెండాను బాబు ఎగురవేశారు. అంతకుముందు రక్తదాన శిబిరం, ఫొటో ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు.

సాక్షిని అనుమతించని నేతలు
మహానాడు కార్యక్రమానికి సాక్షి పత్రికను టీడీపీ ఆహ్వానించలేదు. కవరేజీ కోసం వెళ్లిన సాక్షి ప్రతినిధులను ఆ పార్టీ నేతలు ప్రాంగణంలోకి అనుమతించలేదు. దీంతో వివిధ మార్గాల్లో సేకరించి ఈ సమాచారాన్ని పాఠకులకు అందిస్తున్నాం.

>
మరిన్ని వార్తలు