నేనో ఆర్థికవేత్తను

8 Feb, 2019 03:25 IST|Sakshi

శాసనసభలో సీఎం చంద్రబాబు నాయుడు 

సాక్షి, అమరావతి: ‘నేనో ఆర్థిక శాస్త్రవేత్తను.. ఆర్థిక శాస్త్ర విద్యార్థిని.. పేదరికం లేకుండా సమాజాన్ని ఎలా తీర్చిదిద్దాలో నాకు తెలుసు’ అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. గురువారం శాసనసభలో ‘సామాజిక సాధికారత, సంక్షేమం, మానవ వనరుల అభివృద్ధి’పై నిర్వహించిన లఘు చర్చలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్య చేశారు. సమాజానికి పేదరికం శాపం వంటిదని అన్నారు. దేశంలో 19 91లో ఆర్థిక సంస్కరణలు అమల్లోకి వచ్చాక.. ప్రపంచీకరణతో కులవృత్తులు, చేతివృత్తులు దెబ్బతిన్నాయన్నారు. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీల్లో పేదలు ఉన్నట్లు అగ్రవర్ణాల్లోనూ ఉన్నారన్నారు.  

లీడర్‌ను కాబట్టే.. జనాభా పెంచాలని కోరుతున్నా.. 
2014 ఎన్నికలకు ముందు తాను చేసిన పాదయాత్రలో ఎక్కువమంది పిల్లలకు జన్మనివ్వాలని.. జనాభాను పెంచాలని పిలుపునిస్తే అందరూ అవహేళన చేశారని సీఎం అన్నారు. చైనా, జపాన్‌లో జనాభా తగ్గడం వల్ల వృద్ధులు అధికమైపోయార న్నారు. 1995 నుంచి 2004 వరకు తాను చేపట్టిన చర్యలతో జనాభా గణనీయంగా తగ్గిందన్నారు. కానీ ఇది సమాజానికి మంచిది కాదని, జనాభా పెరగాల్సి ఉందని, భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని తానీ పిలుపునిస్తున్నానని చెప్పారు.  

ప్రజల ఆరోగ్యం మెరుగుపడింది.. 
ఆహార భద్రత చేకూర్చడంతో రాష్ట్ర ప్రజల ఆరోగ్యం మెరుగుపడిందని సీఎం చెప్పారు.  విద్యా భద్రత చేకూర్చడం వల్ల పేదరికం తగ్గుతుందన్నారు. నిరుద్యోగులకు మార్చి నుంచి దీన్ని రెండువేలకు పెంచుతున్నామని చెప్పారు. డ్వాక్రా మహిళలకిచ్చే చెక్కులకు బ్యాంకర్లు డబ్బులివ్వకపోతే.. తిరుగుబాటు చేసైనా డబ్బులు తీసుకోవాలన్నారు.వ్యవసాయం, అనుబంధ రంగాల్లో 11 శాతానికిపైగా వృద్ధి నమోదయ్యిందని చెప్పారు. 23 ప్రాజె క్టులు  పూర్తి  చేశామన్నారు. జూన్‌నాటికి గ్రావిటీద్వారా పోలవరం నుంచి నీటినందిస్తామన్నారు. 

మరిన్ని వార్తలు