గోరంతకు కొండంత ప్రచారంలో టీడీపీది గిన్నిస్‌ రికార్డు

8 Feb, 2019 03:18 IST|Sakshi

బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజు ఎద్దేవా

సాక్షి, అమరావతి: గోరంతకు కొండంత ప్రచారం చేసుకోవడంలో టీడీపీ ప్రభుత్వం గిన్నిస్‌ రికార్డు సాధిస్తుందని బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్‌ రాజు ఎద్దేవా చేశారు. ‘సామాజిక సాధికారత, సంక్షేమం, మానవ వనరుల అభివృద్ధి’ పై గురువారం శాసనసభలో జరిగిన చర్చలో ఆయన ప్రసంగించారు. ప్రస్తుతం రాష్ట్రంలో  ‘పింఛన్లు రూ.వెయ్యి నుంచి రూ.2 వేలకు పెంచామని చెప్పుకుంటున్నారు. కానీ మరోవైపు కుటుంబంలో ఇద్దరు దివ్యాంగులు పెన్షన్‌ పొందుతుంటే ఒకరిని తొలగిస్తున్నారు’ అని విష్ణుకుమార్‌ రాజు మండిపడ్డారు. కాగా, పోలవరం ప్రాజెక్టు కేంద్రం ఇచ్చిన ప్రసాదమైతే అధికారపార్టీ నేతలు ప్రపంచమంతా తమ ఘనతేనంటూ డప్పు కొట్టుకుంటున్నారని విష్ణుకుమార్‌రాజు విమర్శించారు.

గురువారం శాసనసభలో నదుల అనుసంధానంపై జరిగిన చర్చ సందర్భంగా పిఠాపురం ఎమ్మెల్యే వర్మ మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం అనుసరిస్తున్న తీరును తప్పుపట్టారు. దీంతో విష్ణుకుమార్‌రాజు పైవిధంగా ప్రతిస్పందించారు. విష్ణుకుమార్‌రాజు వ్యాఖ్యలకు మంత్రి జవహర్‌ అభ్యంతరం తెలిపారు. ‘డప్పు’ అంటూ ఒక కులాన్ని కించపరిచేలా విష్ణుకుమార్‌ మాట్లాడుతున్నాడని తప్పుపట్టారు. విష్ణుకుమార్‌రాజు బదులిస్తూ.. డప్పు కాకపోతే హర్మోనియం వాయించుకుంటున్నారంటూ చురకలంటించారు. మంత్రి ఉమా కలుగజేసుకుంటూ కేంద్రం దయాదాక్షిణ్యాలపై ఆధారపడి కట్టట్లేదన్నారు. స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు జోక్యం చేసుకుంటూ.. పోలవరం ప్రాజెక్టు ప్రజల హక్కు అంటూ బదులిచ్చారు. అలాగైతే పెన్షన్లు, పసుపు–కుంకుమ కూడా ప్రజల హక్కు కిందకే వస్తాయని విష్ణుకుమార్‌రాజు అన్నారు. 

మరిన్ని వార్తలు