ఎల్‌నినో ఉన్నట్టా? లేనట్టా?

21 Apr, 2017 02:02 IST|Sakshi
ఎల్‌నినో ఉన్నట్టా? లేనట్టా?

ఉందంటున్న స్కైమెట్, అంతర్జాతీయ సంస్థలు
అలాంటిదేమీ లేదన్న ఐఎండీ


ఈ ఏడాది రుతుపవనాల తీరుతెన్నులపై భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తన ముందస్తు అంచనాలు విడుదల చేసింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో సాధారణ వర్షపాతం నమోదవుతుందని, ఎల్‌నినోతో వచ్చిన ముప్పేమీ లేదని భరోసానిచ్చింది. అయితే ఇది ఎంత వరకు వాస్తవమన్న విషయంపై ఇప్పుడు సందేహాలు తలెత్తుతున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి అమెరికా మొదలుకొని అనేక విదేశీ వాతావరణ సంస్థలు 2015–16లో వచ్చిన తీవ్ర ఎల్‌ నినో పరిస్థితులు ఈ ఏడాది కూడా రానున్నాయని స్పష్టం చేశాయి.

దేశంలోనే తొలి ప్రైవేట్‌ వాతావరణ అంచనాల సంస్థ స్కైమెట్‌ కూడా గతనెల ఆఖరులో ఇదే విషయాన్ని తెలిపింది. జూన్‌సెప్టెంబర్‌ మధ్య కాలంలో రుతుపవనాల సీజన్‌ రెండో అర్ధభాగంలో ఎల్‌నినో ప్రభావం ఉంటుందని తెలిపింది. ఐఎండీ అప్పట్లో ఎల్‌నినో ప్రభావం పెద్దగా ఉండబోదని చెప్పింది. తాజాగా అసలు ఉండబోదని అంటోంది. వీటిల్లో ఏది నిజమన్న విషయం తెలుసుకోవాలంటే ముందుగా ఎల్‌నినో అంటే ఏమిటో? దాని ప్రభావం ఎక్కడ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.

ఎల్‌నినో ఏర్పడితే...?: దక్షిణ అమెరికాకు సమీపంలో భూమధ్య రేఖకు కొంచెం అటుఇటుగా సముద్ర ఉపరితల నీరు వెచ్చబడితే దాన్ని ఎల్‌నినో అని పిలుస్తారన్నది తెలిసిందే. ఉపరితల నీటి ఉష్ణోగ్రత పెరిగిపోవడం వల్ల అక్కడ నీటి ఆవిరి ఎక్కువవుతుంది. అంటే ఆ ప్రాంతంలోని గాలి వేడెక్కడంతోపాటు తేమ శాతం ఎక్కువవుతుంది. ఇలా వేడెక్కిన గాలి భూవాతావరణ పై పొరల్లోకి చేరి... మేఘాలను మోసుకెళ్లే జెట్‌స్ట్రీమ్స్‌ను ప్రభావితం చేస్తాయి.

 ఫలితంగా అమెరికాలోని దక్షిణ ప్రాంతాల్లో ఎక్కువ వర్షాలు నమోదైతే.. ఆస్ట్రేలియా మొదలుకొని భారత్‌ వరకూ వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశాలు పెరుగుతాయి. సాధారణంగా ఎల్‌నినో అనేది సగటున నాలుగైదు సంవత్సరాలకు ఒకసారి కనిపిస్తుంటుంది. అయితే భూ తాపోన్నతి ఫలితంగా వాతావరణం మారిపోతున్న నేపథ్యంలో ఇటీవలి కాలంలో తరచూ ఎల్‌నినో తరహా పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇది ఉష్ణోగ్రతలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. 2015–16 సీజన్‌లో ఎల్‌నినో తీవ్రత గరిష్టంగా ఉండగా... ఆ రెండేళ్లలో రికార్డుస్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

ఈ ఏడాది మాటేమిటి?: ఇప్పటివరకున్న పరిస్థితులను బేరీజు వేస్తే ఎల్‌నినో ఏర్పడేందుకు యాభై శాతం అవకాశాలున్నాయి. పసిఫిక్‌ మహా సముద్ర ప్రాంతంలో ఇప్పటికైతే ఉపరితల నీటి ఉష్ణోగ్రతలు సాధారణంగానే ఉన్నాయి. అయితే దక్షిణ అమెరికా>కు అవతలి వైపున పసిఫిక్‌ మహాసముద్ర ప్రాంతంలో మాత్రం ఉపరితల నీటి ఉష్ణోగ్రతలు హెచ్చాయని, ఫలితంగానే ఇటీవల ఈక్వెడార్, పెరూలలో అధిక వర్షపాతం నమోదైందని అమెరికా వాతావరణ సంస్థ చెబుతోంది.

దీని ప్రభావం వల్ల ఎల్‌నినో బలం పుంజుకుంటుందా? అన్నది స్పష్టం కావాల్సి ఉంది. మరోవైపు దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా వాతావరణ సంస్థలు కూడా ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు ఉండవచ్చని హెచ్చరించాయి. దీంతో ఈ ఏడాది నైరుతి రుతుపవనాలపై ఇప్పటికీ కొన్ని సందేహాలు ఉన్నాయడంలో సందేహం లేదు. భారత వాతావరణ సంస్థ రెండ్రోజుల క్రితం విడుదల చేసింది ముందస్తు అంచనాలే కాబట్టి.. త్వరలో విడుదల చేసే అసలు అంచనాల్లో ఎల్‌నినో ప్రస్తావన ఉంటుందా? లేదా? అన్నది వేచి చూడాల్సి ఉంది.    
– సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

మరిన్ని వార్తలు