తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలు

4 Sep, 2023 10:33 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌/విశాఖ: ఈశాన్య బంగాళాఖాతంలో ఆవర్తన ప్రభావంతో.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆవర్తనం రేపటి కల్లా బలపడి అల్పపీడనంగా మారనుంది.  ఈ క్రమంలో.. మరో రెండు మూడు రోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవొచ్చని హెచ్చరికలు జారీ చేసింది భారత వాతావరణ శాఖ.  

ఇప్పటికే తెలంగాణలో పలు జిల్లాలకు అలర్ట్‌లు జారీ చేసింది వాతావరణ శాఖ. తొమ్మిది జిల్లాలకు ఆరెంజ్‌, 18 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. హైదరాబాద్‌కు భారీ వర్షసూచన చేయడంతో జీహెచ్‌ఎంసీ అప్రమత్తమైంది. 

తెలంగాణలో.. నిన్నటి నుంచి పలు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వాన కురుస్తోంది. భూపాలపల్లి, ఉమ్మడి ఆదిలాబాద్‌లో వాగులు పొంగిపొర్లి.. పలు గ్రామాలకు రాకపోకలకు స్తంభించాయి. నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టుకు వరద పోటెత్తడంతో.. రెండు గేట్లను ఎత్తి వరదనీటిని దిగువకు వదులుతున్నారు. 

► ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాను..  మళ్లీ వర్షాలు ప్రజలకు దడపుట్టిస్తున్నాయి. ఈ ఉదయం నుంచి ఆదిలాబాద్‌ కేంద్రంలో భారీ వాన కురుస్తుండగా.. రోడ్లు జలమయం అయ్యాయి.  ఇప్పటికే రాకపోకలు నిలిచిపోగా..  ప్రజలు  తీవ్రమైన ఇబ్బందులు  పడుతున్నారు.

► భూపాలపల్లిలోనూ నిన్నటి నుంచి వాన కురుస్తుండడంతో.. ఓపెన్‌ కాస్ట్‌ పనులకు అంతరాయం కలుగుతోంది.

నిజామాబాద్‌లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. డిచ్‌పల్లిలో అత్యధిక వర్షపాతం నమోదు అయ్యింది.

ఉమ్మడి మెదక్‌లోనూ భారీ వర్షం కురుస్తోంది. గరిష్టంగా 13 సెం.మీ. వర్షపాతం నమోదైనట్లు సమాచారం.


ఆంధ్రప్రదేశ్‌ దక్షిణ కోస్తా ప్రాంతంలో.. రేపు, భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. బలంగా గాలులు వీస్తాయని, ఎల్లుండి సైతం భారీ వానలు ఉంటాయని అప్రమత్తం చేస్తోంది.

కర్నూలు:  జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇక వర్షం నేపథ్యంలో.. రాయలసీమ జోన్ ఎస్సై అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షలు వాయిదా పడ్డాయయి. ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ జోన్ పరిధిలో(సెప్టెంబర్ 4 వ తేది) కర్నూల్ APSP  2  వ బెటాలియన్ లో సోమవారం జరగాల్సిన ఎస్సై అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షలను భారీ వర్షం కారణంగా వాయిదా వేస్తున్నట్లు కర్నూల్ రేంజ్ డీఐజీ సెంథిల్ కుమార్ తెలిపారు. ఈ పరీక్షలను సెప్టెంబరు 21  తేదికి వాయిదా వేస్తున్నట్లు తెలిపారు.

నెల్లూరు: ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న వర్షాలకు సోమశిల జలాశయానికి వరద పెరుగుతోంది. ఇన్ ఫ్లో 13,897 క్యూసెక్కులు.. అవుట్ ఫ్లో 2,774 క్యూసెక్కులుగా ఉంది. ప్రస్తుత నీటిమట్టం 17.610 టీఎంసీలు కాగా.. జలాశయం పూర్తి కెపాసిటీ 78 టీఎంసీలు.

అనంతపురం: తాడిపత్రిలో భారీ వర్షం కురుస్తోంది. పలు వాగులు వంకలు పొంగిపొర్లడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలుగుతోంది.


 

మరిన్ని వార్తలు