ముంచెత్తనున్న రోగాలు

24 Jul, 2015 01:37 IST|Sakshi

శ్రీకాకుళంసిటీ/ఆమదాలవలస/రాజాం/ఇచ్ఛాపురం: జిల్లాలోని మునిసిపాలిటీలు చెత్తమయం అవుతున్నాయి. కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికులు గడచిన 13రోజులుగా చేపడుతున్న సమ్మె విరమణపై పాలకులు నిర్లక్ష్యం వహిస్తుండటంతో ఎక్కడిచెత్త అక్కడే పేరుకుపోతోంది. గడచిన రెండు, మూడు రోజులుగా అడపాదడపా కురుస్తున్న వర్షాలకు అదికాస్తా వీధుల్లోకి చెల్లాచెదురుగా విస్తరించి దుర్వాసన వెదజల్లుతోంది. కాలువల్లోకి చెత్త చేరుతుండటంతో మురుగు ప్రవాహానికి అవరోధంగా మారుతోంది. ఫలితంగా కాలువల్లో నీరు కొన్ని చోట్ల ఇళ్లల్లోకి వచ్చేస్తోంది. జిల్లాలోని శ్రీకాకుళం, ఆమదాలవలస, ఇచ్ఛాపురం, పలాస మునిసిపాలిటీలతోపాటు రాజాం, పాలకొండ నగర పంచాయతీల్లో ప్రజలు ఇప్పుడు రోగాలభయంతో ఆందోళన చెందుతున్నారు.
 
 చిక్కోలు చెత్తమయం
 శ్రీకాకుళం పట్టణం 36వార్డులుగా విస్తరించింది. ఇక్కడ 325 మంది కాంట్రాక్టు సిబ్బంది సమ్మెలో పాల్గొంటున్నారు. వీరికి 109 మంది వరకు పర్మినెంట్ సిబ్బంది కూడా మద్దతు తెలపడంతో సమ్మె తీవ్రరూపం దాలుస్తోంది. పలు వార్డుల్లో పరిస్థితి మరీ దారుణంగా మారింది. ప్రధాన కూడళ్లు, పలు వార్డుల్లో చెత్త పేరుకుపోతున్నా పట్టించుకోని ప్రభుత్వాన్ని స్థానికులు దుమ్మెత్తిపోస్తున్నారు. స్వచ్చభారత్‌ను దేశ ప్రధాని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నప్పటికీ స్థానికంగా ఉండే పార్లమెంట్ సభ్యుల్లో చిత్తశుద్ధి కరువవుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
 
 అధ్వానంగా ఆమదాలవలస
 ఇక్కడ రెగ్యులర్ ఏడుగురు, చివరిస్థాయి కార్మికులు ఐదుగురు ఉద్యోగులుండగా, కాంట్రాక్టు కార్మికులు 60మంది ఉన్నారు. ఉన్న 12మంది కార్మికులు పట్టణంలోపారిశుద్ధ్యం మెరుగుపర్చలేకపోతున్నారు. సమ్మెప్రభావంతో పట్టణమంతా అధ్వానంగా మారింది. ఎక్కడికక్కడే చెత్త గుట్టలుగుట్టలుగా పెరుగుతున్నాయి. వర్షాలవల్ల దోమలు కూడా విజృంభిస్తున్నాయి. ప్రధానంగా 16వ వార్డు డాబాలవారి వీధి గబ్బు కంపు కొడుతోంది. ఈ వీధిలో గేదెల పెంపకందారులు ఎక్కువగా ఉన్నారు. ఇక్కడి కాలువలన్నీ పేడతో పూడుకుపోవడంతో దుర్వాసన వ్యాపిస్తోందని స్థానికులు వాపోతున్నారు. కాస్త లోతట్టుగా ఉన్న ఇళ్లలోకి పేడనీరు పోటెత్తుతుండటంతో ఇళ్లు ఖాళీ చేసి, వేరే ప్రాంతానికి వెళ్లాల్సివస్తోందని చెబుతున్నారు.
 
 పలాసలో అపారిశుద్ధ్యం
 పలాస మునిసిపాలిటీలో 25వార్డులు విస్తరించగా ఇక్క డ 88మంది కాంట్రాక్టు పారిశుద్ద్య కార్మికులు, 11మం ది రెగ్యులర్ కార్మికులు ఉన్నారు. కాంట్రాక్టు సిబ్బంది చేస్తు న్న సమ్మె పుణ్యమాని పట్టణంలో ఏ మూల చూసినా అపారిశుద్ద్యం తాండవిస్తోంది. ఇక ఇచ్ఛాపురం మునిసిపాలిటీలో 77మంది కాంట్రాక్టు కార్మికులు 14మంది రెగ్యులర్ సిబ్బంది ఉన్నారు. కాంట్రాక్టు కార్మికులంతా సమ్మె చేపడుతుండటంతో చెత్తకుప్పలు ఎక్కువవుతున్నాయి. ఇంకా రాజాం, పాలకొండ నగరపంచాయతీ ల్లో పరిస్థితి ఇందుకు భిన్నంగా లేదు. రాజాంలో మొత్తం 79మంది సమ్మెలో పాల్గొన డంతో పట్టణంతోపాటు ఆనుకుని ఉన్న ఐదు పంచాయతీల్లోనూ చెత్త పెరిగిపోయింది. ఇప్పటికైనా పాలకులు వీటిపై దృష్టిసారించి సమ్మె విరమింపజేసేందుకు చర్య లు తీసుకోకుంటే రాబోయే కొద్దిరోజుల్లో రోగాలు విస్తరించడం ఖాయమని ప్రజలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

మరిన్ని వార్తలు