213 మందికి ఇద్దరు ఎమ్మెల్యేలు.. చిన్న తండాకు పెద్ద తంటాలు!

16 Nov, 2023 12:18 IST|Sakshi

హన్మకొండ: డోర్నకల్‌ మున్సిపాలిటీ పరిధిలోని 71 ఇళ్లు, 213 మంది ఓటర్లు కలిగిన ఓ చిన్న తండాకు ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఐదవ వార్డు పరిధి లచ్చాతండా మధ్యలో సీసీ రోడ్డు ఉంటుంది. తండాలోకి వెళ్తుండగా కుడివైపున డోర్నకల్‌ మున్సిపాలిటీ ఐదవ వార్డు పరిధిలో 40 ఇళ్లు ఉండగా, 140 మంది ఓటర్లు ఉన్నారు. వీరంతా డోర్నకల్‌ నియోజకవర్గ పరిధిలోకి వస్తారు. రోడ్డుకు ఎడమ వైపున లచ్చాతండా ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం, బర్లగూడెం పరిధిలోని 10వ వార్డులో ఉండగా ఇక్కడ 31 ఇళ్లు, 73 మంది ఓటర్లు ఉన్నారు.

ఇక్కడి ఓటర్లంతా ఇల్లెందు నియోజకవర్గ పరిధిలో ఉన్నారు. తండాలో ఒకే కుటుంబానికి చెందిన వారు విడిపోయి రోడ్డుకు ఇరు పక్కల ఇళ్లు నిర్మించుకోవడంతో తండ్రి కుటుంబం ఓ నియోజకవర్గంలో, కుమారుడి కుటుంబం మరో నియోజకవర్గంలో ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. కొద్ది రోజుల క్రితం వరకు ఈ తండాకు డోర్నకల్‌ నియోజకవర్గం నుంచి డీఎస్‌ రెడ్యానాయక్, ఇల్లెందు నుంచి హరిప్రియ ప్రాతినిథ్యం వహించారు.

ఎర్రమట్టితండా..
డోర్నకల్‌ మున్సిపాలిటీ మూడో వార్డు పరిధిలోని ఎర్రమట్టి తండా, గార్ల మండలం రాజుతండా గ్రా మపంచాయతీలు కలిసి ఉన్నాయి. రోడ్డుకు ఓ వైపు ఎర్రమట్టితండా, మరో వైపు రాజుతండా ఉండగా రెండు తండాలను విడదీస్తూ మధ్యలో రోడ్డు ఉంది. అయితే తండాలు కలిసి ఉన్నా డోర్నకల్, ఇల్లెందు నియోజకవర్గాల పరిధిలో ఉండడం గమనార్హం. 

మరిన్ని వార్తలు