‘ఇండియాటుడే’ తీయబోతున్నా

6 Jan, 2014 05:53 IST|Sakshi

 ప్రముఖ నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి
 సూళ్లూరుపేట, న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర, తెలంగాణ విభజన ఉద్యమాల నేపథ్యంలో నేతల స్వార్థ ప్రయోజనాలను ప్రజలకు వివరించేందుకు జయం మూవీస్ పతాకంపై ‘ఇండియాటుడే’ సినిమా తీయనున్నట్టు ప్రముఖ నిర్మాత, వైఎస్సార్‌సీపీ నాయకుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి తెలి పారు. తన 50వ పుట్టినరోజును పురస్కరించుకుని సూళ్లూరుపేటలో చెంగాళమ్మ పరమేశ్వరి దేవస్థానంలో ఆదివారం 500 మందికి జగదీశ్వరరెడ్డి అన్నదానం చేశారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తనది సొంత జిల్లా నెల్లూరే అన్నారు.
 
 సొంత బ్యానర్‌పై స్వీయ దర్శకత్వలో ఇండియాటుడే చిత్రాన్ని నిర్మిస్తున్నట్టు కేతిరెడ్డి చెప్పారు. ఇందులో అందరూ కొత్త నటులే నటిస్తారన్నారు. అన్యాయాన్ని ఎదిరించే జర్నలిస్టు పాత్రను సినిమాలో ప్రధానంగా చిత్రీకరించనున్నట్టు జగదీశ్వరరెడ్డి తెలిపారు. ఇది వరకు జయం, నిజం, జై, అందరం, కేక సినిమాలతో పాటు ఎన్నో ఇంగ్లిష్ సినిమాలను డబ్బింగ్ చేసినట్టు కేతిరెడ్డి తెలిపారు. గత ఏడాది శ్రీలంకలో తమిళులు పడుతున్న బాధల ఇతివృత్తంగా తీసిన ‘రావణదేశం’ సినిమాను తమిళ రాజకీయ నేతలు వైగో, విజయ్‌కాంత్ లాంటి వారు చూసి తాము చేయలేని పనిని తెలుగువాడివైన నీవు చేశావని తనను ప్రశంసించారన్నారు.
 
 రాజకీయ జీవితంలో గత 35 ఏళ్లుగా మహానేత వైఎస్సార్ అభిమానినన్నారు. అలాగే వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అభిమానిగా ఉంటున్నానని చెప్పారు. ఇండియాటుడే సినిమాను వీలైనంత త్వరలో ప్రారంభించి దక్షిణాదిలో అన్ని భాషల్లో విడుదల చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆలయ ముఖ్య కార్యనిర్వహణాధికారి పోరెడ్డి శ్రీనివాసులురెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చిలకా యుగంధర్  పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు