ఇంటర్ మార్కులతో ఎంబీబీఎస్సా?

1 Aug, 2014 02:05 IST|Sakshi

యాజమాన్య సీట్ల భర్తీ కుదరదు: ఎంసీఐ
 సాక్షి, హైదరాబాద్: ఇంటర్ మార్కుల ఆధారంగా ఎంబీబీఎస్‌లో యాజమాన్య కోటా సీట్లు భర్తీ చేసే ప్రయత్నాలను భారతీయ వైద్య మండలి (ఎంసీఐ) తిరస్కరించింది. వైద్యవిద్యలో ప్రవేశాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వ లేదా ప్రైవేటు ఆధ్వర్యంలో పరీక్ష ద్వారానే ఎంపిక జరగాలని సూచించింది. ఈ మేరకు 2013లో కేంద్ర వైద్య ఆరోగ్యశాఖకు లేఖ రాసినట్టు ఎంసీఐ వర్గాలు పేర్కొన్నాయి. పోస్ట్ మెట్రిక్యులేషన్ పూర్తవగానే ఎంబీబీఎస్‌లో చేరడమనేది విరుద్ధమని కేంద్రానికి రాసిన లేఖలో పేర్కొంది. ప్రవాస భారతీయులకు 15 శాతం కోటా మినహాయించి మిగతా 85 శాతం ప్రైవేటు సీట్లను ఇంటర్ మార్కుల ఆధారంగా ఆంధ్రప్రదేశ్‌లో భర్తీ చేయనున్నట్లు వార్తలు రావటంపై ఎంసీఐ వర్గాలు స్పందించాయి. గత మూడేళ్లుగా ఆంధ్రప్రదేశ్‌లో యాజమాన్య కోటా సీట్ల భర్తీ విధానంపై హెచ్చరిస్తూనే ఉన్నామని ఎంసీఐ అధికారి ఒకరు తెలిపారు. కచ్చితమైన విధివిధానాలతో ప్రభుత్వ ఆధ్వర్యంలో లేదా ప్రైవేట్ కళాశాలలే ప్రవేశ పరీక్ష నిర్వహించుకుని యాజమాన్య కోటా సీట్లు భర్తీ చేసుకోవాలని చెప్పామన్నారు.
 
  రెండు రాష్ట్రాలుగా విడిపోయినంత మాత్రాన ఎంసీఐ నిబంధనలు మారవని స్పష్టం చేశాయి. ఇంటర్ మార్కుల ఆధారంగా ఎంబీబీఎస్‌లో ప్రవేశాలు సరికాదని అధికార వర్గాలు తేల్చి చెప్పాయి. పరీక్షలు నిర్వహించుకోలేకపోవడం, సకాలంలో కౌన్సెలింగ్ చేయలేకపోవడమనేది విద్యార్థుల తప్పిదం కాదని, అది కేవలం ప్రభుత్వాల అలసత్వం మాత్రమే అవుతుందని ఎంసీఐ అధికారులు అభిప్రాయపడ్డారు. దీనికోసం విద్యార్థులను ఇబ్బంది పెట్టడం మంచిది కాదన్నారు. వివిధ రాష్ట్రాల్లో యాజమాన్య కోటా సీట్ల భర్తీపై విధివిధానాలు, డీమ్డ్ యూనివర్సిటీల్లో సీట్ల భర్తీ, అకడమిక్ క్యాలెండర్ తదితర విషయాలపై కేంద్ర వైద్య ఆరోగ్యశాఖకు నివేదిక ఇవ్వనున్నట్టు భారతీయ వైద్యమండలి అధికారి చెప్పారు.

మరిన్ని వార్తలు