భారతీయ సంస్కృతి గొప్పది

20 Nov, 2013 04:06 IST|Sakshi

పొందూరు, న్యూస్‌లైన్ : భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు చాలా గొప్పవని ఆస్ట్రేలియాకు చెందిన మెల్‌బోర్న్ యూనివర్సిటి స్కాలర్స్ కొనియాడారు. భారతీయుల స్నేహస్వభావం తమకు నచ్చిందన్నారు. భారతదేశంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించేందుకు జిల్లాలో పర్యటిస్తున్న బృందం మంగళవారం పొందూరు వచ్చింది. ఈ సందర్భంగా స్కాలర్స్ ఫి జేమ్స్, సారా మార్షల్, సారా జోర్డాన్, బామ్‌బ్రిడ్జి, బెర్నార్డ్ పియర్స్ మాట్లాడుతూ, ఇండియాలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించి ఆస్ట్రేలియా ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామన్నారు. తాము ఇప్పటివరకు ఒడిశా, చెన్నై, బెంగళూరు, ఢిల్లీతో పాటు ఆంధ్ర ప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో పర్యటించామన్నారు. చివరగా శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్నామని అన్నారు.
 
  నిరక్షరాస్య నిర్మూలనకు సాక్షరభారత్ ద్వారా చేస్తున్న కృషి తెలుసుకుని ప్రశంసించారు. పీఎంఆర్‌డీఎఫ్ బాలయ్య మాట్లాడుతూ సాక్షరభారత్‌లో సభ్యులుగా ఉండి రూ. 2.47 లక్షలు మంది అక్షరాస్యులుగా మారారని తెలిపారు. కార్యక్రమంలో  సర్పంచ్ ఉమాకుమారి, తదితరులు పాల్గొన్నారు.
 
 ‘ఇందిరమ్మ పచ్చతోరణం’ పరిశీలన
 రణస్థలం రూరల్ : ఉపాధి హామీ పథకం కింద మండలంలో అమలవుతున్న ఇందిరమ్మ పచ్చతోరణం కార్యక్రమాన్ని ఆస్ట్రేలియా దేశానికి చెందిన సోషల్ వర్‌‌క స్కాలర్ బృందం మంగళవారం పరిశీలించింది. పచ్చతోరణం కార్యక్రమంలో బాగంగా మండలంలో కమ్మశిగడాం గ్రామంలో కోనేరు గట్టుపై పెంపకం చేపడుతున్న కొబ్బరి మొక్కలను బృంద సభ్యులు బోనెట్, ఫై, వె స్లీ, షరాలు పరిశీలించారు. ఇందిరమ్మ పచ్చతోరణం కార్యక్రమం కింద భూమిలేని షెడ్యూల్డు కులాలు, తెగలకు చెందినవారిని ఎంపిక చేసి ఒక్కొక్కరికీ 100 కొబ్బరి మొక్కలు చొప్పున అందించినట్లు బృంద సభ్యులకు ఉపాధి పథకం ఏపీడీ ఎల్.అప్పలసూరి వివరించారు. ఐదేళ్ల పాటు మొక్కల పెంపకానికి, ఎరువులకు అయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు.
 
  అనంతరం కొబ్బరి మొక్కల నుండి వచ్చిన ఆదాయాన్ని నిరుపేద రైతులే అనుభవించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. భూమిలేని నిరుపేదలను కుటుంబాలను ఆదుకునేందుకే ఈ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా బృంద సభ్యుల సందేహాలను అధికారులు నివృత్తి చేశారు. కార్యక్రమంలో కెపాసిటీ బిల్డింగ్ ఏపీడీ ఎల్.రామారావు, బాలయ్య, స్థానిక ఏపీఓ జి.త్రినాథరావుతో పాటు పలువురు సిబ్బంది, లబ్ధిదారులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు