ఇందిరా సొసైటీ సీఈఓ అరెస్ట్

24 Nov, 2013 04:31 IST|Sakshi

కర్నూలు, న్యూస్‌లైన్: కర్నూలు నగరంలోని ఇందిర పరస్పర సహాయక సహకార పొదుపు పరపతి సంఘం (ఇందిరా సొసైటీ) ముఖ్య కార్య నిర్వహక అధికారి ప్రేమ జయలక్ష్మిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రజల నుంచి డిపాజిట్ల రూపంలో సేకరించిన రూ.21.25 లక్షల నగదుతో పాటు నాలుగు లెడ్జర్ బుక్కులు, ఏడు ఆహ్వాన పత్రాలు, పది ఇందిరా బ్యాంకు డిమాండ్ డ్రాఫ్ట్‌లు, 20 ఇందిరా బ్యాంకు పాస్ బుక్కులు, 50 ఇందిరా బ్యాంకు రికరింగ్ డిపాజిట్ బాండ్‌లు, కంప్యూటర్ స్వాధీనం చేసుకుని జిల్లా ఎస్పీ రఘురామ్‌రెడ్డి ఎదుట హాజరు పరిచారు.

 శనివారం సాయంత్రం జిల్లా పోలీసు కార్యాలయం సమావేశ భవనంలో ఆయన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. మండల కేంద్రమైన రుద్రవరానికి చెందిన ప్రేమ జయలక్ష్మి 2008 జూన్‌లో అధికారుల అనుమతితో పగిడ్యాలలో ఇందిర పరస్పర సహాయక సహకార పొదుపు పరపతి సంఘం (ఇందిరా సొసైటీ) ఏర్పాటు చేశారు. అయితే నిబంధనలకు విరుద్ధగా ఇటీవల కర్నూలు పాతబస్టాండ్ సమీపంలోని వీఆర్ కాంప్లెక్స్‌లో బ్రాంచ్ కార్యాలయాన్ని ప్రారంభించి కార్యకలాపాలను కొనసాగించారు. ప్రజల నుంచి భారీ ఎత్తున డిపాజిట్ల రూపంలో నిధులు సేకరించారు. వివిధ రకాల డిపాజిట్ల పేరుతో తక్కువ వడ్డీకి ఎక్కువ మొత్తంలో రుణాలు అందిస్తామని రూ.98.59 లక్షలు వసూలు చేశారు. శనివారం(23వ తేదీ) నాబార్డు అధికారుల చేతుల మీదుగా రుణాలు పంపిణీ చేయనున్నట్లు వారి అనుమతి లేకుండా పేర్లతో ఆహ్వాన పత్రికలను ముద్రించి ప్రచారం చేయించారు.
 
 ఈ విషయం పోలీ సుల దృష్టికి వెళ్లడం, శుక్రవారం పెద్ద మొత్తంలో లబ్ధిదారులు కార్యాలయం వద్దకు చేరుకుని ఆందోళనకు దిగడంతో అసలు సమస్య బయటికి వచ్చింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి విచారణ చేశారు. లబ్ధిదారుల నుంచి వసూలు చేసిన మొత్తంలో రూ.32.76 లక్షలు రీ సైక్లింగ్ చేయగా, రూ.65.83 లక్షలు బ్యాలెన్స్ ఉన్నట్లు విచారణలో బయటపడింది. ఇందులో 26 మంది సభ్యులకు రూ.16.40 లక్షలు రుణంగా ఇవ్వగా, ముగ్గురు సభ్యులకు రూ.2.66 లక్షలు వాపసు ఇచ్చింది. మిగిలిన మొత్తంలో రూ.21.25 లక్షలు నగదుతో పాటు కార్యాలయంలోని పలు రికార్డులను ఒకటవ పట్టణ పోలీసులు శనివారం స్వాధీనం చేసుకున్నారు.   
 
 మాయ మాటలు నమ్మి
 మోసపోవద్దు : ఎస్పీ
 తక్కువ వడ్డీకి ఎక్కువ రుణాలు ఇస్తామని, మనీ స్కీమ్‌లో చేరాలని ఎవరైనా చెబితే నమ్మి మోసపోవద్దని ఎస్పీ రఘురామిరెడ్డి జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. మనీ స్కీమ్‌ల పేరుతో ఎవరైనా మోసం చేసేందుకు ప్రయత్నిస్తే సమాచారం తమ దృష్టికి తీసుకువస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో అదనపు ఎస్పీ వెంకటరత్నం, డీఎస్పీ వైవి.రమణకుమార్, ఒకటవ పట్టణ సీఐ శ్రీనివాసులు, సీసీఎస్ సీఐ రామక్రిష్ణ, తదితరులు పాల్గొన్నారు.  
 

మరిన్ని వార్తలు