ప్రత్యేక హోదాతోనే పరిశ్రమలు!

26 Jul, 2018 03:13 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న సీఎం

కార్యదర్శులు, విభాగాధిపతుల సమావేశంలో సీఎం చంద్రబాబు 

హోదా ఇచ్చి ఉంటే వేగంగా అభివృద్ధి చెందేవాళ్లం

150 రోజులపాటు గ్రామాల్లో తిరగాలని అధికారులకు ఆదేశం

నాలుగేళ్లలో రాష్ట్ర పరిస్థితిని ఎలా మార్చేశామో ప్రజలకు చెప్పాలని సూచన!

గ్రామీణాభివృద్ధికి విజన్‌ డాక్యుమెంట్‌ రూపొందించాలన్న సీఎం

సాక్షి, అమరావతి: రాష్ట్రానికి పరిశ్రమలు రావాలంటే ప్రత్యేక హోదా అవసరమని సీఎం చంద్రబాబు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వటం లేదని, హోదా ఇచ్చి ఉంటే ఇంకా వేగంగా అభివృద్ధి చెందేవాళ్ల మన్నారు. బుధవారమిక్కడ మంత్రులు, కార్యదర్శులు, విభాగాధిపతులతో కలసి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సీఎం మాట్లాడారు. విభజన సమయంలో అప్పటి ప్రధాని ప్రత్యేక హోదా ఇస్తామన్నారని.. ఆ హామీని అమలు చేయాల్సిన బాధ్యత ప్రస్తుత ప్రధానిపై ఉందన్నారు. అయినా కూడా వృద్ధి రేటులో రాష్ట్రం నంబర్‌ వన్‌గా నిలుస్తోందని.. మూడేళ్లుగా వృద్ధిరేటు స్థిరంగా ఉందని చెప్పారు. గ్రామాలకు వెళ్లి పథకాల అమలు తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. 10 నెలల్లో 40 రోజులపాటు గ్రామాల్లో పర్యటించాలని సూచించారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో సీనియర్‌ అధికారులు ఒకసారి పర్యటన చేయాలని స్పష్టం చేశారు. అలాగే నాలుగేళ్లల్లో రాష్ట్ర పరిస్థితిని ఎలా మార్చేశామో ప్రజలకు వివరించాలని సూచించారు.

రానున్న 115 రోజుల పాటు గ్రామదర్శిని నిర్వహించి.. గ్రామీణాభివృద్ధి కోసం విజన్‌ డాక్యుమెంట్‌ తయారుచేయాలని సూచించారు. పౌర సరఫరాలు, చంద్రన్న బీమా, ఎన్టీఆర్‌ భరోసా, ఎన్టీఆర్‌ వైద్య సేవ, అన్న క్యాంటీన్లు, ఎస్సీ, ఎస్టీలకు లబ్ధి, చంద్రన్న పెళ్లి కానుక, అన్ని స్కాలర్‌షిప్‌లను ఒకే విండో నుంచి అమలు చేయటంపై దృష్టి కేంద్రీకరించాలని ఆదేశించారు. ఉదయం 10.30 నుంచి సాయంత్రం వరకు ఈ సమావేశం జరిగింది. అనంతరం ఉన్నతాధికారులు, మంత్రులకు ముఖ్యమంత్రి ఉండవల్లిలోని తన నివాసంలో విందు ఇచ్చారు. అంతకుముందు పనితీరు బాగున్న అధికారులతో పాటు ఇటీవల పలు అవార్డులు పొందిన వారిని సీఎం ప్రత్యేకంగా అభినందించారు. కాగా, బుధవారం సాయంత్రం సచివాలయంలో సీఎం చంద్రబాబుతో జాతీయ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ రాకేశ్‌ శర్మ భేటీ అయ్యారు. సాధికార మిత్రలు, బీమా మిత్రలు, ఆశ వర్కర్లు, డ్వాక్రా మహిళలు క్షేత్రస్థాయిలో బాగా పనిచేస్తున్నారని ఆమె అభినందించారు. ఆమె వెంట రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ నన్నపనేని రాజకుమారి ఉన్నారు.

నాలుగేళ్లుగా జగన్‌ చెబుతున్నదే సీఎం నోటి వెంట..
ప్రత్యేక హోదా వల్లే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, పన్నులు తక్కువగా ఉంటాయని, పరిశ్రమలు వస్తాయని, యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ నాలుగేళ్లుగా చెబుతున్న మాటలనే.. సీఎం చంద్రబాబు ఇప్పుడు వల్లె వేయడం చర్చనీయాంశంగా మారింది. బీజేపీతో కలిసి కేంద్ర ప్రభుత్వంలో కొనసాగినంతకాలం ప్రత్యేక హోదా అవసరం లేదని.. హోదా వస్తే పరిశ్రమలు ఏమైనా వచ్చేస్తాయా అంటూ ముఖ్యమంత్రి ఎద్దేవా చేస్తూ వచ్చారు. ప్రత్యేకహోదా ఎంత అవసరమో యువభేరీలు, ధర్నాలు, దీక్షల ద్వారా ప్రజలకు జగన్‌ వివరిస్తుంటే.. హోదాతోనే అన్నీ అయిపోతాయని ప్రచారం చేయడం తగదని చంద్రబాబు ఎదురుదాడి కూడా చేశారు. హోదా వల్ల పరిశ్రమలు రావని, వస్తాయని ఎక్కడుందో చూపాలంటూ మీడియా ప్రతినిధులను సైతం బెదిరించిన ఉదంతాలున్నాయి.

హోదా అమలవుతున్న ఈశాన్య రాష్ట్రాల్లో పరిస్థితేమీ మెరుగుపడలేదని.. హోదా ఒక్కటుంటే చాలు, మిగిలినవేవీ అవసరం లేదని ప్రతిపక్షం చెప్పడం తప్పని వాదించారు. అయినా కూడా ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ హోదా సాధన కోసం నాలుగేళ్లుగా అలుపెరుగకుండా పోరాడుతూనే ఉంది. మరోవైపు నాలుగేళ్ల తర్వాత రాజకీయ కారణాలతో ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన చంద్రబాబు.. ప్రత్యేక హోదాపై యూ టర్న్‌ తీసుకున్నారు. హోదా సంజీవని కాదని చెప్పడమే కాక, ప్యాకేజీ ప్రకటించిన కేంద్రాన్ని అభినందిస్తూ తీర్మానాలు చేసిన ముఖ్యమంత్రి.. ఇప్పుడేమో హోదా వద్దని తాను ఏనాడూ అనలేదంటూ కొత్త రాగం అందుకోవడంపై ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా పరిశ్రమలు రావాలన్నా, రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా ప్రత్యేక హోదా కావాలంటూ చంద్రబాబు వ్యాఖ్యానించడంతో.. ఇదేదో నాలుగేళ్ల కిందటే గ్రహించి ఉంటే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు.   

మరిన్ని వార్తలు