'బుడుగజంగాలకు అన్యాయం చేస్తున్నారు'

13 Aug, 2017 16:48 IST|Sakshi
'బుడుగజంగాలకు అన్యాయం చేస్తున్నారు'

చంద్రబాబు సర్కారుపై విశ్వేశ్వర్‌రెడ్డి మండిపాటు

నంద్యాల: అట్టడుగున ఉన్న బుడుగజంగం సామాజికవర్గానికి చంద్రబాబు ప్రభుత్వం అన్యాయం చేస్తోందని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. జీవో 114ను తీసుకురావడం ద్వారా బుడుగజంగాలకు ప్రభుత్వం అన్యాయం చేసిందని తెలిపారు. ఒక్క కర్నూలు జిల్లాలోనే 70వేల మంది బుడుగజంగాలు ఉండగా, నంద్యాలలో నాలుగువేల మంది ఉన్నారని, వారందరికీ అన్యాయం చేసేలా చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తోందని విశ్వేశ్వర్‌రెడ్డి విమర్శించారు. దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జీవో 84ను తీసుకొచ్చి బుడుగజంగాలను ఆదుకున్నారని గుర్తుచేశారు.

తెలంగాణ సహా పలు పొరుగు రాష్ట్రాలు బుడగజంగాలను ఎస్సీలుగా పరిగణించి ధ్రువీకరణ పత్రాలు ఇస్తుండగా.. ఏపీలో మాత్రం వారిని ఎస్సీలుగా పరిగణించడం లేదని అన్నారు. అట్టడుగున ఉన్న బుడుగజంగాల వారి పిల్లలకు ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో న్యాయం కల్పించాలని, అందుకోసం వారిని  ఎస్సీల్లో చేర్చాలని ఆయన కోరారు. నంద్యాల ఉప ఎన్నిక నేపథ్యంలో సామాజిక వర్గాల వారీగా ఆత్మీయ సమావేశాల పేరిట చంద్రబాబు సామాజిక పాచికలు వేస్తున్నారు, నిసిగ్గుగా కులాల వారీగా ఓటర్లను వాడుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. బ్రాహ్మణులు, కాపులు సహా అనేక సామాజిక వర్గాల వారిని చంద్రబాబు ప్రభుత్వం మోసం చేసిందని ధ్వజమెత్తారు.