ఇన్నర్ పనులకు బ్రేకులు

14 Oct, 2014 01:20 IST|Sakshi
ఇన్నర్ పనులకు బ్రేకులు
  • అడుగడుగునా అవాంతరాలు
  •  75 శాతం పూర్తయిన ఇన్నర్ రింగ్‌రోడ్డు నిర్మాణం
  •  నిదానంగా సాగుతున్న పనులు
  •  ఇప్పటికే మూడేళ్లు ఆలస్యం
  • సాక్షి, విజయవాడ : నగరంలో వీజీటీఎం ఉడా చేపట్టిన ఇన్నర్ రింగ్‌రోడ్డు ప్రాజెక్ట్‌కు అడుగడుగునా అవాంతరాలు ఎదురవుతున్నాయి. ట్రాఫిక్ సమస్యను పరిష్కరించే దిశగా వాహన రాకపోకలను మరింత సులభతరం చేయాలనే ఉద్దేశంతో ఉడా ఈ ప్రాజెక్ట్‌కు రూపకల్పన చేసింది. అయితే తరచూ కలుగుతున్న ఆటంకాలను ఉడా పట్టించుకోకపోవడం, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం.. వెరసి ప్రాజెక్ట్ నత్తనడకన సాగుతోంది. వాస్తవానికి 2012కల్లా పూర్తికావాల్సిన ప్రాజెక్ట్‌లో ప్రస్తుతం 75 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి.

    కనీసం ఇప్పుడు మళ్లీ మొదలుపెడితే కనీసం ఆరు నుంచి ఎనిమిది నెలల కాలవ్యవధిలో ప్రాజెక్ట్ పూర్తవుతుంది. కాకపోతే ఆ పరిస్థితి కనిపించడం లేదు. ప్రాజెక్ట్ పనులను నాలుగు ఫేజ్‌లుగా విభజించి ఏకకాలంలో మొదలుపెట్టారు. 1, 4 ఫేజ్ పనులు ఇప్పటికే పూర్తికాగా, రెండో ఫేజ్ పనులు 85 శాతం పూర్తయ్యాయి. ఇక గుణదల వద్ద ఫ్లైవోవర్ గడ్డర్స్ కూలిన నేపథ్యంలో మూడో ఫేజ్ పనులు 11 నెలలుగా నిలిచిపోయాయి.  
     
    నాలుగు ఫేజ్‌లుగా పని విభజన..

    అటు నగరాభివృద్ధి, ఇటు ట్రాఫిక్ సమస్యను పరిష్కరించే క్రమంలో ఉడా 2009లో ఇన్నర్ రింగ్‌రోడ్డు పనులకు శ్రీకారం చుట్టింది. మిల్క్‌ప్రాజెక్ట్ ఫ్లైవోవర్ నుంచి రామవరప్పాడు రింగ్ వరకు 9.84 కిలోమీటర్ల మేర ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మించాలని నిర్ణయించి, ఆ మేరకు డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ సిద్ధం చేసి ప్రభుత్వ అనుమతితో పని ప్రారంభించారు. త్వరగా పూర్తవ్వాలనే ఉద్దేశంతో  పనులను నాలుగు ఫేజ్‌లుగా విభజించి ఏకకాలంలో మొదలు పెట్టారు.

    ఇన్నర్ రింగ్‌రోడ్డులో భాగంగా 9.84 కి.మీ. రోడ్డు నిర్మాణం, గుణదల, రామవరప్పాడు ప్రాంతాల్లో రెండు ఫ్లైవోవర్ల నిర్మాణానికి  మొత్తం రూ. 74.24 కోట్లతో ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. ప్రస్తుతం 1, 4 ఫేజ్‌ల్లో కేటాయించిన పనులన్నీ పూర్తయ్యాయి. ఈ ఫేజ్‌ల్లో ఎక్కువగా రోడ్డ నిర్మాణ పనులు మాత్రమే ఉండడంతో వంద శాతం  పూర్తయ్యాయి. 2, 3 ఫేజ్‌ల్లో రోడ్ల నిర్మాణాలతోపాటు రెండు ఫ్లైవోవర్లు ఉండడంతో కొంత నత్తనడకన సాగాయి. రెండో ఫేజ్‌లో పనులు 85 శాతం పూర్తయ్యాయి. రోడ్డు ప్యాచ్ వర్క్ మాత్రమే మిగిలి ఉంది. పనులు ప్రస్తుతం జరుగుతూనే ఉన్నాయి.
     
    నాలుగేళ్లలో పూర్తికావాల్సి ఉన్నా..

    వాస్తవానికి 2009లో ప్రారంభమైన  ఈ ప్రాజెక్ట్ 2012 నాటికి పూర్తికావాల్సి ఉంది. ఈ మేరకు ఉడా అధికారులు ప్రాజెక్ట్‌కు కాలవ్యవధిని నిర్ణయిస్తూ ఒప్పందం కూడా చేసుకున్నారు. అయినా 2012 నాటికి 50 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. పనులు వేగవంతం చేయాలని ఉడా అధికారులు కాంట్రాక్టర్‌కు పదేపదే సూచించడం మినహా సీరియస్‌గా దృష్టి సారించిన దాఖలాలు లేవు. దీంతో నిర్ణీత గడువు దాటి దాదాపు రెండేళ్లు కావస్తోంది. మొత్తం మీద ప్రాజెక్  2015 చివరి నాటికి పూర్తయ్యే అవకాశం కనిపిస్తోంది.
     
    ప్రభుత్వ ఆదేశాల కోసం..

    తాజాగా మూడో ఫేజ్ పనులు ప్రభుత్వం నుంచి అనుమతి వస్తేనే మొదలవుతాయి. దీనికోసం ఉడా అధికారులతో పాటు కాంట్రాక్టర్ కూడా ఆశగా ఎదురుచూస్తున్నారు. గత డిసెంబర్‌లో గుణదల సమీపాన నిర్మాణంలో ఉన్న ఫ్లైవోవర్ నాలుగు గడ్డర్లు అకస్మాత్తుగా కూలిపోయాయి. రూ. 23.12 కోట్ల నిర్మాణ వ్యయంతో దీన్ని నిర్మిస్తున్నారు. తొలి విడతగా రూ.13 కోట్లు కాంట్రాక్టర్‌కు  ఉడా చెల్లించింది. గడ్డర్లు కూలిన ఘటనపై చెన్నై ఐఐటీ బృందంతో, ఇర్మా సంస్థతో దర్యాపు చేయించారు.
     
    ఆ తర్వాత రాష్ట్ర మున్సిపల్ శాఖ హైపవర్ కమిటీతో ఒక విచారణ, జిల్లా విజిలెన్స్ అధికారులతో మరో విచారణ నిర్వహించారు. అన్ని నివేదికలు ప్రస్తుతం ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. వీటిపై మున్సిపల్ శాఖ దృష్టి సారించి వ్యవహారం ఒక కొలిక్కి వచ్చాకే  మూడో ఫేజ్ పనులు మొదలుపెడతారు.  కాగా ప్రభుత్వం మరో వారంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
     

మరిన్ని వార్తలు