గాంధీ స్ఫూర్తితో..సత్యాగ్రహ దీక్షలు

3 Oct, 2013 02:51 IST|Sakshi

మహాత్ముడే సాక్షిగా.. ఆయనే పోరాటాలే స్ఫూర్తిగా వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో గాంధీ జయంతిని పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా నిరవధిక, రిలే నిరాహారదీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. సమైక్యాంధ్ర పరిరక్షణే లక్ష్యంగా దీక్షలు కొనసాగిస్తామని నేతలు వివరించారు. వివిధ జేఏసీలు, సంఘాల నేతలు సంఘీభావం ప్రకటించారు.
 
సాక్షి, విజయవాడ : బ్రిటీష్ వారి నుంచి బానిస సంకెళ్లను తెంపుకుని దేశానికి స్వేచ్ఛావాయువులు అందించిన అంహిసా మూర్తి మహాత్మాగాంధీ స్ఫూర్తిగా, రాష్ట్రాన్ని ముక్కలు చేయాలనుకునే కేంద్రం కుట్రలు భగ్నం చేసేలా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జిల్లా వ్యాప్తంగా సత్యాగ్రహ దీక్షలు మొదలుపెట్టారు. ప్రతి నియోజకవర్గంలోనూ నిరవధిక నిరాహార దీక్షలు, రిలేదీక్షలు మొదలయ్యాయి. జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను నిరవధిక నిరాహార దీక్షకు దిగగా, పార్టీ బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గట్టు రామచంద్రరావు ఈ దీక్షలను ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా 17 మంది నిరవధిక దీక్షలు చేస్తుండగా, 1,156 మంది రిలేదీక్షల్లో పాల్గొన్నారు. నియోజకవర్గ కన్వీనర్లు పి.గౌతంరెడ్డి, సింహాద్రి రమేష్, మొండితోక జగన్మోహనరావు, వాకా వాసుదేవరావు, ఉప్పాల      

 

 రాంప్రసాద్ నిరవధిక దీక్షలు చేపట్టినవారిలో ఉన్నారు. పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, కుక్కల నాగేశ్వరరావు, రైతు విభాగం కన్వీనర్ ఎంవీఎస్ నాగిరెడ్డి, ప్రచార విభాగం కన్వీనర్ సానికొమ్ము వెంకటేశ్వరరెడ్డి తదితరులు దీక్షా శిబిరాలకు మద్దతు ప్రకటించారు.


 వైఎస్సార్‌సీపీ వైఖరి సుస్పష్టం..


 సభల్లో నేతలు మాట్లాడుతూ రాష్ట్ర విభజనపై వైఎస్సార్‌సీపీ చాలా స్పష్టంగా తన వైఖరి చెప్పిందన్నారు. ఇరు ప్రాంతాలకు తండ్రిలా సమన్యాయం చేయాలని, అలా చేయకుంటే యథాస్థితిని కొనసాగించాలని కోరిందని వివరించారు. సమన్యాయం చేసే పరిస్థితులు లేకపోవడం వల్లే వైఎస్సార్ సీపీ విభజనను వ్యతిరేకించి సమైక్య నినాదాన్ని వినిపించిందన్నారు. చంద్రబాబునాయుడు ఆత్మగౌరవయాత్ర పేరుతో ఆత్మవంచన యాత్ర చేస్తున్నారన్నారు. ఎక్కడా సమైక్య పదాన్ని వాడకుండా నాటకాలాడుతున్నారని విమర్శించారు. వేర్పాటువాదాన్ని గాంధీ కుటుంబాలు వ్యతిరేకిస్తే ఇటలీవాసి అయిన సోనియాగాంధీ రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు.


 దీక్షలు ఇలా..


 జగ్గయ్యపేటలో వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో నిరవధిక నిరాహార దీక్షకు దిగారు. దీక్షలను గట్టు రామచంద్రరావు ప్రారంభించగా, ఎంవీఎస్ నాగిరెడ్డి, రాష్ట్ర పౌర జనరేషన్ సంఘం 15-35 యూనియన్ కార్యదర్శి నన్నే శ్రీనివాసరావు, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు దేవినేని చంద్రశేఖర్, సూరపునేని రామారావు, కోవెలమూడి వెంకటనారాయణ, తాటి రామకృష్ణ, గడ్డం ముత్తారెడ్డి సంఘీభావం తెలిపారు. అవనిగడ్డ నియోజకవర్గ సమన్వయకర్త సింహాద్రి రమేష్‌బాబు స్థానిక పార్టీ కార్యాలయం ముందు నిరవధిక దీక్ష చేపట్టారు.  జేఏసీ నాయకులు బీ రాజేంద్రకుమార్, అబ్దుల్ అజీజ్ రమేష్‌బాబుకు వీరతిలకం దిద్ది పూలమాలలువేసి దీక్షను ప్రారంభించారు.

 

సింహాద్రితో పాటు మద్ది వెంకటనారాయణ (చిన్నా), కొండవీటి బాపూజీ నిరవధిక దీక్షలను చేపట్టారు. అవనిగడ్డ టీటీడీ కల్యాణ మండపం వద్ద ఆ పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు యాసం చిట్టిబాబు, గుడివాక శివరావ్ బుధవారం నిరవధిక నిరాహారదీక్షలు  చేపట్టారు. వీరితోపాటు మండల యూత్ కన్వీనర్ సింహాద్రి పవన్, రాజనాల బాలాజీ, యాసం మురళి నిరవధిక నిరాహారదీక్షలో పాల్గొన్నారు. హనుమాన్‌జంక్షన్‌లో వైఎస్సార్‌సీపీ యువజన విభాగం నాయకుడు దుట్టా రవిశంకర్ నిరవధిక దీక్ష చేపట్టారు. ఈ దీక్షను నియోజకవర్గ కన్వీనర్ డాక్టర్ దుట్టా రామచంద్రరావు ప్రారంభించారు. రాజకీయేతర జేఏసీ, ఉపాధ్యాయ జేఏసీ, ఇతర సంఘాల నాయకులు సంఘీభావం తెలిపారు. పెడనలో పార్టీ సమన్వయకర్తలు డాక్టర్ వాకా వాసుదేవరావు, ఉప్పాల రాంప్రసాద్, పార్టీ రాష్ట్ర బీసీ విభాగం అడ్‌హాక్ కమిటీ సభ్యుడు గూడవల్లి కేదారేశ్వరరావు నిరవధిక నిరహార దీక్షలు చేపట్టారు. ఈ దీక్షలను పార్టీ సీజీసీ సభ్యుడు కె.నాగేశ్వరరావు ప్రారంభించారు. 

 

నందిగామలో నియోజకవర్గ సమన్వయకర్త మొండితోక జగన్మోహనరావు గాంధీ సెంటర్‌లో నిరవధిక నిరాహార దీక్షకు కూర్చున్నారు. పార్టీ ప్రచార కమిటీ జిల్లా కన్వీనర్ సానికొమ్ము వెంకటేశ్వరరెడ్డి ఈ దీక్షలను ప్రారంభించారు. తిరువూరులో పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యురాలు పిడపర్తి లక్ష్మీకుమారి నిరవధిక నిరాహారదీక్ష చేపట్టారు. ఈ దీక్షకు ఎంవీఎస్ నాగిరెడ్డి పార్టీ నేత దేవినేని చంద్రశేఖర్, ఉద్యోగ జేఏసీ నందిగామ తాలూకా చైర్మన్ ఎం.శ్యాంబాబు సంఘీభావం ప్రకటించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త పి.గౌతంరెడి లెనిన్ సెంటర్‌లో నిరవధిక నిరాహారదీక్ష ప్రారంభించారు. ఈ శిబిరాన్ని పార్టీ  సీజీసీ సభ్యుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ప్రారంభించగా రైతువిభాగం కన్వీనర్ నాగిరెడ్డి సంఘీబావం తెలిపారు.
 

మైలవరంలో నియోజకవర్గ కన్వీనర్ జోగి రమేష్ రిలే దీక్ష ప్రారంభించారు. నూజివీడులో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త మేకా వెంకట ప్రతాప్ అప్పారావు ఆధ్వర్యంలో దాదాపు 800 మంది దీక్షలో పాల్గొన్నారు. నూజివీడులోని జంక్షన్ రోడ్డులో నిర్వహించిన దీక్షలో నియోజకవర్గ సమన్వయకర్త మేకా ప్రతాప్‌తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు, పలువురు సర్పంచులు పాల్గొన్నారు. పామర్రులో వైఎస్సార్‌సీపీ కేంద్ర పాలకమండలి సభ్యురాలు ఉప్పులేటి కల్పన ఆధ్వర్యంలో సమైక్య దీక్షలను నిర్వహించారు. ఈ దీక్షలను పార్టీ రైతు విభాగం కన్వీనర్ నాగిరెడ్డి ప్రారంభించగా, ప్రచార విభాగం కన్వీనర్ సానికొమ్ము వెంకటేశ్వరరెడ్డి నిమ్మరసం ఇచ్చి విరమింపచేశారు.  విజయవాడ పశ్చిమంలో పార్టీ నగర కన్వీనర్ జలీల్‌ఖాన్ ఒక రోజు దీక్ష చేపట్టారు. ఆయనతోపాటు 120 మంది ఈ దీక్షలో కూర్చున్నారు. తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త వంగవీటి రాధాకృష్ణ ఆధ్వర్యంలో బందర్ రోడ్డులోని రాఘవయ్య పార్కు వద్ద చేపట్టిన నిరాహార దీక్ష శిబిరాన్ని సీజీసీ సభ్యుడు ఉమారెడ్డి వెంకటేశ్వర్లు సందర్శించి సంఘీభావం తెలిపారు.

 

కైకలూరు నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం వద్ద రిలే దీక్షలు చేపట్టారు. 48 గంటల నిరాహార దీక్షలలో పార్టీ మండవల్లి మండల అధ్యక్షుడు గుమ్మడి వెంకటేశ్వరరావు, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు బొబ్బిలి రత్తయ్యనాయుడు, శొంఠి వీరముసలయ్య, నాయకులు పెరుమాళ్ల వీరవెంకట సత్యనారాయణరెడ్డి, మోరు విజయతాతారావు పాల్గొన్నారు. పెనమలూరులో నియోజకవర్గ సమన్వయకర్తలు తాతినేని పద్మావతి, పడమట సురేష్‌బాబు నేతృత్వంలో నిరసన దీక్ష చేపట్టగా, నాగిరెడ్డి ప్రారంభించారు. తిరువూరు బోస్ సెంటర్లో సమన్వయకర్త బి.వల్లభాయ్, ఎన్‌ఆర్‌ఐ విభాగ రాష్ట్ర కమిటీ సభ్యుడు శీలం రాజా రిలేదీక్షల్లో పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు