డీజీపీ ఎంపికకు జాబితా సిద్ధం | Sakshi
Sakshi News home page

డీజీపీ ఎంపికకు జాబితా సిద్ధం

Published Thu, Oct 3 2013 2:47 AM

List ready for DGP post selections

రాష్ట్ర డెరైక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డీజీపీ) నియామకానికి సంబంధించి అధికారిక ప్రక్రియను పూర్తిచేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నూతన డీజీపీగా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలను సోమవారం చేపట్టిన బి ప్రసాదరావు సహా ఐదుగురు డెరైక్టర్ జనరల్ స్థాయి అధికారుల పేర్లను యూపీఎస్సీకి పంపేందుకు జాబితా సిద్ధమైంది. ఐపీఎస్ 1979 బ్యాచ్‌కి చెందిన టీపీ దాస్, బి ప్రసాదరావు, ఎస్‌ఏ హుడా, 1981 బ్యాచ్‌కి చెందిన జేవీ రాముడు, ఏకే ఖాన్ పేర్లను యూపీఎస్సీకి పంపే జాబితాలో ఉన్నట్లు సమాచారం. సీఎం కార్యాలయంలో హోంశాఖ వ్యవహారాలను చూసే వినయ్‌కుమార్ ఇటీవలే బదిలీ అవడంతో ఆ బాధ్యతలను చేపట్టిన అజయ్ కల్లం జాబితాను సిద్ధం చేశారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి పరిశీలన అనంతరం జాబితాను ఒకటి, రెండు రోజుల్లో యూపీఎస్సీకి పంపే అవకాశం ఉంది.  జాబితాలోని ఐదుగురిలో ముగ్గురి పేర్లను యూపీఎస్సీ ఖరారు చేస్తుంది. ఆ ముగ్గురిలో ఒకర్ని రాష్ట్ర ప్రభుత్వం డీజీపీగా నియమిస్తుంది. 
 
 1979 బ్యాచ్‌లోని టీపీ దాస్, ఎస్‌ఏ హుడా కన్నా పలు కీలక స్థానాల్లో పనిచేసిన ప్రసాదరావునే రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసే అవకాశం ఉంది. ప్రసాదరావు పూర్తిస్థాయి డీజీపీగా నియమితులవడం ఇక లాంఛనమేనని ప్రభుత్వ వర్గాల సమాచారం. పది రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తికావచ్చని సమాచారం. ఫోర్జరీపై కేసులో నిందితుడైనందున 1977 బ్యాచ్‌కి చెందిన ఉమేష్‌కుమార్ పేరును జాబితాలో చేర్చలేదని సమాచారం. 1979 బ్యాచ్‌లో ప్రసాదరావు కన్నా సీనియర్ అయిన అరుణా బహుగుణ కేంద్ర సర్వీసులో సీఆర్పీఎఫ్ స్పెషల్ డీజీగా పనిచేస్తున్నందున ఆమె పేరును కూడా జాబితాలో చేర్చలేదని తెలిసింది.  
 
 యూపీఎస్సీకి పంపనున్న పేర్లు
 ఐపీఎస్ అధికారి పేరు సర్వీసు పూర్తయ్యే కాలం
 1.టీపీ దాస్(1979 బ్యాచ్) నవంబర్ 2015
 2.బి ప్రసాదరావు(1979 బ్యాచ్) సెప్టెంబర్ 2015
 3.ఎస్‌ఏ హుడా(1979 బ్యాచ్) జూలై 2017
 4.జేవీ రాముడు(1981 బ్యాచ్) ఆగస్టు 2014
 5.ఏకే ఖాన్(1981 బ్యాచ్) డిసెంబర్ 2016

Advertisement
Advertisement