టీఢీపీ

26 Jul, 2015 23:33 IST|Sakshi
టీఢీపీ

సంధ్యారాణి వర్సెస్ భంజ్‌దేవ్
సాలూరు తెలుగుదేశం పార్టీలో ముదిరిన అంతర్గత పోరు  
పరస్పరం దెబ్బతీసుకునే ప్రయత్నాలు
విభేదాల నడుమ వాయిదా పడిన తహశీల్దార్ కార్యాలయం ప్రారంభం

 
అనూహ్యంగా పార్టీలో ఎదిగిన వ్యక్తి హవా వల్ల తన ప్రాబల్యానికి ఎక్కడ గండిపడుతుందో అని ఒకరు. తనకు వచ్చిన అవకాశంతో  ప్రాబల్యం పెంచుకోడానికి, భవిష్యత్‌లో ఎదురులేకుండా చేసుకోవడానికి మరొకరు. పరస్పరం చెక్ పెట్టుకునే పనిలో పడ్డారు. ఈ నేపథ్యంలో సాలూరు నియోజకవర్గ టీడీపీ నాయకుల్లో అంతర్గత పోరు నడుస్తోంది.
 
సాక్షి ప్రతినిధి, విజయనగరం: సాలూరు నియోజకవర్గ టీడీపీ నాయకులు ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి, మాజీ ఎమ్మెల్యే భంజ్‌దేవ్ మధ్య నువ్వానేనా అన్నట్టు అంతర్గత పోరు నడుస్తోంది. సాలూరు నియోజకవర్గ టీడీపీలో అంతర్గత పోరు ఈనాటిది కాదు. 2009ఎన్నికల సమయంలో గుమ్మడి సంధ్యారాణి పార్టీలో చేరిన దగ్గరి నుంచి ప్రారంభమయ్యింది. ఎస్టీ కుల వివాదం కారణంగా పోటీ చేసే అవకాశాన్ని కోల్పోయిన దగ్గరి నుంచి  భంజ్‌దేవ్ ప్రాబల్యం తగ్గిపోయింది.సంధ్యారాణి ఆ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ పార్టీలో క్రీయాశీలకంగా పనిచేస్తూ వచ్చారు.
 
భంజ్‌దేవ్ తన స్పీడ్‌ను తగ్గించారు. అయితే, మొన్నటి ఎన్నికల్లో అనూహ్యంగా ఎస్టీ సర్టిఫికెట్ చేతికి రావడంతో భంజ్‌దేవ్ మళ్లీ తెరపైకొచ్చారు. తనకున్న సీనియారిటీ, పార్టీలో ఉన్న పలుకుబడితో ఎమ్మెల్యే టిక్కెట్‌ను దక్కించుకున్నారు. ఈ నేపథ్యంలో సంధ్యారాణికి మొండి చేయి ఎదురైంది. తప్పనిపరిస్థితుల్లో ఆమెను బలవంతంగా అరకు ఎంపీగా అధిష్టానం పోటీ చేయింది. మొత్తానికి ఈ ఎన్నికల్లో ఇద్దరూ ఓటమి పాలయ్యారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన కారణంగా పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ పదవి భంజ్‌దేవ్‌కు దక్కింది. అలాగే భంజ్‌దేవ్ తీరుకు అడ్డుకట్ట పడేలా  ఎస్టీ కోటాలో, కీలక మంత్రి అండదండలతో సంధ్యారాణికి అనూహ్యంగా ఎమ్మెల్సీ పదవి దక్కింది.  ఇంకేముంది నియోజకవర్గంలో సంధ్యారాణి ప్రాబల్యం పెరిగినట్టు అయ్యింది.
 
అంతటితో ఆగిపోకుండా ఎస్టీ కోటాలో మంత్రి పదవి కూడా దక్కుతుందనే ప్రచారం నడుస్తోంది. దీంతో భంజ్‌దేవ్ తట్టుకోలేని పరిస్థితిలోకి వెళ్లిపోయారు. ఇప్పుడే ఆమెను డ్యామేజ్ చేయకపోతే సంధ్యారాణికి హవాకు బ్రేక్ పడదనే అభిప్రాయానికొచ్చినట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే ఆమెపై ఉన్న ఆరోపణల్ని అస్త్రంగా చేసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. షిప్ట్ ఆపరేటర్ల పోస్టులను అమ్ముకున్నారని,  మక్కువ మండలంలోని వెంగళరాయసాగర్ జలాశయం పనులలో పెద్ద ఎత్తున  ముడుపులు తీసుకున్నారని భంజ్‌దేవ్ ఫిర్యాదు చేసినట్టు జోరు గా చర్చ సాగుతోంది. ఇదంతా ఒక ఎత్తు అయితే సంధ్యారాణి చేతుల మీదుగా సోమవారం జరగనున్న తహశీల్దార్ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంపైనా భంజ్‌దేవ్ తన అక్కసు చూపించినట్టు తెలుస్తోంది.
 
 కేంద్రమంత్రి, రాష్ట్ర మంత్రి ఉంటుండగా సంధ్యారాణి ఎలా ప్రారంభిస్తారని ఏకంగా కేంద్రమంత్రి అశోక్, జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి జగదీష్‌లకు ఫిర్యాదు చేసినట్టు తెలియవచ్చింది. ఈ నేపథ్యంలో సోమవారం జరగాల్సిన తహశీల్దార్ కార్యాలయం ప్రారంభోత్సవం వాయిదా పడింది. భంజ్‌దేవ్ ప్రయత్నాలు ఇలా ఉంటే గుమ్మడి సంధ్యారాణి కూడా తానేమీ తక్కువ కాదంటూ  భంజ్‌దేవ్‌పై ఎస్టీ కుల వివాద ఉచ్చు బిగించేలా ఆయనపై పోరాడుతున్న గిరిజన సంఘాలకు లోపాయికారీగా సహకరిస్తున్నారని భంజ్‌దేవ్ వర్గం భావిస్తోంది. అదే విధంగా ఆయనవైపు తిరుగుతున్న నాయకుల్ని తనవైపు తిప్పుకునేందుకు వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారన్న వాదనలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ వీరిద్దరి మధ్య అంతర్గత పోరు తారస్థాయికి చేరింది.

 

మరిన్ని వార్తలు