పాదసేవ | Sakshi
Sakshi News home page

పాదసేవ

Published Sun, Jul 26 2015 11:33 PM

పాదసేవ

‘ఎందుకు నీ జీవితాన్ని బరువు చేసుకుంటున్నావ్ తల్లీ?
అలాంటి అల్లుడి కాళ్లు కడిగి కన్యాదానం ఎలా చేయమంటావ్‌రా? నీ పిచ్చి కాకపోతే కాళ్లు లేని భర్తకు
పాదసేవ ఎలా చేస్తావ్?...’ అని అమ్మమ్మ, బంధువులు, స్నేహితులు... చివరికి కాబోయే భర్త కూడా వారించినా...
ఒప్పుకోనంది. నొప్పుకోనంది. బాధ్యత నుంచి తప్పుకోనంది!
భర్త కాళ్లు తానై... ఎన్ని ముళ్లదారులను తొక్కైనా సరే... పూల వ్యాపారం చేస్తూ... జీవనభారాన్నీ... మోస్తూ ఉంది.
పెనిమిటి దైవం అనుకుని కాబోలు... మోస్తూనే ఉంది వాసంతి.
ఈ అందమైన కథ చదువుతుంటే... చల్లగా పరిమళించే ఈ పాట గుర్తుకొచ్చింది.
‘ఏ లీల సేవింతునో స్వామి...
ఏ పూల పూజింతునో...
శ్రీపారిజాత సుమాలెన్నో వీచె...
ఈ పేదరాలి మనస్సెంతో వేచె’
నీ పాద సేవ
మహాభాగ్యమీవా...’

 
పూలమ్మిన చోటే కట్టెలమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తే దిగులే మిగులుతుంది. కానీ అలా దిగులుతో కృంగిపోయేవారికి వాసంతి జీవితం ఓ కొత్త అర్థం చెబుతుంది. వాసంతికి చదువు రాదు. కానీ, లోకజ్ఞానం ఉంది. వాసంతికి జీవితమంటే పెద్ద పెద్ద అర్ధాలు తెలియవు. కానీ, ఉన్న జీవితాన్ని అందంగా మలుచుకోవడం ఎలాగో తెలుసు. విధి రెండు కాళ్లను దూరం చేసిన వ్యక్తిని కోరి వలచింది. ప్లాస్టిక్ పూలు అమ్ముతూ తన జీవితంలో సువాసనల కుసుమాలను నింపుకుంటోంది.
 
తెలుగు రాష్ట్రాల సరిహద్దులో ఉంటుంది అశ్వారావుపేట మండలం. ఇక్కడ నందమూరి కాలనీలో హైవేకి పక్కన ఉండే పాకలో నివాసం ఉంటోంది వాసంతి. భర్త, ముగ్గురు పిల్లలు.. ఇదీ ఆమె కుటుంబం. ఉదయం లేస్తూనే పాక శుభ్రపరుచుకొని, భర్తను భుజానికెత్తుకొని కాలకృత్యాలకు తీసుకెళ్లి, పిల్లలకు స్నానం చేయించి తనూ కాస్త తెరిపిన పడుతుంది. వంట పూర్తి చేసుకొని, ఇంటిల్లిపాదికీ పెట్టి... ఆ తర్వాత చాప పరిచి, ప్లాస్టిక్ కొమ్మలు, పూల రేకలు దానిమీద గుమ్మరిస్తుంది. పిల్లలు, భర్తతో కలిసి ఆ ప్లాస్టిక్ సామగ్రితో పూలకుండీలను తయారుచేస్తూ, పూల దండలు అల్లుతుంది. ఆ తర్వాత వాటిని తీసుకొని, అశ్వారావు పేట వీధుల్లోనూ అమ్మడానికి వెళుతుంది. ప్రతి బుధవారం సంత అయితే, అక్కడికీ వెళ్లి అమ్మి వస్తుంది. అలా వచ్చిన పైకంతో కుటుంబాన్ని నడిపిస్తుంది. పిల్లలకు విద్యాబుద్ధులూ చెప్పిస్తోంది. ఇంతభారం మోస్తున్నా అలుపెరగక కుటుంబాన్ని పూలనావపై నడిపిస్తోంది వాసంతి.
 
కొండంత కష్టం
వాసంతి భర్త వెంకటేశ్వర్లు. మూడు దశాబ్దాల క్రితం చిత్తూరు జిల్లా నుండి ప్లాస్టిక్ పూల వ్యాపారం కోసం అశ్వారావు పేటకు వచ్చి స్థిరపడ్డాడు. అతనితో పాటు మరో పది కుటుంబాలు  వలస వచ్చి అక్కడ స్థిరపడ్డాయి. పూల తయారీకి కావల్సిన ముడిసరుకు కోసం వెంకటేశ్వర్లు పొరుగు రాష్ట్రాలకు వెళ్లి వచ్చేవాడు. ఆ విధంగా పదహారేళ్ల క్రితం ముడిసరుకు కొనుగోలుకు వెంకటేశ్వర్లు, అతని భార్య శ్రీదేవి, ఐదేళ్ల వారి కొడుకు అజయ్ వెళ్లారు. తిరిగి వస్తుండగా తిరుపతి దగ్గర రోడ్డు ప్రమాదం! ఆ ప్రమాదంలో భార్య, కుమారుడు మరణించారు. వెంకటేశ్వర్లు రెండు కాళ్లూ కోల్పోయాడు.

 
అండగా నిలిచింది
సర్వస్వం కోల్పోయిన వెంకటేశ్వర్లు మానసికంగా బాగా చితికిపోయాడు. అయినా, నిభాయించుకొని చేతులనే ఆధారంగా చేసుకుంటూ జీవనం కొనసాగించడం మొదలుపెట్టాడు. వెంకటేశ్వర్లుకు నలుగురు అక్కలు, ఇద్దరు అన్నలు. వారిలో పెద్ద అక్క కూతురు వాసంతి. అప్పటికి ఆమె వయసు ఇరవై కూడా దాటలేదు. ఆమె మేనమామ పరిస్థితిని గమనించింది. బాగా ఉన్న రోజుల్లో మహారాజులా తిరిగిన మేనమామకు పూటగడవడమే కాదు, మరో ఆధారం లేకుండా క్షణం కూడా గడవడం లేదని అర్థం చేసుకుంది.

అతడు పడుతున్న కష్టాన్ని చూసి చలించిపోయింది. తన తల్లీదండ్రీ అనారోగ్యంతో చనిపోతే, ఈ మేనమామే అండగా ఉంటాడనుకుంది కానీ, మామయ్యకే ఇప్పుడు ఓ అండ కావాలి. అందుకే పెద్ద మనసు చేసుకుంది. ఆ అండ తనే కావాలని నిర్ణయించుకుంది. జీవితాంతం తోడూ నీడగా నిలవాలనుకుంది. అతన్ని పెళ్లి చేసుకుంటానని చెప్పింది. వెంకటేశ్వర్లు, అతని తల్లి ఒప్పుకోలేదు. కోరి కష్టాలను భుజానికెత్తుకోవద్దని నచ్చచెప్పారు. అయినా వినలేదు. పంతం పట్టి, రెండో భార్యగా వెంకటేశ్వర్లు మెడలో పూల దండ వేసి, అతని జీవితంలో అడుగుపెట్టింది వాసంతి. పూలమ్మిన చోటే కట్టెలమ్మాల్సిన దుస్థితిని అతనికి తప్పించింది. కాళ్లులేని వెంకటేశ్వర్లును ఎక్కడకు తీసుకెళ్లాలన్నా భుజాల మీద వేసుకొని అతనికి రెండు కాళ్లుగా నిలబడింది.
 
జీవితాన్నిచ్చింది
చిన్న కష్టమొస్తే తల్లడిల్లిపోయేవారు ఎంతో మంది. అలాంటిది కోరి కష్టాలనే ఆహ్వానించడమంటే!! ‘ఇంత ధైర్యం ఎవరూ చేయరు. సర్వస్వం కోల్పోయాననుకున్న నా జీవితంలో వెలుగులు నింపింది. వాసంతికి ఎంతో రుణపడి ఉన్నాను’ అంటూ వాసంతి చేతులను కళ్లకు అద్దుకుంటాడు వెంకటేశ్వర్లు. ‘అంతపెద్ద మాటలెందుకయ్యా’ అంటుంది వాసంతి.
 
ప్లాస్టిక్ పూల తయారీకి ముడిసరుకు కావాలి. కాళ్లు బాగుంటే వెంకటేశ్వర్లు తెచ్చేవాడు. కానీ, అతను కదల్లేని పరిస్థితి. అందుకే, తనే విజయవాడ, గుంటూరు, మహారాష్ట్రలకు వెళ్లి ముడిసరుకు కొనుక్కొని వస్తుంది వాసంతి. ఇద్దరూ కలిసి ఇంట్లో  తయారుచేసిన పూలను వాసంతి తలకెత్తుకొని వీధి వీధి తిప్పి అమ్మితే రోజుకు ఐదారు వందల రూపాయలు వస్తాయి. ఒక్కో రోజూ అవీ రావు. ఆ సంపాదనలోనే పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పిస్తున్నారు. ఉన్నదాంట్లోనే ఆనందాన్ని వెదుక్కుంటూ, రక్తసంబంధంలోని అనుబంధాలను పదిలపరుచుకుంటున్న వాసంతి ఎవ్వరికీ తీసిపోదని నిరూపిస్తోంది.
- ఎం.ఏ.సమీర్, సాక్షి, వేలేరుపాడు, ఖమ్మం జిల్లా
 
రామ్
ఎడిటర్, ఫీచర్స్

Advertisement
Advertisement