ఉక్కిరిబిక్కిరి చేస్తున్న విద్యుత్ కోతలు

1 May, 2016 02:22 IST|Sakshi
ఉక్కిరిబిక్కిరి చేస్తున్న విద్యుత్ కోతలు

అధిక లోడు పేరుతో విద్యుత్ సరఫరా నిలుపుదల
బయట విపరీతమైన ఎండ.. లోపల ఉక్కపోత..
బెంబేలెత్తుతున్న జనం

 
మచిలీపట్నం : జిల్లాలో అనధికార విద్యుత్ కోతలతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. సాంకేతిక లోపం తలెత్తిందనికొకసారి, ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్ పేరుతో మరోసారి రకరకాల కారణాలు చూపుతూ విద్యుత్ సరఫరాలో కోతపెడుతున్నారు. పగలు, రాత్రి తేడా లేకుండా గంట, రెండు గంటల పాటు విద్యుత్‌కోతలు విధిస్తుండటంతో వేసవిలో ప్రజలు అల్లాడుతున్నారు. అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో విద్యుత్ వినియోగం పెరిగింది. మే నెల ప్రారంభం కాకముందే జిల్లాలో 39 నుంచి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో కొద్దిసేపు కరెంటు పోయినా ప్రజలు  తట్టుకోలేకపోతున్నారు.  జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో విద్యుత్ కోతల వివరాలను పరిశీలిస్తే...

గన్నవరం నియోజకవర్గంలో సాంకేతిక లోపం కారణాలు చూపి అరగంట, గంట పాటు..
పెడన నియోజకవర్గంలో శుక్రవారం పగలు, రాత్రి సమయాల్లో  విడతల వారీగా..
మచిలీపట్నం నియోజకవర్గం శారదానగర్ సబ్‌స్టేషన్‌లోపరిధిలో గంటల తరబడి కోత  విధిస్తున్నారు.  పట్టణంలోని  పలు ప్రాంతాల్లో పగలు రాత్రి తేడా లేకుండా విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నారు.  పట్టణంలో మూడు రోజులకోసారి తాగునీటిని సరఫరా చేస్తున్నారు. శివారు ప్రాంతాలకు తాగునీరు అందాలనే ఉద్దేశంతో తాగునీరు విడుదల చేయని రోజుల్లోనూ గంటపాటు విద్యుత్ కోత పెడుతున్నారు.
తిరువూరు పట్టణంలో గత కొన్ని రోజులుగా పగలు సమయంలో  రోజులో కనీసంగా  ఆరు గంటల పాటు విద్యుత్‌కోతను విధిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఏడు నుంచి ఎనిమిది గంటలపైనే..
మైలవరం నియోజకవర్గంలో సాంకేతిక లోపం పేరుతో అడపాదడపా విద్యుత్ సరఫరా నిలిపేస్తున్నారు.
నందిగామ నియోజకవర్గంలో  ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్ పేరుతో రోజుకు రెండు గంటల పాటు విద్యుత్ సరఫరాలో కోత పెడుతున్నారు.
జగ్గయ్యపేట నియోజకవర్గంలో పగలు, రాత్రి అనే తేడా లేకుండా అరగంట, గంట పాటు విద్యుత్‌కోత విధిస్తున్నారు. కొన్నిసార్లు కరెంటుపోతే  రెండు గంటల పాటు రాని పరిస్థితి నెలకొంది.
 

మరిన్ని వార్తలు