తప్పుడు ప్రచారం చేస్తే రుణాలు ఆపేస్తాం

15 Sep, 2023 04:04 IST|Sakshi
మాట్లాడుతున్న ఆర్‌.కె.సింగ్‌. చిత్రంలో కిషన్‌రెడ్డి

కేంద్ర విద్యుత్‌ శాఖ మంత్రి ఆర్‌.కె. సింగ్‌

తెలంగాణ సీఎం విద్యుత్‌రంగంపై విష ప్రచారం చేస్తున్నారు

వ్యవసాయానికి తప్ప అన్నింటికీ మీటర్లు పెట్టాల్సిందే

విద్యుత్‌ సంస్థలను ప్రైవేటీకరణ చేయం

సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వంపై విద్యుత్‌ రంగానికి సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి తప్పుడు ప్రచారం చేస్తే.. రుణాలు, సబ్సిడీలు ఆపేస్తామని కేంద్ర విద్యుత్‌ శాఖ మంత్రి ఆర్‌. కె.సింగ్‌ హెచ్చరించారు. వ్యవసాయ పంపుసెట్లకు మీటర్ల ఏర్పాటు, విద్యుత్‌ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తారంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ విషప్రచారం చేస్తున్నారని, వ్యవసాయ పంపుసెట్లకు మినహా అన్నింటికి మీటర్లు ఏర్పాటు చేయాలని కేంద్రం స్పష్టం చేసిందని చెప్పారు. విద్యుత్‌ సంస్థల ఆడిట్‌ నివేదికలు, ఎనర్జీ ఆడిట్‌ ఎప్పటికప్పుడు చేయించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు.

తెలంగాణ విద్యుత్‌ సంస్థలు రుణాలు చెల్లించే స్థితిలో లేవని తమకు సమాచారం అందిందని మంత్రి తెలిపారు. గురువారం ఇక్కడ మంత్రి ఆర్‌.కె. సింగ్, పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి, విద్యుత్‌ శాఖ సహాయ మంత్రి క్రిషన్‌పాల్‌ గుర్జర్‌లు ‘విద్యుత్‌ శాఖ’పై ఏర్పాటైన పార్లమెంట్‌ సభ్యుల కన్సల్టేటివ్‌ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు.

అనంతరం ఆర్‌.కె. సింగ్‌ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వానికి గడిచిన తొమ్మిదేళ్ల కాలంలో రూరల్‌ ఎలక్ట్రికల్‌ కార్పొరేషన్‌ (ఆర్‌ఈసీ) రూ.1.57 లక్షల కోట్ల రుణం మంజూరు చేస్తే అందులో ఇప్పటికే రూ. 1.38 లక్షల కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర మంత్రి వివరించారు. అలాగే పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (పీఎఫ్‌సీ) నుంచి రూ.1.10 లక్షల కోట్లు మంజూరు అయితే.. రూ.91 వేల కోట్లు విడుదల చేసినట్లు మంత్రి వెల్లడించారు. 

ఎన్టీపీసీ 4 వేల మెగావాట్ల విద్యుత్‌ 
ప్లాంట్లు నిర్మిస్తుంది..: రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీ మేరకు తెలంగాణలో ఎన్టీపీసీ 4 వేల మెగావాట్ల థర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్లను నిర్మిస్తుందని కేంద్ర మంత్రి ఆర్‌.కె. సింగ్‌ తేల్చి చెప్పారు. ఇప్పటికే ఒక్కొక్కటి 800 మెగావాట్ల రెండు యూనిట్లు సిద్ధమయ్యాయని, ఈనెల 26న ఒక యూనిట్‌ వాణిజ్య ఉత్పత్తి ప్రారంభిస్తుందని, మరొకటి డిసెంబర్‌లో ఉత్పత్తి ప్రారంభిస్తుందని ఆయన వెల్లడించారు. వీటిని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభిస్తారని చెప్పారు.

మిగిలిన 2,400 మెగావాట్ల విద్యుత్‌ కేంద్రాలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలు చేసుకోవాలని ఎన్టీపీసీ కోరినా స్పందించడం లేదన్నారు. అయితే తెలంగాణ ప్రభుత్వం స్పందించకపోయినా ఎన్టీపీసీ ఒక్కొక్కటీ 800 మెగావాట్లుగల మూడు యూనిట్లను నిర్మిస్తుందని తేల్చి చెప్పారు. కాగా, దేశం మొత్తాన్ని ఒకే గ్రేడ్‌ కిందకు తీసుకువచ్చి 1.97 లక్షల కిలోమీటర్ల ట్రాన్స్‌మిషన్‌ లైన్‌లు వేసినట్లు చెప్పారు. తద్వారా దేశంలో ఏకకాలంలో 1.20 లక్షల మెగావాట్ల విద్యుత్‌ను ఎక్కడి నుంచి ఎక్కడికైనా సరఫరా చేస్తే సామర్థ్యం ఏర్పడిందని మంత్రి వివరించారు.
 

మరిన్ని వార్తలు