-

బాబు షాక్‌ ఖరీదు రూ.94 వేల కోట్లు!

14 Sep, 2023 04:02 IST|Sakshi

ముందుచూపు లేకుండా విద్యుత్తు సంస్థలతో ‘పీపీఏ’లు

పాతికేళ్లలో 464 మెగావాట్లకే రూ.10,978 కోట్లు వ్యయం

ఇప్పుడు 5,134 మెగావాట్లకు చెల్లించేది రూ.16,425 కోట్లే

గత సర్కారుతో పోలిస్తే సగం కంటే తక్కువ ధరకే కొనుగోలు 

సాక్షి, ప్రత్యేక ప్రతినిధి :  విద్యుత్తు రంగంలో గత సర్కారు అడ్డగోలు ఒప్పందాలు, తప్పిదాలు రాష్ట్రానికి శాపంగా మారాయి. దీర్ఘకాలిక ప్రణాళిక లేకుండా ప్రైవేట్‌ విద్యుత్‌ సంస్థలతో ఇష్టారాజ్యంగా చేసుకున్న ఒప్పందాలు (పీపీఏ) గుదిబండలా పరిణమించాయి.

సరిగ్గా చెప్పాలంటే అదే రేటుతో ఇప్పుడు ఒప్పందం చేసుకుంటే వినియోగదారులపై దాదాపు రూ.లక్ష కోట్ల భారం పడేది! సాధారణంగా సౌర, పవన విద్యుదుత్పత్తి వ్యయం తొలి పదేళ్లు స్థిరంగా కొనసాగి తరువాత నుంచి క్రమంగా తగ్గుతుంది. టీడీపీ సర్కారు మాత్రం వినియోగదారుల నడ్డి విరిచేలా పాతికేళ్ల పాటు అధిక ధరకు కొనుగోలు ఒప్పందాలు చేసుకోవడం దారుణమని విద్యుత్తు రంగ నిపుణులు పేర్కొంటున్నారు.

ఇదీ జరిగింది... 
టీడీపీ హయాంలో 2014–2019 మధ్య ఎస్పీడీసీఎల్‌ పరిధిలో 464 మెగావాట్ల సౌర విద్యుత్‌ కొనుగోలుకు 15 కంపెనీలతో ఒప్పందాలు జరిగాయి. దాని ప్రకారం మొదటి ఏడాది యూనిట్‌కు రూ.5.98 చొప్పున చెల్లించాలి. రెండో ఏడాది నుంచి ఏటా మూడు శాతం చొప్పున పదో సంవత్సరం దాకా కొనుగోలు వ్యయం పెరుగుతుంది. పదో ఏడాది నాటికి ఒక్కో యూనిట్‌ కొనుగోలుకు రూ.7.8025 చొప్పున చెల్లించాలి.

పదో ఏడాది చెల్లిస్తున్న ధరనే ఒప్పంద కాలం ముగిసే వరకు అంటే 25వ సంవత్సరం దాకా చెల్లించేలా గత సర్కారు ఒప్పందం చేసుకుంది. దీని ప్రకారం తొలి ఏడాది యూనిట్‌ రూ.5.98 చొప్పున 464 మెగావాట్లకుగాను రూ.365.89 కోట్లు చెల్లించాలి. ఏటా 3 శాతం చొప్పున పెంచడం వల్ల పదో ఏడాది రూ.477.41 కోట్లు చెల్లించాలి. వెరసి 25 ఏళ్లకు గాను కేవలం 464 మెగావాట్లకు చెల్లించాల్సిన మొత్తం రూ.10,978 కోట్లు అవుతుంది. 

ఇప్పుడు ఇలా ఆదా..
సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కృషితో పునరుత్పాదక ఇంధన రంగంలో మూడు కీలక ప్రాజెక్టుల ఏర్పాటుకు గత నెలలో ఏపీ జెన్‌కో, ఎన్‌హెచ్‌పీసీ మధ్య కీలక ఒప్పందాలు జరిగాయి. మొత్తం రూ.25,850 కోట్ల పెట్టుబడుల ద్వారా 5,314 మెగావాట్ల సౌర, పవన విద్యుత్‌ అందుబాటులోకి రానుంది. అంతేకాకుండా 5,300 మందికి ఉపాధి లభిస్తుంది. ఈ ఒప్పందం ప్రకారం ఒక్కో యూనిట్‌కు రూ.2.49 చొప్పున 25 ఏళ్ల పాటు చెల్లిస్తారు.

5,134 మెగావాట్లకు గాను పాతికేళ్లకు ప్రభుత్వం చెల్లించే మొత్తం కేవలం రూ.16,425 కోట్లు మాత్రమే. అంటే ఒక్కో యూనిట్‌ గత సర్కారు హయాంతో పోలిస్తే సగం కంటే తక్కువ ధరకే లభించడంతోపాటు రూ.వేల కోట్లు ఆదా అయ్యాయి. టీడీపీ పాలనలో కుదుర్చుకున్న ఒప్పందాల ప్రకారం చెల్లిస్తే విద్యుత్తు వినియోగదారులపై అక్షరాలా రూ.94 వేల కోట్ల మేర అదనపు భారం పడేది. పాలకులు ముందుచూపుతో వ్యవహరిస్తే ప్రజలకు ఎంత మేలు చేయవచ్చో విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలే రుజువు చేస్తున్నాయి!

ఊరూ.. పేరూ ఒకటే!
464 మెగావాట్ల సౌర విద్యుత్‌ సరఫరా నిమిత్తం ఎస్పీడీసీఎల్‌ 15 సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకోగా ఇందులో విచిత్రం ఏమిటంటే తొమ్మిది కంపెనీల రిజిస్టర్డ్‌ ఆఫీసు, కార్పొరేట్‌ ఆఫీసుల చిరునామా ఒకటే కావడం గమనార్హం. అంతేకాదు.. ఐదు కంపెనీలలో ముగ్గురు కామన్‌ డైరెక్టర్లుగా ఉండటం మరో విచిత్రం. ఒప్పందాలు కుదుర్చుకున్న కంపెనీలు, కొందరు డైరెక్టర్లు కనీసం ఐటీ రిటర్నులు కూడా దాఖలు చేయకపోయినా రూ.కోట్ల పెట్టుబడులు పెట్టినట్లు చూపడం మరో విశేషం.

టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్లిన రాజ్యసభ సభ్యుడికి చెందిన కంపెనీలు కూడా వీటిలో ఉండటం పరిశీలనాంశం. ఎల్లో మీడియా ఇవన్నీ దాచిపెడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై బురద చల్లే యత్నం చేయటాన్ని పరిశీలకులు తప్పుబడుతున్నారు. 

మరిన్ని వార్తలు