అనంతలో పచ్చరచ్చ

23 Jul, 2014 02:23 IST|Sakshi
అనంతలో పచ్చరచ్చ

తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి వీరంగం

 అనంతపురం : ఈ నెల 24న సీఎం చంద్రబాబు అనంతపురం జిల్లా పర్యటన నేపథ్యంలో ‘అనంత’ టీడీపీలో విభేదాలు రచ్చకెక్కాయి. తమకు తెలియకుండా పార్టీలో ఎవర్నీ చేర్చుకోరాదంటూ తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి మంగళవారం వీరంగం సృష్టించారు. ఎన్నికల సమయంలో వైఎస్సార్‌సీపీలో ఉన్న జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రషీద్ అహ్మద్, మాజీ కార్పొరేటర్ మాసూం బాబాలను అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర చౌదరి టీడీపీలోకి ఆహ్వానించారు.

వారి చేరిక కోసం మంగళవారం నగరంలో కార్యక్రమం ఏర్పాటు చేశారు. విషయం తెలిసి ఎమ్మెల్యే జేసీ ప్రభాకరరెడ్డి మందీ మార్బలంతో అక్కడికి చేరుకున్నారు. ‘మా అన్న(జేసీ దివాకరరెడ్డి) అనంతపురం ఎంపీ. పార్లమెంటు స్థానం పరిధిలో కొత్త వ్యక్తులను పార్టీలోకి చేర్చుకునే ముందు మాకు మాటమాత్రమైనా చెప్పరా..? వారిని పార్టీలోకి ఎలా చేర్చుకుంటావో చూస్తా.’ అని ఆగ్రహంతో ప్రభాకరచౌదరిని నిలదీశారు. పార్టీలోకి చేరడానికి వచ్చిన రషీద్ అహ్మద్, మాసూం బాబాలను బూతులు తిట్టారు. ఈ లోపు జేసీ అనుచరులు అక్కడున్న కుర్చీలు విసిరేసి ఫ్లెక్సీలు చించేశారు. తమకు తెలీకుండా ఎవరైనా ఇష్టానుసారం ప్రవర్తిస్తే ఖబడ్దార్ అంటూ నిష్ర్కమించారు.
 
 

మరిన్ని వార్తలు