అటవీ శాఖ నిర్లక్ష్యంతోనే ప్రాజెక్టులు ఆలస్యం | Sakshi
Sakshi News home page

అటవీ శాఖ నిర్లక్ష్యంతోనే ప్రాజెక్టులు ఆలస్యం

Published Wed, Jul 23 2014 2:25 AM

Neglected by the forest department to delay projects

సాక్షి, ఖమ్మం: అటవీ శాఖ నిర్లక్ష్యం వల్లే తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం ముందుకు సాగడం లేదని ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈ చట్టాలపై ఆ శాఖ అధికారులు దృష్టి సారించి పరిష్కారానికి మార్గాలు చూపాలని కోరారు. పార్లమెంట్‌లో మంగళవారం ఆయన పలు అంశాలను ప్రస్తావించారు. పర్యావరణ అనుమతుల్లో నిర్లక్ష్యం కారణంగా ప్రాజెక్టుల నిర్మాణం ఆలస్యమవుతోందన్నారు.

నిర్మాణానికి అన్ని అనుమతులు ఉన్నా అటవీ శాఖ అలసత్వం వల్ల ప్రాజెక్టుల పనులు ముందుకు సాగడం లేదని పేర్కొన్నారు. ప్రస్తుతం పాలకులు ఈ అంశంపై దృష్టి సారించగలిగితే నిలిచిపోయిన ప్రాజెక్టులు పూర్తకావడంతోపాటు జాతీయ ఉత్పత్తి పెరిగి, దేశం ఆర్థికంగా బలోపేతమవుతుందన్నారు. ఇప్పటికైనా ఈ చట్టాల అమలుకు పూనుకోవాలని, ప్రాజెక్టుల నిర్మాణాలు పూర్తి చేసి రైతులను ఆదుకోవాలని కోరారు.  సరిహద్దు రాష్ట్రాలు వద్దు మొర్రో అంటున్నా వారి వాదనను వినిపించుకోకుండా పోలవరం బిల్లును ఆమోదించారన్నారు.

ఏళ్ల తరబడి తెలంగాణ ప్రాంత ప్రజలు ఎదురుచూస్తున్న ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టు జాతీయ హోదా కల్పించాలని డిమాండ్ చేశారు. నదుల అనుసంధానం కోసం సర్ ఆర్థర్ కాటన్  చేసిన ప్రయత్నాలను పొంగులేటి కొనియాడారు. కృష్ణ, గోదావరి, కావేరి నదులపై ప్రాజెక్టులు నిర్మించాలనే సర్ ఆర్థర్‌కాటన్ చిరకాల కోరికను ప్రస్తుత పాలకులైనా నెరవేర్చాలన్నారు. అలాగే  బిందు సేద్యంపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ఈ విధానం వల్ల తక్కువ నీటితో ఎక్కువ పంటలు పండించుకుని రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందడంతోపాటు ప్రభుత్వానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు.

  గోదావరి నుంచి తెలంగాణ ప్రాంతానికి సాగునీటి కోసం ఏర్పాటు చేసిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టుపై దృష్టి సారించాలని కోరారు. ఈ ప్రాజెక్టులో 30 అడుగుల మేర పూడిక ఉందని, దీని వల్ల తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని వివరించారు. వీలైనంత త్వరగా శ్రీరాంసాగర్‌లో పూడికతీత కార్యక్రమం చేపట్టాలని, అందుకు సరిపడా నిధులను కేటాయించాలని కోరారు.  ప్రస్తుత సీజన్‌లో వరద ముంపులో ఉన్న ప్రాంతాల్లో సహాయక కార్యక్రమాలు నిర్వహించడంతోపాటు బాధితులకు ముందుగానే పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. వరద బీభత్సంతో నష్టపోయిన రైతులకు ప్రత్యేక పథకం ఏర్పాటు చేసి బాధిత రైతులకు నష్టపరిహారం చెల్లించాలన్నారు.

Advertisement
Advertisement