ఐటీ..పిటీ

20 Mar, 2015 01:38 IST|Sakshi

ఇదిగో ఒరాకిల్... ఇదిగో ఆపిల్... అదిగదిగో మైక్రోసాఫ్ట్...!

విశాఖ నగరానికి బడా ఐటీ కంపెనీలు వస్తున్నాయంటూ రాష్ట్ర ప్రభుత్వం ఇలా  ఊదరగొడుతోంది. కానీ వాస్తవం మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉండటం విస్మయకర వాస్తవం. విశాఖవైపు బడా ఐటీ కంపెనీలు ఏవీ కన్నెత్తి చూడటం లేదు. ప్రభుత్వం ఆ దిశగా కసరత్తు కూడా చేయడం లేదు. ఆసక్తి చూపించే కంపెనీలకు విశాఖలో కోరిన భూమి ఇవ్వడానికి ప్రభుత్వం వెనుకడుగు వేస్తోంది. మరోవైపు విశాఖకంటే నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోనే కావల్సినంత భూమి ఇస్తామని ప్రతిపాది స్తోంది. పెద్ద కంపెనీలను  దూరం చేసేలా ప్రభుత్వమే పకడ్బందీగా వ్యూహాన్ని అ మలు చేస్తుండటం విశాఖ ఐటీ ప్రగతికి విఘాతంగా మారింది.  -సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం
 
ఇక్కడ ఇవ్వలేం... అక్కడైతే ఇస్తాం

ప్రపంచంలో ప్రముఖ ఐటీ  సంస్థలను రాష్ట్రంలో యూనిట్లు స్థాపించేలా చేయడానికి ప్రభుత్వ ఐటీ శాఖ సలహాదారు జె.వి.సత్యన్నారాయణ, ఐటీ కార్యదర్శి  సంజయ్ జాజు ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్నారు. వారు  ఐటీ ప్రాజెక్టులపై ఒరాకిల్, ఆపిల్, డెల్ తదితర సంస్థల ప్రతినిధులతో చర్చించారు. ఈ సందర్భంగా విశాఖపట్నంలో తమ యూనిట్లు స్థాపించేందుకు ఆ సంస్థలు ఆసక్తి కనబరచలేదని తెలుస్తోంది. అందుకు ప్రధాన కారణం ఆ  సంస్థలు కోరినంత భూమి, ఇతరత్రా మౌలిక వసతులను విశాఖపట్నంలో  కల్పించలేమని ప్రభుత్వం చేతులెత్తేయడమే. ఎకరా, అర ఎకరాకు మించ భూములు ఇవ్వలేమని తేల్చిచెప్పేశారు. దాంతో తాము విశాఖపట్నంలో యూనిట్లు స్థాపించలేమని ఆ సంస్థలు కుండబద్దలు కొట్టేశాయి. కానీ ఐటీ ఉన్నతాధికారులు ఆ సంస్థలకు విజయవాడ-మంగళగిరి, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో కోరినంత భూమి ఇవ్వగలమని చెప్పడం గమనార్హం. బెంగుళూరు, చెన్నైలకు కూడా సమీపంలో ఉంటుందని చెబుతూ విజయవాడ-మంగళగిరి,  నెల్లూరు, చిత్తూరులకు అనుకూలంగా ప్రభుత్వం బలమైన వాదన వినిపిస్తోంది.  ఒరాకిల్, ఆపిల్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలకు అక్కడ  50 ఎకరాల చొప్పున కూడా కేటాయించగలమని ప్రతిపాదిస్తుండటం గమనార్హం.


 ఇప్పటికే పై డేటా అనే సంస్థకు అప్పటికే మంగళగిరి ఆటోనగర్‌లో ప్రభుత్వం 10 ఎకరాలు కేటాయించడం ఇందుకు నిదర్శనం. ఆ సంస్థ రూ.600కోట్లతో నెలకొల్పే యూనిట్‌కు త్వరలో భూమి పూజ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు కూడా. చోటా కంపెనీలకూ పెండింగే : విశాఖ వచ్చేసరికి చిన్న చిన్న కంపెనీలతోనే ప్రభుత్వం సరిపెడుతోంది.  ఐటీ శాఖ 24 కంపెనీలకు భూముల కేటాయింపు కోసం ఏపీఐఐసీకి ప్రతిపాదించింది.  వాటికి   గంభీరం, మధురవాడలో 15 ఎకరాలు కేటాయించాలని నిర్ణయించారు. ఒక్కొ కంపెనీకి దా దాపు అర ఎకరా ృొప్పునే భూములు కేటాయించాలని ప్రతిపాదించారు. ఆ 24 సంస్థలు కూడా దాదాపు  ఎన్‌ఆర్‌ఐలుగా వ్యక్తిగతంగా స్థాపించేవే. అంతేగానీ ఒక్కటి కూడా పెద్ద ఐటీ కంపెనీ లేనే లేదు. అంటే పెద్ద ఐటీ కంపెనీలకు విజయవాడ-మంగళగిరి, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో భూములు కేటాయించడానికి ప్రభుత్వం ఆసక్తి చూపుతోంది. ఈమేరకు ఆ జిల్లాల కలెక్టర్లు కూడా ఎంతైనా భూమి కేటాయిస్తామని ఏపీఐఐసీకి ప్రతిపాదించారు. అదే విశాఖ జిల్లా వచ్చేసరికి భూములు ఇవ్వలేమని రెృెన్యూ అధికారులు ఏపీఐఐసీకి తేల్చిచెప్పేశారు.
 

మరిన్ని వార్తలు