వేతనాల్లో ఇంత తేడానా? పదేళ్లలో పెరిగిన సీఈఓ, ఫ్రెషర్స్ శాలరీ రిపోర్ట్

29 Oct, 2023 15:20 IST|Sakshi

భారతదేశం ఇతర దేశాలతో పోటీపడాలన్నా, ప్రగతి సాధించాలన్నా.. యువత వారానికి 70 గంటలు పనిచేయాలన్న ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి మాటలతో కొందరు ఏకీభవించగా, మరికొందరు వ్యతిరేకించారు. ఈ విషయంపై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే ఐఏఎస్ 'అశోక్ ఖేమ్కా' (Ashok Khemka) తాజాగా ఒక ట్వీట్ చేసాడు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

అశోక్ ఖేమ్కా ఎక్స్ (ట్విటర్) ఖాతాలో షేర్ చేసిన పోస్ట్‌లో ఐటీ కంపెనీలలో పనిచేసే ఫ్రెషర్స్, సీఈఓల శాలరీలలో వ్యత్యాసం చూడవచ్చు. దీని ప్రకారం.. 2012లో రూ. 2.75 లక్షల వేతనం పొందే ఇన్ఫోసిస్ ఫ్రెషర్ శాలరీ 2022 నాటికి రూ. 3.6 లక్షలకు చేరింది. దీన్ని బట్టి చూస్తే 10 సంవత్సరాల్లో ఒక ఫ్రెషర్ జీతం కేవలం రూ. 85,000 మాత్రమే పెరిగింది. అయితే 2012లో రూ. 80 లక్షల వేతనం తీసుకునే సీఈఓ శాలరీ 2022 నాటికి రూ. 79.75 కోట్లకు చేరింది. దశాబ్ద కాలంలో పెరిగిన ఫ్రెషర్ వేతనం, సీఈఓ వేతనాల వ్యత్యాసం ఏ స్థాయిలో ఉందో ఇక్కడ స్పష్టంగా చూడవచ్చు.

విప్రో, టీసీఎస్, టెక్ మహీంద్రా, L & K ఇన్ఫోటెక్, హెచ్‌సీఎల్‌, మీడియన్ (Median) సంస్థల్లో కూడా ఇదే విధానం కొనసాగుతోంది. సీఈఓల జీతాలు భారీగా పెరుగుతున్నాయి, ఫ్రెషర్ల వేతనాలు మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయి.

ఇదీ చదవండి: రూ.76 లక్షల రేంజ్ రోవర్ కేవలం రూ.100కే..! ఎగబడుతున్న జనం..

అశోక్ ఖేమ్కా ఈ పోస్ట్ షేర్ చేస్తూ.. ఇన్ఫోసిస్ సీఈఓ వేతనం ఫ్రెషర్ వేతనానికి 2,200 రెట్లు ఎక్కువ. సీఈఓ, ఫ్రెషర్ వరుసగా వారానికి ఎన్ని గంటలు పని చేస్తారు? వారానికి 168 గంటలు మాత్రమే ఉంటాయని అని వెల్లడించాడు. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై పలువురు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు