జగనన్న హామీతో ఆర్‌టీసీకి జవసత్వాలు

3 Apr, 2019 08:19 IST|Sakshi

సాక్షి, కొయ్యలగూడెం : దశాబ్ధాల పోరాట ఫలితం ఫలించిన వేళ ఆర్టీసీ లోకం హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్రంలో వైఎస్సార్‌ సీపీ పాలన కోసం ఎదురుచూస్తున్నామంటూ కార్మికులు పేర్కొంటున్నారు. వైఎస్సార్‌ సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేస్తామన్న హామీతో ఆర్టీసీ ఉద్యోగులు ధన్యవాదాలు వ్యక్తం చేస్తున్నారు. వరుస నష్టాలతో కూనరిల్లుతున్న ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాల్సిందిగా దశాబ్దం నుంచి చేస్తున్న పోరాటాలు, ఆందోళనకు జగన్‌ హామీ జవసత్వాలను నింపిందన్నారు. ఆర్టీసీలో ఏళ్ల తరబడి కండక్టర్లు, డ్రైవర్లు, మెకానిక్‌ పోస్టులు భర్తీకి నోచుకోకపోవడంతో అదనపు భారం మోస్తూ అనారోగ్యం పాలవుతున్నామన్నారు. సమస్యను పరిష్కరించాలని కోరుతున్నా సంస్థ నష్టాల్లో ఉందని మొహం చాటేశారే గానీ, మా బాధలు వినలేదని వాపోయారు. ఇటీవల మంత్రి అచ్చెన్నాయుడు 50 శాతం ఫిట్‌మెంట్‌ ఇస్తామని, తీరా 25 శాతంతో సరిపెట్టి కార్మికులను వంచించారన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు 60 సంవత్సరాలకు ఉద్యోగ విరమణ అవకాశం కల్పించి, ఆర్టీసీ కార్మికులకు పెంచకపోవడం తీవ్ర అన్యాయమని, ఈ నేపథ్యంలో జగనన్న హామీ విలీనం వల్ల తమకు లబ్ధి చేకూరుతుందని భావోద్వేగాలతో పేర్కొంటున్నారు. 


నిర్వీర్యం చేసిన చంద్రబాబు ప్రభుత్వం
ప్రజారవాణా వ్యవస్థకు ఆయువుపట్టు వంటి ఏపీఎస్‌ఆర్టీసీని చంద్రబాబునాయుడు ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని కార్మికులు విమర్శిస్తున్నారు. సంస్థను ప్రైవేట్‌ పరం చేసి ప్రభుత్వం లబ్ధిపొందుదామని చేసిన ప్రయత్నాలను కార్మికులు ఆందోళనలతో అడ్డుకున్నారు. పల్లె వెలుగు బస్సులను సగానికిపైగా రద్దు చేసి వాటి స్థానంలో ప్రైవేట్‌ బస్సులను ప్రోత్సహిస్తూ పాలకులు లబ్ధిపొందారని కార్మికులు ఆరోపించారు. మేన్‌ సర్వీస్‌ పేరిట కండక్టర్ల విధులు కూడా చేయిస్తున్నారని, 2012 నుంచి డ్రైవర్ల రిక్రూట్‌మెంట్‌ లేకుండా నిరుద్యోగులను సైతం ప్రభుత్వం పెంచిందన్నారు. 


పనిభారం పెంచి డ్యూటీలు వేయిస్తూ వారి ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారని, మెకానిక్‌ పోస్టులు సైతం గత పదేళ్లుగా నోచుకోలేదని వాపోతున్నారు. ప్రజల కోసం పండుగ రోజుల్లో కూడా పనిచేస్తున్న తమకు ప్రభుత్వం హామీ ఇచ్చిన ఫిట్‌మెంట్‌ అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆర్టీసీలో అద్దె బస్సులు, రిజర్వేషన్‌ కౌంటర్‌లను ప్రైవేట్‌ వ్యక్తులకు దారాదత్తం చేస్తూ తమ పొట్టలు కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా వీఆర్‌ఎస్‌ జీవోను కూడా తీసుకువచ్చారని సిబ్బంది స్వచ్ఛందంగా తప్పుకునేలా ప్రణాళికలను ప్రభుత్వం చేసిందని ఆరోపించారు. ఈ నేపధ్యంలో ఆర్టీసీ మనుగడకు విలీనం ఒక్కటే శాశ్వత పరిష్కారం అని భావించిన యువనేత అందుకు తగ్గట్టుగా నిర్ణయం తీసుకోవడం తమలో ఆనందాన్ని నింపిందన్నారు. విలీనం వల్ల నష్టాల పేరుతో సర్వీసులు ఎత్తివేయడం ఉండదని, అన్ని గ్రామాలకు బస్సు సౌకర్యం కలుగుతుందని,  కొత్త బస్సులు సమకూర్చుకోవచ్చని పేర్కొంటున్నారు. 

విలీనంతో ఎంతో మేలు
ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న కష్టనష్టాలు వర్ణనాతీతం. తక్కువ వేతనాలతో ఎక్కువ పనులు చేస్తూ సిబ్బంది నానాయాతనలు పడుతున్నాం. ఆర్టీసీ విలీనంపై ఎప్పటి నుంచో యూనియన్‌లు చేస్తున్న ఆందోళనలకు జగన్‌ హామీ అభయహస్తంలా మాకు మేలు చేయగలదు. 
– ఎం.భాస్కరరావు, ఏడీసీ, ఆర్టీసీ 


మా అభ్యర్థనలు ఫలించాయి
వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి రాగానే ఆర్టీసీని ప్రభుత్వ శాఖ వలే ప్రజారవాణా శాఖగా ప్రకటించాలని ప్రతిపక్ష నాయకుడైన జగన్‌మోహన్‌రెడ్డికి పాదయాత్రలో ప్రతి జిల్లా నుంచి అభ్యర్థనలు వెళ్లిన ఫలితం ఫలించింది. సాధక బాధలు విన్న జగన్‌మోహన్‌రెడ్డి ఆర్టీసీ లోకానికి తియ్యని కబురు అందించారు. 
– బి.వీరయ్య, కండక్టర్‌


మరింత మెరుగైన రవాణా
ప్రజారవాణా బాధ్యత ప్రభుత్వం తీసుకున్నప్పుడే నిర్వహణ సక్రమమవుతుంది. ప్రయాణికులకు భరోసా కలుగుతుంది. విలీనంతో ప్రజలకు మరింత మెరుగైన రవాణాను మారుమూల ప్రాంతాల్లో సైతం అందించగలుగుతాం. ప్రతి కార్మికునికి బాధ్యత ఉంటుంది. 
– ఎల్‌ఎన్‌ రావు, ఏడీసీ, ఆర్టీసీ
 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు