నాగబాబు కుటుంబానికి జగన్ పరామర్శ

4 Jul, 2015 04:23 IST|Sakshi
నాగబాబు కుటుంబానికి జగన్ పరామర్శ

కాకినాడ : పార్టీ ఆవిర్భావం నుంచి నగరంలో పటిష్టతకు మాజీ కార్పొరేటర్ చామకూర ఆదినారాయణ (నాగబాబు) చేసిన సేవలు ఎనలేనివని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కొనియాడారు. ఇటీవల నాగబాబు ఆనారోగ్యంతో మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం కాకినాడలోని ఆయన నివాసానికి వచ్చి కుటుంబ సభ్యులను పరామర్శించారు. నాగబాబు భార్య విజయలక్ష్మి, కుమారుడు సురేష్, సోదరుడు కాంతారావులను ఓదార్చారు. జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ నాగబాబు మూడు దశాబ్దాల పాటు ప్రజాప్రతినిధిగా ఎనలేని సేవలందించారన్నారు.

నిరంతరం సమస్యల పరిష్కారానికి కృషిచేస్తూ ప్రజలకు అండగా ఉండేవారని, అందుకే మూడు సార్లు కౌన్సిలర్‌గా, ఒకసారి కార్పొరేటర్‌గా ప్రజలు గెలిపించారన్నారు. నాగబాబు మృతి కాకినాడ ప్రాంత ప్రజలతో పాటు తమ పార్టీకి తీరని లోటన్నారు. నాగబాబు చిత్రపటానికి జగన్‌మోహన్‌రెడ్డి పూల మాలలు వేసి నివాళులర్పించారు. మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, మాజీ మంత్రి పినిపే విశ్వరూప్, పార్టీ కాకినాడ పార్లమెంటు కో ఆర్డినేటర్ చలమలశెట్టి సునీల్, సిటీ అధ్యక్షుడు ఆర్‌వీజేఆర్ కుమార్, మాజీ డిప్యూటీ మేయర్ పసుపులేటి వెంకటలక్ష్మి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి సంగిశెట్టి అశోక్, సంయుక్త కార్యదర్శి కర్రి నారాయణరావు, రాష్ట్ర ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శి రావూరి వెంకటేశ్వరరావు, పలువురు మాజీ కార్పొరేటర్లు, కాకినాడకు చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు