ఓట్ల చీలికే టార్గెట్‌! 

26 Mar, 2019 09:15 IST|Sakshi

సాక్షి, శ్రీకాకుళం:  తమ అభ్యర్థుల గెలుపుపై ఆశలు చాలించుకున్న జనసేన పార్టీ వైఎస్సార్‌సీపీ ఓట్లను కొల్లగొట్టే ఎత్తుగడ వేస్తోంది. జిల్లాలో పటిష్టంగా ఉన్న వైఎస్సార్‌సీపీ ఓట్లను చీల్చడం ద్వారా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు పరోక్షంగా మేలు చేకూర్చే కుటిల యత్నానికి పాల్పడుతోంది. ఇప్పటికే జనసేన, టీడీపీల మధ్య రహస్య ఒప్పందం జరిగిందన్న ప్రచారానికి జిల్లాలో జనసేన సీట్ల కేటాయించిన తీరు బలం చేకూరుస్తోంది. ఇందులో భాగంగా జిల్లాలోని పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆరు చోట్ల వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఏ సామాజికవర్గం వారైతే జనసేన నుంచి కూడా ఆ సామాజికవర్గం వారికే సీట్లు కేటాయించింది. ఇక శ్రీకాకుళం లోక్‌సభ స్థానానికి కూడా అదే వ్యూహాన్ని అమలు చేసింది. జనసేన ఆవిర్భావం నుంచి పవన్‌ కల్యాణ్‌కు అండగా ఉంటూ, పార్టీ కార్యకలాపాలను నెత్తినేసుకుని మోసిన వారిని కాదని ముక్కు, ముఖం తెలియని వారికి సీట్లు కేటాయించడం చూస్తే వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల ఓట్లను సాధ్యమైనంత వరకు దెబ్బతీయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు స్పష్టమవుతోంది. అయితే టీడీపీ అభ్యర్థుల విషయంలో మాత్రం జనసేన ఈ వ్యూహాన్ని అమలు చేయకపోవడం ఇందుకు దర్పణం పడుతోంది. శ్రీకాకుళం జిల్లాలో అసెంబ్లీ స్థానాలకు జనసేన కేటా యించిన అభ్యర్థుల పేర్లను చూసి ఆయా నియోజకవర్గాల ప్రజలే విస్తుపోతున్నారు. 
 

అదెలా అంటే..?
టెక్కలి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కాళింగ సామాజికవర్గానికి చెందిన పేరాడ తిలక్‌ కాగా జనసేన అదే సామాజికవర్గీయుడైన కణితి కిరణ్‌కుమార్‌కు టికెట్టిచ్చింది. ఆమదాలవలసలో వైఎస్సార్‌సీపీ టికెట్టు తమ్మినేని సీతారామ్‌ (కాళింగ)కు ఇవ్వగా ఆ నియోజకవర్గంతో సంబంధం లేని కొత్తూరు మండలానికి చెందిన కాళింగ సామాజికవర్గానికి చెందిన పేడాడ రామ్మోహనరావుకు జనసేన టికెట్టిచ్చారు. అలాగే పాతపట్నంలో తూర్పు కాపు కులానికి చెందిన రెడ్డి శాంతి వైఎస్సార్‌సీపీ తరఫున బరిలో నిలవగా జనసేన గేదెల చైతన్య (తూర్పు కాపు)కు కేటాయించింది. రాజాం నియోజకవర్గంలో ఎస్సీ (మాల) కులస్తుడైన కంబాల జోగులు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కాగా అదే సామాజిక వర్గీయుడైన ముచ్చా శ్రీనివాసరావుకు జనసేన సీటు ఖరారు చేశారు. పాలకొండలో ఎస్టీలో జాతాపు ఉపకులానికి చెందిన విశ్వాసరాయి కళావతికి వైఎస్సార్‌సీపీ టికెట్టివ్వగా అక్కడ పొత్తులో భాగంగా సీపీఐకి చెందిన (అదే సామాజికవర్గం) డీవీజీ శంకర్రావుకు కేటాయించారు. అలాగే శ్రీకాకుళం లోక్‌సభ స్థానం విషయంలోనూ ఆదే తీరును కనబర్చింది. ఇక్కడ వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా కాళింగ కులానికి చెందిన దువ్వాడ శ్రీనుకు టికెట్టు ఇవ్వగా జనసేన కూడా అదే సామాజిక వర్గీయుడైన మెట్టా రామారావుకు ఏరికోరి కేటాయించింది. ఈ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థి కింజరాపు రామ్మోహన్‌నాయుడు (వెలమ) పోటీ చేస్తుండగా ఆ సామాజికవర్గం వారిని జనసేన బరిలోకి దింపకపోవడం కుట్ర కోణం చెప్పకనే చెబుతోంది. 


పార్టీకి కష్టపడ్డ వారిని కాదని..
పార్టీ కోసం కష్టపడ్డ వారిని కాదని కేవలం వైఎస్సార్‌సీపీ ఓట్ల చీలికే లక్ష్యంగా జనసేన అభ్యర్థులను కేటాయించిన వైనం ఆయా నియోజకవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 

  • టెక్కలిలో చాన్నాళ్లుగా ఎస్సీ సామాజిక వర్గీయుడైన కె.యాదవ్‌ జనసేన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నాడు. అంతా ఆయనకే టికెట్టు ఖాయమని అనుకుంటుండగా ఆయనను కాదని ఆకస్మికంగా కాళింగ కులస్తుడైన కిరణ్‌కుమార్‌కు టికెట్టు ఇచ్చారు. 
  • రాజాంలో జనసేనలో చాన్నాళ్లుగా పనిచేస్తున్న వారిని కాదని, ప్రజలకు అంతగా పరిచయం లేని, ఇటీవలే పార్టీలో చేరిన ఎం.శ్రీనివాసరావుకు టికెట్టు కేటాయించారు. 
  • నరసన్నపేటలో ఇన్నాళ్లూ జనసేన కోసం చేతిచమురు వదల్చుకున్న లుకలాపు రంజిత్‌ను కాదని అసలు సీన్‌లోనే లేని మెట్టా వైకుంఠానికి అకస్మాత్తుగా టికెట్టు ఖాయం చేశారు. 


 

మరిన్ని వార్తలు