ప్రశ్నించవయ్యా... పవన్ కల్యాణ్

27 Feb, 2015 23:20 IST|Sakshi
ప్రశ్నించవయ్యా... పవన్ కల్యాణ్

గుంటూరు (మంగళగిరి): రాజధాని నిర్మాణానికి తమ భూములిచ్చేస్తే తాము రోడ్డున పడతామని.. ప్రశ్నించేందుకే పార్టీ పెట్టానని చెప్పి తమచేత తెలుగుదేశం పార్టీకి ఓట్లేయించిన జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ దీనిపై ప్రశ్నించాలని గుంటూరు జిల్లా మంగళగిరి మండలం బేతపూడి రైతులు, జనసేన కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఈ మేరకు గ్రామంలో శుక్రవారం పెద్ద ఎత్తున ధర్నా చేశారు. ప్రశ్నించవయ్యా పవన్‌కళ్యాణ్. నీవు ప్రశ్నించే సమయం వచ్చింది. నిన్ను నమ్మి బాబుకు ఓట్లేస్తే మా కుటుంబాలను కూల్చేస్తున్నాడు.. మహాప్రభో ప్రశ్నించు’ అంటూ నినాదాలతో హోరెత్తించారు.

భూసమీకరణ వల్ల తాము ఉపాధి కోల్పోతామని మంత్రులకు, అధికారులకు చెప్పామనీ, వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఆర్కే ఆధ్వర్యంలో  9.2ఫారాలు (అభ్యంతర పత్రాలు) అందజేశామనీ, అయినా భూసేకరణ చేపడతామంటూ ముఖ్యమంత్రి ప్రకటించడంతో గ్రామ యువకులు, రైతుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఎవరి మాట విని తాము టీడీపీకి ఓట్లేశామో వారే ఇప్పుడు తమకు అండగా నిలవాలని వారు గ్రామంలో ఫ్లెక్సీలు కట్టి ధర్నాకు దిగారు.

అనంతరం తమకు ప్యాకేజీలు వద్దని, భూములు ఇచ్చేదిలేదని వారు స్పష్టం చేశారు. భూసమీకరణ నుంచి తమ గ్రామాన్ని మినహాయించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేకుంటే తమ ప్రాణాలు తీసుకుంటామని హెచ్చరించారు. తమ శవాలపై రాజధాని నిర్మించుకోండంటూ  పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆ తర్వాత రైతులు గ్రామస్తుల అధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు.

మరిన్ని వార్తలు