ఉరి | Sakshi
Sakshi News home page

ఉరి

Published Fri, Feb 27 2015 11:20 PM

ఉరి

కవిత
 
పుస్తకాల్లోని పేజీలు
కాగితపు పడవలై
ఇంటి ముందు వర్షపునీటిలో
వయ్యారంగా వెడుతుంటే
ఎవరిది ముందనే పోటీ...
చిలుక కొరికిన జామపళ్ల కోసం
పోటీపడుతూ లేస్తూ
రేగుముళ్లు వదిలిన సంతకాల్ని
దాచిపెట్టే ప్రయత్నం...
గుంకుతున్న సూరుణ్ణి కమ్మేసే
ఆవుదూడల ధూళి వెంట
అడుగులో అడుగు...
 
దొంగతనంగా తెంపుకున్న
మక్కకంకులు దాచి పెట్టుకున్న
గడ్డివాముల్లో దాగుడుమూతలు...
రాత్రివేళ లెక్కపెట్టిన చుక్కలు
తెలియకుండానే నిద్రలో
కొత్త లోకాలకు తెరచిన తలుపులు...
 
ఈ జ్ఞాపకాలకు ఇక జ్ఞాపకాల్లో కూడా
తావుండదట. ప్రాజెక్టు వస్తోందట.
 ఊళ్లో మిగిలిన
 మొండి గోడల్ని కూడా ముంచేస్తుందట.
 చెట్టూ పుట్టని కలిపేసుకుంటుందట.
 ఇంటినీ గుడినీ మింగేస్తుందట
 మట్టినీ మనిషినీ తెంచేస్తుందట
 అసలు- ఊరే ఉండదట.
 ఊరే లేకపోతే
 జ్ఞాపకాలు ఎలా ఉంటాయి?
 మనుషులు ఎలా ఉంటారు?
 మట్టికి మనిషికి అనుబంధం
 ఎలా ఉంటుంది?
 ఊరికి కాదు
 నాకు ఉరి వేసినట్టుగా ఉంది.
 గుండె పిండేసినట్టుగా ఉంది.
 ఊరే లేకపోతే
 నేను కూడా ఉన్నా లేనట్టే.
 - ఎస్.గోపినాథ్‌రెడ్డి
 95055 55400
 
 

Advertisement
Advertisement