పేటలో జన్మభూమి రసాభాస

11 Oct, 2014 00:22 IST|Sakshi
పేటలో జన్మభూమి రసాభాస

నరసరావుపేట వెస్ట్
 పట్టణంలోని వన్నూరుకుంట పార్క్ సమీపంలో శుక్రవారం ఉదయం మున్సిపల్ అధికారులు నిర్వహించిన జన్మభూమి-మాఊరు పదకొండో వార్డు సభ రసాభసాగా మారింది. సభకు ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి రాగానే జై కోడెల అంటూ టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేయగా.. ప్రతిగా జై గోపిరెడ్డి, జై జగన్ అంటూ వైఎస్సార్ సీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. వైఎస్సార్ సీపీ కౌన్సిలర్ షేక్ మున్నీపై పథకం ప్రకారం టీడీపీకి చెందిన మహిళలు దాడిచేసి ఆమెను కిందపడేశారు.

ఇరువర్గాలను అదుపు చేసేందుకు సీఐ ఎం.వి.సుబ్బారావు ఆధ్వర్యంలో పోలీ సులు స్వల్పంగా లాఠీచార్జి చేశారు. సభ సజావుగా జరిగేందుకు అవకాశం లేకపోవడంతో వాయిదా వేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ డి.శ్రీనివాసరావు, డీఈ సీతారామారావులు ప్రకటించారు. వివరాల్లోకి వెళితే.. జన్మభూమి కార్యక్రమం లో భాగంగా వన్నూరుకుంట పార్కు వద్ద ఇన్‌చార్జి మున్సిపల్ కమిషనర్ డి.శ్రీనివాసరావు అధ్యక్షతన సభను  నిర్వహించేందుకు సమాయుత్తమయ్యారు. సభకు వచ్చిన ఎమ్మెల్యే గోపిరెడ్డిని చూడగానే అధికారపార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దపెట్టున జై కోడెల అంటూ నినాదాలు చేయడం మొదలు పెట్టారు.

అందుకు ప్రతిగా వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు కూడా జై జగన్, జై గోపిరెడ్డి అంటూ నినాదాలు చేశారు. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు వచ్చేందుకు యత్నించగా సీఐలు ఎం.వి.సుబ్బారావు, బి.కోటేశ్వరరావు, ఎస్‌ఐ లోకనాథ్ తమ సిబ్బందితో ఇరువర్గాల మధ్య నిలబడి శాంతింపచేసేందుకు యత్నించారు. ఈలోగా వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ షేక్.మున్నిపై టీడీపీకి చెందిన ఐదుగురు మహిళలు దాడిచేశారు. దీంతో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు కోపోద్రికులయ్యారు. పరిస్థితి విషమిస్తుందని గమనించిన పోలీసులు స్వల్పంగా ఇరువర్గాలపై లాఠీచార్జి చేశారు.

పరిస్థితి చేజారిపోవడంతో వాయిదా వేస్తున్నట్లు మున్సిపల్ డీఈ సీతారామారావు ప్రకటించారు. అనంతరం తన వద్దకు వచ్చిన కమిషనర్ డి.శ్రీనివాసరావుపై ఎమ్మెల్యే గోపిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విధంగా మీరు వ్యవహరిస్తే సాయంత్రం 12వ వార్డులో జరిగే సభ కూడా జరపలేరన్నారు.  ఈ సంఘటనలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు ఎంపీపీ కొమ్మాలపాటి ప్రభాకరరావు, జెడ్పీటీసీ నూరుల్‌అక్తాబ్, వైఎస్సార్ సీపీ కన్వీనర్లు ఎస్‌ఏ హనీఫ్, కొమ్మనబోయిన శంకరయాదవ్, పట్టణ మహిళా కన్వీనర్ ఎస్.సుజాతాపాల్, పట్టణ  అధికార ప్రతినిధి బాపతు రామకృష్ణారెడ్డి, కౌన్సిలర్లు మాగులూరి రమణారెడ్డి, మాడిశెట్టి మోహనరావు, పాలపర్తి వెంకటేశ్వరరావు, మాజీ వైస్ చైర్మన్ షేక్ సైదావలి  పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు