సీఎంతో జపాన్‌ కాన్సుల్‌ జనరల్‌ భేటీ

30 Jul, 2019 04:10 IST|Sakshi
సచివాలయంలోని సీఎం చాంబర్‌లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను కలిసిన జపాన్‌ కాన్సుల్‌ జనరల్‌ కొజిరొ ఉచియామ

పరిశ్రమల ఏర్పాటు సహా ద్వైపాక్షిక అంశాలపై చర్చ

అవినీతిలేని పాలన కోసం ఏపీలో తీసుకుంటున్న చర్యలను వివరించిన సీఎం

ఎలక్ట్రిక్‌ బస్సులు, కోల్డ్‌ స్టోరేజీలు, అగ్రిల్యాబ్‌ల ఏర్పాటులో పెట్టుబడులు పెట్టాలని సూచన

జపాన్‌లో పర్యటించాలని కోరిన ఉచియామ 

సాక్షి, అమరావతి: చెన్నైలోని జపాన్‌ కాన్సుల్‌ జనరల్‌ కొజిరొ ఉచియామ సోమవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో భేటీ అయ్యారు. అసెంబ్లీలోని ముఖ్యమంత్రి చాంబర్‌లో ఇరువురు సమావేశమై రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు సహా ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా జపాన్‌లో పర్యటించాలంటూ సీఎంను ఉచియామ ఆహ్వానించారు. అవినీతిలేని, పారదర్శక పాలన కోసం రాష్ట్రంలో తీసుకుంటున్న చర్యలను సీఎం వివరించారు. దీనివల్ల భూములు, నీళ్లు, కరెంటు రేట్లు తగ్గుతాయని, పారిశ్రామిక వర్గాలకు మేలు జరుగుతుందని తెలిపారు. పరస్పర ప్రయోజనాలే లక్ష్యంగా ఇరువురి భాగస్వామ్యాలు ఉండాలని ఆకాంక్షించారు. కొత్తగా తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ అండ్‌ మానిటరింగ్‌ చట్టం ద్వారా పెట్టుబడుల ఆలోచన నుంచి ఉత్పత్తి దశ వరకూ కూడా పూర్తిస్థాయిలో సహాయకారిగా ఉంటామని సీఎం పేర్కొన్నారు. పరిశ్రమలు వృద్ధి చెందాలంటే శాంతియుత వాతావరణం కూడా అవసరమని, ఇందులో భాగంగానే పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు కల్పించేలా రిజర్వేషన్లు తెచ్చామని స్పష్టం చేశారు. నైపుణ్యాభివృద్ధి ఉన్న మానవ వనరుల కోసం ప్రత్యేక కేంద్రాల ఏర్పాటు అంశాన్నీ వివరించారు. ఎలక్ట్రిక్‌ బస్సులను ప్రవేశపెడుతున్నామని, ఆ దిశగా పెట్టుబడులు పెట్టే ఆలోచన చేయాలని సీఎం కోరారు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, ఔషధ తయారీ పరిశ్రమల కోసం భూములు కేటాయించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కోల్డ్‌ స్టోరేజీలు, గోదాములు, అగ్రిల్యాబ్‌లు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనలో పెట్టబడులకు అవకాశాలను పరిశీలించాలని సూచించారు. రాష్ట్రంలో ఆహార ఉత్పత్తి పెంపుదల, మత్స్యరంగాల్లో అవకాశాలపై జపాన్‌ వ్యవసాయశాఖ మిజుహో ఇన్ఫర్మేషన్, రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ద్వారా ఇప్పటికే విశ్లేషణ చేయిస్తోందని ఉచియామ పేర్కొన్నారు.

నూతన ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా పెట్టుబడులు
సీఎస్‌తో సమావేశమైన కాన్సుల్‌ జనరల్‌ కొజిరో ఉచియామ
ఏపీ ప్రభుత్వం తగిన భూమిని సమకూర్చితే డెడికేటెడ్‌ ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, ఫార్మాస్యూటికల్స్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ క్లస్టర్, అభివృద్ధి చెందిన ఓడరేవులకు తగిన మౌలిక సదుపాయాల కల్పన రంగాల్లో తోడ్పడేందుకు జపాన్‌ కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని ఆ దేశ కాన్సుల్‌ జనరల్‌ కొజిరో ఉచియామ పేర్కొన్నారు. నూతన ప్రభుత్వం ప్రాధాన్యతలకు అనుగుణంగా ముందుకు తీసుకువెళ్లేందుకు కృషి చేస్తున్నట్టు చెప్పారు. సోమవారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంతో ఆయన భేటీ అయ్యారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ వ్యాపారం అంశంలో ఆంధ్రప్రదేశ్‌ను జపాన్‌ కంపెనీలు అత్యంత ప్రాధాన్యతా డెస్టినేషన్‌ పాయింట్‌గా భావిస్తున్నట్టు ఉచియామ తెలిపారు. రాష్ట్రంలో కోల్డ్‌ స్టోరేజి, వేర్‌ హౌసింగ్, సోర్సింగ్‌ కేంద్రాలు, అగ్రి ల్యాబ్స్, తదితర మౌలిక సదుపాయాలకు తోడ్పాటును అందించేందుకు జపాన్‌ పెట్టుబడిదారులు ఆసక్తి కనబరుస్తున్నట్టు వివరించారు. ఆర్థిక, విద్యా, సాంస్కృతిక, పర్యాటక రంగాల్లో ద్వైపాక్షిక సహకారానికి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఆంధ్ర విశ్వవిద్యాలయం, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ విద్యార్థులతో ఎక్సేంజ్‌ ప్రోగ్రామ్స్‌కు ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే జపాన్‌ కంపెనీలకు అవసరమైన పూర్తి సహాయ సహకారాలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు. 

మరిన్ని వార్తలు