జెన్‌కోకు విభజన కష్టాలు!

16 Aug, 2013 01:04 IST|Sakshi
జెన్‌కోకు విభజన కష్టాలు!

సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన ప్రకటన జెన్‌కోకు కొత్త కష్టాలు తెచ్చిపెట్టింది. ఉద్యమాల నేపథ్యంలో కేబినెట్ సమావేశం కాకపోవడంతో 1,105 అదనపు పోస్టుల భర్తీకి ప్రభుత్వ అనుమతి నిలిచిపోయింది. మరోవైపు అనుభవజ్ఞులైన నలుగురు ఉన్నతాధికారుల పదవీకాలం మరో రెండు నెలల్లో ముగియనుంది. రాష్ట్ర విభజన ప్రక్రియ నేపథ్యంలో ఇప్పటికే విద్యుత్ రంగంలో అనుభవజ్ఞులైన ఈ అధికారుల అవసరం ఉందని ఇంధనశాఖ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. జెన్‌కో జాయింట్ మేనేజింగ్ డెరైక్టర్ (జేఎండీ)గా ఉన్న ప్రభాకర్‌రావుతోపాటు హైడల్, థర్మల్ విద్యుత్ ప్లాంట్ల డెరైక్టర్లు ఆదిశేషు, ఆంజనేయరావుల పదవీకాలం అక్టోబర్ నెలలో ముగియనుంది. మరో డెరైక్టర్ (టెక్నికల్) పదవీ కాలం కూడా అక్టోబర్ నెలలోనే ముగియనుంది. ప్రభుత్వం ఇప్పటికే ఈ పోస్టును రద్దు చేసింది. అయితే, విభజన ప్రక్రియ నేపథ్యంలో ఆస్తులు, అప్పులు, ప్రాజెక్టులను ఇరు ప్రాంతాలకు సక్రమంగా పంపిణీ చేయడంలో అనుభవజ్ఞులైన ఈ అధికారుల అవసరం ఎంతో ఉందని ఇంధనశాఖ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
 
 అదేవిధంగా ప్రస్తుతం జేఎండీగా ఉన్న ప్రభాకర్‌రావుకు గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ బోర్డు (ఏపీఎస్‌ఈబీ)ను మూడు ముక్కలుగా (జెన్‌కో, ట్రాన్స్‌కో, డిస్కంలు) చేసిన సమయంలో ఆస్తుల పంపకంలో కీలకపాత్ర పోషించారు. అందువల్ల విభజన ప్రక్రియ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న వారినే మరికొద్ది కాలంపాటు పొడిగించాల్సిన అవసరం ఉందని ఈ వర్గాలు పేర్కొంటున్నాయి. మరోవైపు ఈ పోస్టుల భర్తీకి ఇప్పటివరకూ నోటిఫికేషన్ ప్రక్రియకు ప్రభుత్వం ఆమోదం కూడా లభించలేదు. ఇప్పటికిప్పుడు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ భర్తీ చేసేందుకు రెండు నెలల సమయం సరిపోదని... ఒకవేళ హడావుడిగా భర్తీ చేసినప్పటికీ కొత్తవారు కావడంతో అనుభవలేమితో విభజన సమయంలో కొత్త ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందనే అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత అధికారులను కొంతకాలం పొడిగించాలని ఉద్యోగ సంఘాలు కూడా కోరుతున్నాయి.

>
మరిన్ని వార్తలు