కాలేజీలన్నీ లోపాల పుట్టలే!

16 Aug, 2014 00:25 IST|Sakshi
కాలేజీలన్నీ లోపాల పుట్టలే!

జేఎన్‌టీయూ అధికారుల తనిఖీల్లో వెల్లడి
బోధనా  సిబ్బంది తక్కువే..
మౌలిక సౌకర్యాలకూ దిక్కులేదు
నేడు ప్రభుత్వానికి నివేదిక

 
హైదరాబాద్: ల్యాబ్ ఉంటే ఫ్యాకల్టీ లేరు, ఫ్యాకల్టీ ఉంటే ల్యాబ్ లేదు.. రెండూ ఉన్నావిద్యా ప్రమాణాల్లేవు.. లైబ్రరీల్లో పుస్తకాల్లేవు, సరైన మౌలిక సౌకర్యాలకూ దిక్కులేదు.. ఇదీ రాష్ట్రంలోని చాలా ఇంజనీరింగ్ కళాశాలల పరిస్థితి. చాలా కళాశాలల్లో నిబంధనల ప్రకారం ఉండాల్సిన వసతులేమీ లేవు, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఏర్పాట్లూ లేవు.. ఇంజనీరింగ్ కళాశాలల్లో జేఎన్‌టీయూహెచ్ నిర్వహించిన తనిఖీల్లో ఇలాంటి ఎన్నో కఠిన వాస్తవాలు వెల్లడయ్యాయి. ఈ ఏడాది ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలు చేపట్టేందుకు హైదరాబాద్ జేఎన్‌టీయూ నేతృత్వంలో ఏర్పాటైన అఫిలియేషన్ల కమిటీల కళాశాలల్లో తనిఖీలు ప్రారంభించిన విషయం తెలిసిందే. 17వ తేదీ నుంచి ఎంసెట్ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభం కానుండడంతో 16వ తేదీ సాయంత్రానికి ప్రవేశాలు చేపట్టే కాలేజీలపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో శుక్రవారం వరకు కళాశాలలను తనిఖీ చేసిన అధికారులు... రాత్రంతా వాటిని క్రోడీకరించే పనిలో పడ్డారు. కళాశాలల వారీ పరిస్థితులతో కూడిన నివేదికను శనివారం ఉదయమే ప్రభుత్వానికి పంపించేందుకు జేఎన్‌టీయూ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తంగా 319 ఇంజనీరింగ్ కాలేజీల్లో తనిఖీలు నిర్వహించగా... అందులో వంద కాలేజీల్లో చాలా ఎక్కువగా లోపాలను గుర్తించినట్లు తెలిసింది.

మిగతా కాలేజీల్లోనూ చాలా వాటిలో నిబంధనలకు అనుగుణంగా ఫ్యాకల్టీ, ల్యాబ్‌లు, మౌలిక సౌకర్యాలు లేనట్లుగా అధికారుల తనిఖీలో తేలినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వాటన్నింటినీ పరిశీలించి ఏయే కళాశాలలకు అఫిలియేషన్లు ఇస్తుందనే విషయం శనివారం వెల్లడికానుంది. దీంతో ఆదివారం ఉదయం నుంచి విద్యార్థులు వెబ్ ఆప్షన్లు ఇచ్చే సమయానికి కళాశాలల సంఖ్య, సీట్ల వివరాలు పూర్తిగా అందుబాటులోకి రానున్నాయి. ఏయే కాలేజీలకు అఫిలియేషన్లు వస్తాయి..? ఏయే కాలేజీలకు అనుమతులు రావన్న దానిపై యాజమాన్యాలు కూడా ఆతృతగా ఎదురుచూస్తున్నాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కువ లోపాలున్న కాలేజీలకు అనుమతులు కష్టమేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో ఆదివారం నుంచే జరిగే వె బ్ ఆప్షన్ల ప్రక్రియలో 220 వరకే కాలేజీలు అందుబాటులో ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం.
 
 
 

మరిన్ని వార్తలు