యువతకు ఉద్యోగాల్లేవు

19 Dec, 2018 07:19 IST|Sakshi

శ్రీకాకుళం: ‘అన్నా ఎంత చదువుకున్నా ఉద్యోగాలు రావడం లేదు. ప్రభుత్వం ఎలాంటి ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయడం లేదు’ అని కోటబొమ్మాళి మండలం రేగులపాడు గ్రామానికి చెందిన జి.పార్వతి జగన్‌కు చెప్పారు. మీరు అధికారంలోకి రాగానే విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని కోరారు.

 రుణాలు లేవు
‘ఎస్సీ కార్పొరేషన్‌ రుణా లకు జన్మభూమి కమిటీలు అడ్డు తగులుతున్నాయి. నేను 2016లో దరఖాస్తు చేసుకున్నాను. కానీ ఇవ్వలేదు’ అని దరివాడకు చెందిన సల్ల రామయ్య జగన్‌ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. మీ పాలనలో అందరికీ న్యాయం చేయాలని ఆకాంక్షించారు.  

 దరఖాస్తులే మిగులుతున్నాయి
‘అయ్యా.. 65 ఏళ్లు నిండుతున్నా మేం దరఖాస్తు చేసుకోవడమే తప్ప పింఛన్‌ అందడం లేదు’ అని దరి వాడకు చెందిన కొర్ను లక్ష్మణమూర్తి జగన్‌కు చెప్పారు. జన్మభూమి సభల్లో దరఖాస్తు చేసుకున్నా పిం ఛన్‌ అందడం లేదన్నారు. వృద్ధాప్యంలో ఆసరా లేక ఇబ్బంది పడుతున్నామని తెలిపారు.  

 ‘బంగారు తల్లి’ ఏదీ..?
‘ఆడ బిడ్డలను ఆదుకునే బంగారు తల్లి పథకాన్ని ప్రభుత్వం కొనసాగించడం లేదు’ అని కోటబొమ్మాళి మండలం కొబ్బరిచెట్ల పేట గ్రామానికి చెందిన బమ్మిడి హేమలత ప్రతిపక్ష నేతకు చెప్పారు. బంగారు తల్లి పథకానికి దరఖాస్తు చేసుకోవడమే గానీ ప్రోత్సాహం అందడం లేదన్నారు.

 సాగునీరు లేదు
‘మా గ్రామం పక్క నుంచే వంశధార ఎడమ కాలువ ద్వారా సాగునీరు ప్రవహిస్తున్నా మా చెరువుల్లో మాత్రం నీరు ఉండడం లేదు’ అని జలుమూరు మండలం దరివాడకు చెందిన కొర్ని ప్రకాశరావు జగన్‌కు తెలిపారు. సాగునీరు లేకపోవడంతో 300 ఎకరాలు బీడు భూములుగా మారుతున్నాయని చెప్పారు. దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు.  

 పరిహారం అందలేదు
‘వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులమని తిత్లీ పరిహారం ఇవ్వలేదు. నా రెండెకరాల పొలం తుఫాన్‌ ధాటికి పూర్తిగా పాడైపోయింది’ అని దరివాడకు చెందిన కొన్నాన సింహాచలం జగన్‌కు చెప్పారు. అధికారులకు చెప్పినా ఫలితం లేదని, తనలాంటి వారికి న్యాయం చేయాలని కోరారు.  

 ఎస్టీ జాబితాలో చేర్చాలి
‘అన్నా  ఏనేటి కొండ కులం ఎస్టీ జాబితాలో ఉండేది. తెలుగు దేశం ప్రభుత్వం మా కులాన్ని ఎస్టీ జాబితా నుంచి తొలగించింది.’ అని కోటబొమ్మాళి మండలం నీలంపేటకు చెందిన బొన్నె లక్ష్మి జగన్‌కు తెలిపారు. తాము పూర్తిగా వెనుకబడిపో యి ఉన్నామని, మీరు ముఖ్యమంత్రి కావాలని తిరుపతి కూడా వెళ్లామని చెప్పారు. అధికారంలోకి రాగానే న్యాయం చేయాలని కోరారు. 

మరిన్ని వార్తలు