ప్రభుత్వ పెద్దల అండతో ‘బెల్టు’కు జోష్‌

27 Jul, 2018 03:38 IST|Sakshi

అమ్మకాలతో ఆదాయం పెంచుకుంటున్న మద్యం సిండికేట్లు

షాపుల రద్దుపై తొలి సంతకం చేసినా పట్టించుకోని ముఖ్యమంత్రి

15 రోజుల్లో ‘బెల్ట్‌’ తీయకుంటే షాపుల్ని ధ్వంసం చేస్తామన్న వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం

సాక్షి, అమరావతి: బెల్టు షాపులు ఎక్కడా లేకుండా చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పడం పెద్ద బూటకమని స్పష్టమవుతోంది. రాష్ట్రంలో బెల్టు షాపులు నానాటికీ విస్తరిస్తున్న తీరే ఆ విషయం బయటపెడుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ బెల్టు షాపులను మరింత విస్తరించాలని ఆలోచనలో ప్రభుత్వ పెద్దలు ఉన్నారని తెలుస్తోంది. నిజానికి  టీడీపీ నేతలే బెల్టుషాపులు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు ఇప్పటికే ఉన్నాయి.

ఫోన్‌ కొడితే మద్యం బాటిళ్లను ఇంటికే చేరవేస్తూ సిండికేట్లు ప్రజలను మద్యానికి మరింత బానిసలను చేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు ఫ్యాన్సీ, కూల్‌డ్రింక్‌ షాపులు, మెడికల్‌ షాపుల్లో బెల్టు షాపులు నిర్వహించిన వారు ఇప్పుడు మద్యం గోడౌన్లు, తోపుడు బండ్లపైనా అమ్మకాలు జరుపుతున్నారు. ఒక్కో బాటిల్‌పై రూ.40 నుంచి రూ.50 వరకు అదనంగా వసూలు చేస్తూ.. పగలు–రాత్రి అనే తేడా లేకుండా విచ్చలవిడిగా అమ్మకాలు సాగిస్తున్నారు.

ఇటీవలే ప్రతి మద్యం షాపునకు అనుబంధంగా ఓ గోడౌన్‌ ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతిచ్చింది. గోడౌన్లపై స్థానికులు ఫిర్యాదులు చేస్తున్నా.. అనుమతులు ఉన్నాయంటూ అధికారులు పట్టించుకోవడంలేదు. గోడౌన్లను కూడా సిండికేట్లు కేంద్రంగా చేసుకుని బెల్ట్‌ షాపులు నడుపుతున్నారు. ప్రభుత్వ పెద్దల ఆసరాతో ఎన్నికల్లోగా బెల్టు షాపులు మరిన్ని పెంచేందుకు మద్యం సిండికేట్లు ఇప్పటినుంచే ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

‘బెల్టు’ ఆదాయం రూ.9 వేల కోట్ల పైనే..
బెల్టు షాపుల ద్వారా మద్యం వ్యాపారం ఏటా రూ. 9 వేల కోట్లకు పైగా జరుగుతోందని అధికారులే చెబుతున్నారు. రాష్ట్రంలో 4,380 మద్యం షాపులు, 800 వరకు బార్లు ఉన్నాయి. ఒక్కో మద్యం షాపునకు అనుబంధంగా పదికి తక్కువ కాకుండా బెల్టు షాపులు కొనసాగుతున్నాయి. ఏడాదికి మద్యం, బీరు అమ్మకాలు మొత్తం కలిపి రూ. 17,291 కోట్ల మేర జరుగుతున్నాయి.

ఇందులో రూ. 9 వేల కోట్లకు పైగా అంటే సగంకు పైగా బెల్టు దుకాణాల ద్వారానే అమ్మకాలు జరుగుతున్నాయని స్పష్టమవుతోంది. ఇక అన్ని జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో బెల్టు షాపుల వేలం పాటలకు రంగం సిద్ధమైంది. మద్యం వ్యాపారులు సిండికేట్‌ గొడుగు కిందకు రాకుండా వ్యాపారం నిర్వహించినా.. బెల్టు షాపుల విషయంలో పోటీ పడినా.. ఎక్సైజ్‌ శాఖ అధికారులు మధ్యవర్తిత్వం చేస్తున్నారన్న ఫిర్యాదులున్నాయి.

సీఎం తొలి సంతకం ఏమైంది?
సీఎం చంద్రబాబు అధికారంలోకి రాగానే చేసిన తొలి సంతకాల్లో బెల్టు షాపులు రద్దు కూడా ఒకటి. అయితే ఇప్పటి వరకూ దానిపై చర్యలు లేవు. బుధవారం ఎక్సైజ్‌ శాఖ అధికారులను వైఎస్సార్‌ సీపీ మహిళా విభాగం నేతలు ఎమ్మెల్యే రోజా ఆధ్వర్యంలో కలసి రాష్ట్రంలో బెల్టు షాపులు తొలగించాలని వినతి పత్రం అందించారు. 15 రోజుల్లోగా బెల్టు షాపుల రద్దుపై చర్యలు తీసుకోకుంటే మహిళలే మద్యం దుకాణాల్ని ధ్వంసం చేస్తారన్నారు.

మరిన్ని వార్తలు